ప్యారిస్, న్యూస్‌లైన్: మేల్‌మరువత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధర్ పీఠంలో తైపూసం జ్యోతి ప్రజ్వలన ఉత్సవాలను గురువారం సా యంత్రం ఆధ్యాత్మిక గురువు బం గారు అడిగళార్ జ్యోతిని వెలిగించి ఘనంగా నిర్వహించారు. నవంబర్ నెల 22వ తేదీ నుంచి తైపూసం శక్తి మాలను ధరించిన భక్తులు ఆలయం లో కొలువుదీరిన ఆదిపరాశక్తి అమ్మవారికి ప్రతిరోజూ అభిషేకం చేస్తూ వచ్చారు. గురువారంతో ఇరుముడి ఉత్సవాలు ముగిశాయి. తైపూస ఉత్సవాలు బుధవారం వేకువజామున 9 గంటలకు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని సిద్ధర్ పీఠం ఉపాధ్యక్షుడు శ్రీదేవి రమేష్ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు సిద్ధర్ పీఠం అధ్యక్షురాలు లక్ష్మీ బంగారు అడిగళార్ కలశ పూజను, యాగాన్ని నిర్వహించారు. రాత్రి 8 గంటలకు దిండుగల్ అంగింగు సంగీత బృందం ఆధ్వర్యంలో సంగీత కచేరి చేపట్టారు. తైపూస జ్యోతిని గురువారం సాయంత్రం 4 గంటలకు ఆదిపరాశక్తి సిద్ధర్ పీఠం ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగలార్ వెలిగించి భక్తులకు చూపారు. సాయంత్రం 5 గంటలకు కలైమామణి డ్రమ్స్ శివమణి సంగీత కార్యక్రమం జరిగింది. అనంతరం ఆధ్యాత్మిక గురువు ఇంటిలో గోపూజ చేసి, ప్రధాన జ్యోతిని లక్ష్మీ బంగారు అడిగళార్ వెలిగించారు. దాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో కరగాట్టం, ఒయిలాట్టం, పొయ్‌కాల్ కుదిరై వంటి గ్రామీణ కళాకారులు నృత్యాలను ప్రదర్శించారు. ఆలయానికి చేరిన ప్రధాన జ్యోతిని అందుకున్న బంగారు అడిగళార్ ఆలయంలో ఉన్న తైపూసం జ్యోతిని వెలిగించారు. అనంతరం దీపారాధన చేసి భక్తులు హారతి చూపించారు. ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆకాశ బాణసంచా వేడుక కనువిందు చేసింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా తైపూసం ఉత్సవాలు
Published Sat, Jan 18 2014 6:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement