ఈ కథ అందరి కోసం | Family entertainers not sex comedies for us: Sajid-Farhad | Sakshi
Sakshi News home page

ఈ కథ అందరి కోసం

Published Tue, May 20 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

ఈ కథ అందరి కోసం

ఈ కథ అందరి కోసం

పెద్దలు మాత్రమే వినాల్సిన సంభాషణలు రాయడంలో సిద్ధహస్తులుగా పేరుగాంచిన రచయితలు సాజిద్, ఫరాద్‌లు దర్శకులుగా మారారు. కథలు రాసి కడుపుబ్బా నవ్వించిన వీరిద్దరు ఇక దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందో...? అందులో ఎన్నిసార్లు కళ్లు మూసుకోవాల్సిన సన్నివేశాలు, చెవులు మూసుకోవాల్సిన సంభాషణలు ఉంటాయోనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఈ దర్శకద్వయం చెవిలో కూడా పడిందట. దానికి వెంటనే వారిద్దరు వివరణ ఇచ్చుకుంటూ... ‘మేమిద్దరం తెరకెక్కించే ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ సినిమా కుటుంబంలోని అందరినీ దృష్టిలో ఉంచుకొని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటిదాకా మేం రాసిన బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్-2, రెడీ, గోల్‌మాల్ రిటన్స్, గోల్‌మాల్-3 వంటి చిత్రాల్లో అశ్లీల సంభాషణలు ఉన్నాయన్నది వాస్తవం కాదు.
 
  అందుకు మేమెప్పుడూ అవకాశం ఇవ్వలేదు. నిజంగా అటువంటి సందర్భానికి సంభాషణలు రాయాల్సి వస్తే చాలా అసౌకర్యంగా అనిపించేది. ఓ పని చేయడం అసౌకర్యంగా అనిపిస్తే ఆ పని ఎప్పుడూ ఎదుటివారికి నచ్చేలా ఉండదు. అందుకే ఆ ‘గిరి’లోనుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాం. మా తొలి సినిమాతో ఆ గిరిలో నుంచి సులభంగా బయటపడతామని భావిస్తున్నాం. ఈ సినిమాకు కథ రాసుకునేముందే కుటుంబంలోని పిల్లలు, పెద్దలు, యువతీయువకులు.. ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకున్నాం. సినిమాను కుటుంబ కథాచిత్రంగా తీర్చిదిద్దుతున్నాం. అక్షయ్‌కుమార్ సినిమాలో నటిస్తున్నాడంటే ప్రేక్షకులకు కొన్ని అంచనాలుంటాయి. వాటిని పూర్తిస్థాయిలో మేం అందుకోగలమనే విశ్వాసంతో ఉన్నాం. నాణ్యమైన వినోదంతో దర్శకులుగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాం.
 
 అందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అక్షయ్ కుమార్ విషయానికి వస్తే ఆయన ఓ మంచి నటుడు మాత్రమే కాదు గొప్ప మానవతావాది కూడా. సినిమా బాగా రావడం కోసం ఆయన అందిస్తున్న ప్రోత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది. ఈ సినిమాలో కూడా శిక్షణ పొందిన కుక్కలు నటిస్తున్నాయి. ‘హాథీ మేరే సాథీ’, ‘తేరీ మెహర్‌బనియన్’ చిత్రాల్లో ఈ కుక్కలు నటించాయి. అవి ఎంతగా ప్రేక్షకాదరణను పొందాయో మీకు తెలిసిందే. మరోసారి తాజా చిత్రం ద్వారా ప్రేక్షకులను నవ్వించనున్నాయి. ఈ సినిమా ద్వారా కేవలం ప్రేక్షకులను నవ్వించాలని మాత్రమే అనుకోవడంలేదు. కంటతడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే ఎటువంటి ప్రయోగాల జోలికి వెళ్లడంలేదు. రోహిత్‌శెట్టితో కలిసి రెండుమూడు సినిమాలు చేశాం. అయితే వాటి ప్రభావం తాజా సినిమాలో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాం. మా సినిమాపై దర్శకుడు రాజుహిరానీ ప్రభావం కాస్త కనిపిస్తుంది. ఆయన చిత్రాల్లో వినోదం, భావోద్వేగాలు, సందేశాలు ఎలా ఉంటాయో మా సినిమాలో కూడా ఆ అంశాలన్నీ ఉండేలా జాగ్రత్త పడుతున్నామ’న్నారు.
 

Advertisement
Advertisement