అశ్లీల నృత్యాల నిషేధం కోరుతూ పిటిషన్
చెన్నై: దసరా ఉత్సవాల్లో సినీ డ్యాన్సర్ల నత్యాలపై నిషేధం విధించాలంటూ సామాజిక కార్యకర్త రాంకుమార్ ఆదిత్తన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మధురై హైకోర్టు బెంచ్ విచారణకు స్వీకరించింది. తమిళనాడు కులశేఖర పట్టణం ముత్తారమ్మన్ ఆలయంలో ఏటా పది రోజులపాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని, పదవ రోజున శూరసంహారం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో సినీ, టీవీ కళాకారిణులు, ముంబై బార్లలోని డ్యాన్సర్లతో నృత్యాలు చేయిస్తారని పేర్కొన్నారు. ఈ నృత్యాలతో యువత పెడదోవ పడుతున్నారని, ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో నృత్యాలు చేయడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు.
ఈ పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన న్యాయమూర్తులు శశిధరన్, స్వామినాథన్ దీనిపై సంజాయిషీ ఇవ్వాలని తూత్తుకుడి కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. అనంతరం విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేశారు.