‘థాయ్‌పుసం’ తెలంగాణ స్టైల్లో! | Thaipusam utsavam in Telangana style | Sakshi
Sakshi News home page

‘థాయ్‌పుసం’ తెలంగాణ స్టైల్లో!

Published Wed, Mar 22 2023 3:18 AM | Last Updated on Wed, Mar 22 2023 8:17 AM

Thaipusam utsavam in Telangana style - Sakshi

థాయ్‌పుసం.. తమిళులకు ఇదో ప్రధాన ఉత్సవం. ఒంటికి శూలాలు గుచ్చుకుని అత్యంత భక్తిప్రపత్తులతో సుబ్రమణ్యస్వామికి మొక్కులు చెల్లించే వేడుక. తమిళనాడుతోపాటు మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఇండోనేషియా,  ఆ్రస్టేలియా తదితర దేశాల్లో స్థిరపడిన తమిళ ప్రజలు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే, తెలంగాణలోనూ థాయ్‌పుసంను జరుపుతారు. అదెక్కడ? ఎలా జరుపుతారు? థాయ్‌పుసంకు మనకు ఉన్న సంబంధమేంటి?అన్న వివరాలు తెలుసుకోవాలంటే..  

వందలఏళ్లతరువాత మాతృదేశానికి.. 
1962లో బర్మాలో సైనిక తిరుగుబాటు జరిగిన అనంతరం అక్కడి భారతీయులను కట్టుబట్టలతో దేశం ఖాళీ చేయించారు. భారతీయ మహిళల మెడలోని బంగారు పుస్తెలతాళ్లను సైతం లాక్కుని వెనక్కి పంపారు. దీంతో బతుకుజీవుడా అంటూ పలువురు భారతీయులు మాతృదేశానికి వచ్చారు. వీరి కోసం అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో శరణార్థుల శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిల్లో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాం శిబిరం ఒకటి.

1975లో ఇక్కడ శ్రీలంక, తమిళనాడు, ఆంధ్ర నుంచి బర్మాకు వలస వెళ్లిన భారత సంతతివారికి పునరావాసం కల్పించారు. ఈ క్రమంలో అక్కడ జమ్మిచెట్టు కింద స్వయంభూ వెలసిన అమ్మవారిని అప్పటి నుంచి వీరంతా నూకాంబిక–పోచమ్మ అమ్మవారిగా కొలుస్తున్నారు. థాయ్‌పుసం తరహాలో ఇక్కడ కూడా నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 

ఒంటినిండా శూలాలు గుచ్చుకుని.. 
అంతర్గాంలో స్థానిక శరణార్థులు ఏటా ఉగాదికి ముందు అమ్మవారికి నవరాత్రులు నిర్వహించి చివరికి అమావాస్య రోజున ఒంటికి పదునైన శూలాలను గుచ్చుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తమను ఆపదలో ఆదుకుంటుందనే నమ్మకంతో అమ్మవారికి ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. శూలాలు గుచ్చుకున్నా.. భక్తుల శరీరాలపై రక్తం కారదు. సిద్ధహస్తులు, అనుభవజ్ఞులైనవారు రక్తనాళాలు తక్కువగా ఉన్న చోటే శూలాలు, కొక్కాలను గుచ్చుతారట.

కొందరు వీపుపై కొక్కెలు గుచ్చుకుని చిన్న రథాలు కూడా లాగి తమ భక్తి చాటుకుంటారు. ఈ క్రమంలో భక్తుల నెత్తిన మిగతా భక్తులు పాలు పోస్తుంటారు. తరువాత కావడి ఆట్టంపేరిట అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తూ లయబద్ధంగా నర్తిస్తారు. రాత్రిపూట మరికొందరు భక్తులు చింత నిప్పులగుండంలో నడుస్తారు. శరణార్థులంతా అమ్మవారికి మాలధారణ ఆచరిస్తారు.

పసుపు వ్రస్తాలు ధరించిన పురుషులు 21 రోజులు, మహిళలు వారం లేదా 11 రోజులపాటు మాలధారణలో ఉంటారు. ఈ ఉత్సవానికి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా స్థిరపడ్డ వీరి సంతతివారే కాకుండా, లండన్, న్యూజిలాండ్, అండమాన్‌ నికోబార్, శ్రీలంక నుంచి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం అంతర్గాంలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఘనంగానిర్వహించారు.  

అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తున్నాం:రామారావు,ఉత్సవ నిర్వాహకుడు 
మా ముత్తాతలను బ్రిటిష్‌ వారు తోటల్లో పనిచేసేందుకు కూలీలుగా బర్మా (మయాన్మార్‌)లోని రంగూన్‌ (ఇప్పుడుయాంగాన్‌)కు తీసుకెళ్లారు. వారు తమతోపాటు భారతీయ ఆచార వ్యవహారాలను సైతం తీసుకెళ్లారు. తిరిగి ఇండియాకు వచ్చాక మేం మా పూర్వీ కుల ఆచారాలను కొనసాగిస్తున్నాం.

గ్రామంలో వెలిసిన అత్యంత శక్తిమంతురాలైన నూకాంబిక–పోచమ్మ అమ్మవారికి ఏటా ఉత్సవాలు నిర్వహించి మా భక్తిని చాటుకుంటున్నాం. అత్యంత భక్తి, నిష్టలతో శూలాలతోఒంటికి గుచ్చుకుని, బొనమెత్తుకొని చింతనిప్పులపై నడిచి మొక్కులు చెల్లిస్తుంటాం. 
- సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement