Madurai High Court
-
వ్యాన్ డ్రైవర్ భార్యకు అంగన్వాడీ ఉద్యోగం ఇవ్వండి
అన్నానగర్: పోలీసుల దాడిలో మరణించిన వ్యాన్ డ్రైవర్ భార్యకు అంగన్వాడీ వర్కర్‌గా ఉద్యోగం ఇవ్వాలని మధురై హైకోర్టు ఆదేశించింది. పోలీసుల దాడిలో మృతి చెందిన వ్యాన్ డ్రైవర్ భార్య తెన్కాశి జిల్లా శంకరన్ కోవిల్ ఉత్తర పుత్తూరు ప్రాంతానికి చెందిన మీనా మదురై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త మురుగన్ (36) వ్యాన్ డ్రైవర్. గత 8వ తేదీన అచ్చంపట్టి నుంచి మహిళలను వ్యానులో ఎక్కించుకుని శివరాత్రి ఉత్సవాల కోసం ఆలయానికి వెళ్లాడు. ఆపై వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ విషయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు తన భర్తను అనుచితపదాలతో దూషించి, దాడి చేశారు. సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి చనిపోయాడని వైద్యులు తెలిపారు. భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆ ఫిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో తమకు తగిన పరిహా రం ఇవ్వాలన్నారు. సంబంధిత పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలంటూ ఆమె పిటిషన్లో పే ర్కొన్నారు. ఈ కేసులో తగిన ఉత్తర్వులు జారీ చేస్తా మని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కేసు జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌కు అంగన్వాడీ కా ర్యకర్త ఉద్యోగం ఇవ్వాలని, అలాగే మురుగన్ కుటుంబానికి ఆది ద్రావిడర్ సంక్షేమ నిధి నుంచి తగిన పరిహారం అందించాలని కేసు విచారించిన న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అలాగే మురుగన్ మృతి కేసును సీబీసీఐడీ పర్యవేక్షణలో తగు విచారణ జరపాలని ఆదేశించారు. -
ఆ తల్లి నిర్దోషి, ఇవన్ని ఆకాశరామన్న ఉత్తరాలే?!
సాక్షి, చెన్నై: పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను హతమార్చి కసాయిగా ముద్ర పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ తల్లికి 17 ఏళ్లకు న్యాయం దక్కింది. ఆమె నిర్ధోషిగా పేర్కొంటూ మధురై ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. తిరుచ్చి జిల్లా తత్తయాన్‌కార పేట్టైకు చెందిన సెల్వరాజ్, శకుంతల (49) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2002 ఏడాదిన్నర చంటి బిడ్డను హతమార్చిన కసాయిగా అందరి దృష్టిలో శకుంతల మిగిలి పోయింది. సెల్వరాజ్ ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, శకుంతలను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. తిరుచ్చి మహిళా జైలులో శిక్ష అనుభవిస్తూనే న్యాయ పోరాటం మీద శకుంతల దృష్టి పెట్టారు. పిటిషన్ విచారణ సమయంలో ఆమెకు బెయిల్ లభించింది. అయితే, 2016లో బెయిల్ రద్దు కావడంతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పలేదు.పట్టు వదలకుండా న్యాయపోరాటం చేస్తూ వచ్చింది. ఏడాదిన్నర బిడ్డను బావిలో పడేసి హతమార్చినట్టుగా అభియోగం ఆమె మీద మోపినా, ఆధారాలన్నీ సృష్టించబడ్డట్టుగా, ఊహాజనితంగా, ఆకాశరామన్న ఉత్తరాలను తలపించే పొంతన లేనివిగా ఉన్నాయని బెంచ్ గుర్తించి ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. చదవండి: కోవాగ్జిన్ సింగిల్ డోస్?!: ఐసీఎంఆర్ -
‘ ప్లీజ్.. నా భర్తను భారత్ జైలుకు తరలించండి’
చెన్నై: శ్రీలంక జైలులో ఉన్న తన భర్తను దయచేసి భారత్ జైలుకు మార్చాలని కోరుతూ మదురై హైకోర్టు బెంచ్‌లో రీఫాయుదీందన్ జాలరి భార్య పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం బదులివ్వాలని బెంచ్ ఉత్తర్వులిచ్చింది. రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణానికి చెందిన మెహరూన్ నిషా మదురై హైకోర్టు బెంచ్‌లో ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌లోని వివరాల మేరకు.. తన భర్త రీఫాయుదీందన్ జాలరి అని, అతను మత్తుమందు తరలించినట్లు శ్రీలంక పోలీసులు తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారని, 2013 నుంచి జైలులో ఉంచినట్లు తెలిపారు. భారత్ – శ్రీలంక ఒప్పంద ప్రకారం శ్రీలంక జైలులో ఉన్న పలువురు ఖైదీలు భారతదేశానికి మారారని, అలాగే తన భర్తను భారత జైలుకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ భారత, శ్రీలంక దౌత్య కార్యాయాలకు పిటిషన్ అందజేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను భారత జైలుకు మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన న్యాయమూర్తులు కె.కల్యాణ సుందరం, పి.పుహళేంది కేంద్ర విదేశాంగ శాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి తరఫున బదులివ్వాలని ఉత్తర్వులిస్తూ విచారణను వాయిదా వేశారు. -
Kamal Haasan: కమల్‌కు కోర్టులో ఊరట
నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు మదురై కోర్టులో ఊరట లభించింది. కమలహాసన్ 2017లో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అంతేకాకుండా కమల్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లై జిల్లా పళైయూర్ గ్రామానికి చెందిన ఆదినాథ సుందరం అనే వ్యక్తి వల్లియూర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా నటుడు కమలహాసన్ తరఫున మదురై హైకోర్టులో దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉంది. కాగా శుక్రవారం మరోసారి ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో నటుడు కమలహాసన్ తరఫు న్యాయవాది హాజరై ఇలాంటి వివాదాస్పద సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మాటలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కమలహాసన్పై కేసును కొట్టి వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: 'నేను పార్టీ మారానా.. దమ్ముంటే నిరూపించండి' -
పోలీసు కస్టడీలో మృతి?
టీ.నగర్: పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి వ్యవహారంపై తిరుమంగళం అమముక అభ్యర్థి ఆదినారాయణన్ సహా నలుగురు మదురై హైకోర్టు బెంచ్ ఎదుట హాజరయ్యారు. మదురై సోలైయళగుపురం ముత్తుకరుప్పన్ కుమారుడు డ్రైవర్ బాలమురుగన్. అతన్ని ఒక కిడ్నాప్ కేసులో అవనియాపురం పోలీసులు 2019లో చట్టవిరుద్ధంగా పోలీసు స్టేషన్లో ఉంచి దాడి చేశారు. దీంతో అతను మృతిచెందినట్లు వార్తలు వ్యాపించాయి. ఈ కేసుపై శనివారం విచారణ జరిగింది. న్యాయమూర్తులు టీఎస్ శివజ్ఞానం, ఎస్ ఆనంద్ విచారణ జరిపారు. పోలీసుల దాడిలో బాలమురుగ న్ మృతిచెందలేదని, ప్రమాదంలో గాయపడి మృతిచెందినట్లు తెలిసింది. ఈ కేసులో ఆదినారాయణన్ సహా నలుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. దీనిపై జూన్ 14న రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష తిరువొత్తియూరు: ఈరోడ్ జిల్లాలో చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ రోడ్డు మహిళా కోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈరోడ్ జిల్లా భవానిసాగర్ తాండం పాళయానికి చెందిన జగన్ (19) అదే ప్రాంతంలో ఉంటున్న నాలుగేళ్ల బాలికపై 2019లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ శనివారం ఈరోడ్ మహిళా కోర్టులో జరిగింది. విచారణ అనంతరం జగన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి మాలతి తీర్పు చెప్పారు. హత్య కేసులో యవజ్జీవం బాంబుతో దాడి చేసి రైతును హత్య చేసిన యువకుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. శివగంగై జిల్లా తిరుప్పాచ్చికి చెందిన ముత్తు రామలింగం (35) రైతు. ఇతనికి దూతైకి చెందిన పెరియస్వామికి వైగై నదిలో ఇసుక తరలింపులో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. 2003 అక్టోబర్ 3న బాంబు దాడిలో ముత్తు రామలింగం మృతి చెందాడు. పోలీసులు సేంగైస్వామిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి శివగంగై జిల్లా సెషన్స్ కోర్టులో శనివారం న్యాయమూర్తి సుమతీ సాయి ప్రియ సమక్షంలో జరిగింది. సేంగైస్వామికి యావజ్జీవ శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
హీరో ధనుష్‌కి మధురై హైకోర్టు షాక్
సాక్షి, చెన్నై: తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్‌కు మధురై కోర్టు షాకిచ్చింది. గత మూడేళ్ళుగా ధనుష్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ధనుష్ తమ కొడుకే అని చిన్నతనంలో అతనిని మందలిస్తే ఇంటి నుంచి వెళ్లిపోయాడంటూ మదురైకి చెందిన దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ధనుష్ జనన, విద్య, నివాసానికి సంబంధించిన ధృవ పత్రాలను అసలెందుకు తీసుకురాలేదంటూ ఆయనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అతనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను కోర్టుకు అందజేయాలని చెన్నై కార్పోరేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మీరు ఎవరో తెలియదు అంటుంటే గుండె తరుక్కుపోతోందని కదిరేషన్ దంపతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. డీఎన్ఏ పరీక్షలు చేయించాలంటూ వారు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అయితే ధనుష్ ఇది వరకు పుట్టుమచ్చలను కూడా తొలగించుకున్నాడనే వ్యవహారం వారి వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే దీనిపై ధనుష్ స్పందిస్తూ.. వృత్తిలో భాగంగానే అలా చేయాల్సి వచ్చిందంటూ చెప్తుండటం గమనార్హం. -
శృంగార క్యాషియర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడి వృత్తి బాధ్యతాయుతమైన బ్యాంకు ఉద్యోగం. ప్రవృత్తి మహిళలను లోబరుచుకుని ఉల్లాసంగా గడపడం. ఒకరు కాదు...ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలను ఫొటోలు, వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. అరెస్ట్ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. తంజావూరు జిల్లా వల్లం సమీపం రెడ్డిపాళయానికి చెందిన యువతి (32)తో గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన వివాహమైంది. పెళ్లయిన రోజు నుంచే జయకుమార్ తన ఇంటిలోని ప్రత్యేక గదిలో గంటల తరబడి పలువురు మహిళలతో అశ్లీలంగా మాట్లాడడం, తనతో సఖ్యతగా ఉండకపోవడాన్ని భార్య గమనించింది. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో అతని గదిలోకి వెళ్లి పరిశీలించగా 15 సెల్ఫోన్లు, వాటిల్లో జయకుమార్ 40 మందికిపైగా మహిళలతో, బ్యాంకు ఖాతాదారులతో అర్ధనగ్నంగా, నగ్నంగా ఉన్న చిత్రాలు, బాత్రూములో వీడియోలు, ఎస్ఎంఎస్లు చూసింది. ఈ ఘోరాలను తన అత్తగారు, భర్త సోదరి, అత్తవారింటి ఇతర మహిళా బంధువులకు చెప్పుకుని విలపించింది. అయితే వారేమీ పట్టించుకోలేదు. అయితే తన అంతర్గత విషయాలను కుటుంబసభ్యులకు చెప్పిందని జయకుమార్ అగ్రహించి భార్యను తిట్టిపోశాడు. అంతేకాకుండా ‘నీవు స్నానం చేస్తున్నపుడు రహస్యంగా వీడియో తీసి జాగ్రత్తగా దాచిపెట్టాం, ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతాం’ అంటూ జయకుమార్, అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా బెదిరించారు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు జయకుమార్‌ను నిలదీశారు. అయితే తన రాసలీలలను బహిర్గతం చేసిందనే కక్షగట్టిన జయకుమార్...భార్యను హతమార్చేందుకు పథకం రచించాడు. ఆలయాల సందర్శన పేరుతో భార్యను బయటకు తీసుకెళ్లి రెండుసార్లు హత్యయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకుని తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథన్కు ఫిర్యాదు చేసింది. డీజీపీ ఆదేశాల మేరకు బాధితురాలి భర్త జయకుమార్, అతని తల్లి విల్లీ హైడా, సోదరి కేథరిన్ నిర్మలామేరీ, బంధువు రీటాతో పాటుగా, జయకుమార్తో సంబంధం పెట్టుకుని అతడి దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగిని దేవీ బిలోమినాపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన జయకుమార్ మదురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తన భర్త రాసలీలలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను మదురై కోర్టుకు అప్పగించి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరింది. బాధితురాలి పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు జామీనుపై విడుదలకు అవకాశం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జయకుమార్ సహా ఐదుగురిపై వల్లం మహిళా పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జయకుమార్... కుటుంబంతో కలిసి పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్ కిందే లెక్క..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ నియంత్రణ చట్టం వచ్చినపుడు ‘మే మిద్దరం..మాకిద్దరు’ అనే నినాదం మార్మోగిపోయింది. అయినా జనాభా పెరుగుదల ఆగకపోవడంతో ‘మేమిద్దరం..మాకొక్కరు’ అంటూ నినాదంలో మార్పులు తెచ్చారు. అయితే కొందరు వ్యక్తులు ‘నేనొక్కడిని..నాకిద్దరు భార్యలు’ అంటూ పలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకునే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మదురై హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మదురైకి చెందిన తేన్మొళి అనే మహిళ మదురై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నా భర్త పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఎస్ఐగా పదోన్నతి పొందాడు. 1982లో మాకు వివాహం కాగా ఆయనకు అంతకు ముందే ముత్తులక్ష్మి అనే మహిళతో వివాహమై ముగ్గురు పిల్లలున్నట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో మా ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొనగా ఉసిలంపట్టి పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశాను. ఇద్దరి మధ్య జరిగిన సామరస్య పూర్వకచర్చల ఫలితంగారెండు కుటుంబాలను బాగా చూసుకుంటానని పెద్దల ముందు వాగ్దానం చేశాడు. 2011లో భర్త చనిపోగా పింఛను, ఇతరత్రా ఆర్థిక సహాయాలు నాకు అందలేదు. పోలీసుశాఖాపరంగా మంజూరైన మొత్తాల్లో 50 శాతం నాకు చెందేలా ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్లో పేర్కొంది.ప్రజాసేవలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఎంఎం సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. అయితే వారు విధుల్లో ఉండగా బయటకురావడం లేదు, రిటైరయినా, మరణించిన తరువాత ఆర్థికవ్యవహారాల్లో వివాదాలు ఏర్పడి వెలుగుచూస్తున్నాయి. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం మంచి నడవడిక అనిపించుకోదు. అంతేగాక చట్ట ప్రకారం నేరం. అయితే ఈ చట్టాలను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తేన్మొళి కేసులో పోలీసులే రెండు పెళ్లిళ్లకు అనుకూలంగా రాజీ కుదర్చడం ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది. ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నతాధికారులపై తగిన చర్యలు తీసుకున్నపుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రిటైరైన ఉద్యోగి మరణిస్తే అతని పింఛన్ సొమ్ము భార్యకు చెందేలా ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మార్చేందుకు వీలుపడదు కాబట్టి తేన్మొళి పిటిషన్‌ను కొట్టివేస్తున్నాను. అయితే రిటైరైన ఉద్యోగికి పింఛన్ మంజూరు చేసే ముందు సంబంధిత అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరపాల్సి ఉంటుంది. రెండో పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణైతే శాఖాపరమైన చర్యలతోపాటూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొంటూ తేన్మొళి పిటిషన్‌ను కొట్టివేశారు. -
సెల్ఫోన్లు కావు అణుబాంబులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థుల చేతుల్లోకి విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన సెల్ఫోన్లు అణుబాంబులంత ప్రమాదకరమైనవని మదురై హైకోర్టు న్యాయమూర్తులు ఎన్. కృపాకరన్, ఎస్ఎస్ సుందర్ వ్యాఖ్యానించారు. విచక్షణ మరిచిపోయి సెల్‌ఫోన్ వాడకం ఎంత ప్రమాదమనే సత్యాన్ని పొల్లాచ్చి ఘటన లోకానికి చాటిచెప్పిందని వారు అన్నారు. పొల్లాచ్చి ఘటన నేపథ్యంలో మదురైకి చెందిన విజయకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్)ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్ వినియోగంలోని మంచి చెడులను తెలుసుకోకుండా వినియోగిస్తే పొల్లాచ్చి వంటి సంఘటనల దారితీస్తాయని అన్నారు. ఇంటర్నెట్లోని ఫేస్బుక్, అశ్లీల ఇంటర్నెట్ సైట్లు, మద్యం సమాజాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ పోకడల వల్ల పిల్లల ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు దారుణంగా దెబ్బతినగలదని హితవుపలికారు. తల్లిదండ్రులు తమ సంతానం నడవడిక, నడత పట్ల ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పొల్లాచ్చి నిందితులు యువతులతో చిత్రీకరించిన దృశ్యాలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని మదురై హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలను అరికట్టడం కేవలం న్యాయస్తానాల బాధ్యత మాత్రమే కాదు, అధికారులు సైతం జాగరూకులై ఉండాలని సూచించారు. ప్రస్తుతం భారత్‌కు ఇంటర్నెట్ వ్రతం ఆచరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని నటుడు వివేక్ ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే నేతలపై ఆరోపణలు: పొల్లాచ్చి దారుణంలో మంత్రి కుమారుని పాత్రతోపాటు అన్నాడీఎంకే అగ్రనేతల కుమారులు కూడా కొందరు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీకి చెందిన వీఐపీ నేతల కుమారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. యువతులతో నిందితులు చిత్రీకరించిన అశ్లీల వీడియో దృశ్యాలను అధికారపార్టీకి అనుకూలంగా పోలీసులు చెరిపివేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక నలుగురు మృగాళ్లకు పోలీసుశాఖలో ఒక స్నేహితుడు ఉన్నట్లు అంటున్నారు. బాధిత యువతుల వీడియోలను బహిర్గతం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ఆక్షేపించారు. పొల్లాచ్చి దుర్ఘటనను సీబీఐ విచారణ చేపట్టడంలో తమకు నమ్మకం లేదు, న్యాయస్తానం పర్యవేక్షణలో సీబీఐ విచారణ సాగాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. పాల్లాచ్చి ఘటనకు నిరసనగా విద్యార్థులు శుక్రవారం మూడోరోజు కూడా తరగతులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, బస్స్టేషన్ల ముందు రాస్తారోకోలను నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. డీఎంకే యువజన విభాగానికి చెందిన మహిళా నిర్వాహకురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఈరోడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మాహుతి యత్నం చేసింది. పుదుక్కోట్టైలో ముగ్గురు కాలేజీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది. వారిని విడిచిపెట్టాల్సిందిగా ఆందోళనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ముగ్గురు విద్యార్థినులను వాహనంలో ఎక్కించి తీసుకెళుతుండగా అడ్డుకున్నారు. సుమారు అరంగంటపాటు పోలీసులు, విద్యార్థుల నడుమ చర్చలు జరగ్గా చివరకు వారిని విడిచిపెట్టారు. గూండా చట్టం కింద అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ సీబీసీఐడీ పోలీసులు కోయంబత్తూరు చీఫ్ మేజిస్ట్రేటు కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రజలు కూడా తెలియజేయవచ్చని సీబీసీఐడీ అధికారులు పిలుపునిచ్చారు. పొల్లాచ్చి ఘటనపై విద్యార్థుల ఆందోళనలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయివేటు కాలేజీలకు అకస్మాత్తుగా సెలవులు ప్రకటించారు. అవసరమైతే నిరవధిక సెలవులు ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేగాక హాస్టళ్లలోని విద్యార్థులను ఇళ్లకు పంపివేస్తున్నారు. సమయానికి పార్లమెంటు ఎన్నికలు కూడా సమీపించడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు 8 రోజులు ముందుగానే సెలవులు ఇచ్చేశారు. ఏప్రిల్ 12వ తేదీ తుది పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. సేలంలో: పలు కళాశాలలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో విద్యార్థులందరూ రోడ్డుపై బైటాయించి పొల్లాచ్చి నేరస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా సేలం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ కేసును సీబీఐకి మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకుని, నేరస్తులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మార్కిస్ట్ పార్టీ తరఫున సేలంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొలాచ్చి ఘటనలో గోప్యంగా ఉంచాల్సిన బాధిత యువతుల వివరాలను బయటపెట్టిన కోవై ఎస్పీ పాండ్యరాజన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత యువతి కుటుంబానికి రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని మదురై హైకోర్టు ఆదేశించింది. -
లంచం పుచ్చుకుంటే ఉరి!
సాక్షి, చెన్నై: లంచం పుచ్చుకుంటూ పట్టుబడే వారిని ఉరి తీయాల్సిందే లేదా దేశద్రోహం కేసు నమోదు చేయాల్సిందే అని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి వారి ఆస్తుల్ని జప్తు చేయాల్సిన అవసరం కూడా ఉందని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి కఠిన చట్టాల్ని అమల్లోకి తెచ్చినప్పుడే లంచం, అవినీతిని పూర్తిగా రూపు మాపేందుకు వీలుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అన్ని విభాగాల్లోనూ లంచం తాండవం చేస్తూనే ఉంది. ప్రతి పనికి పైసా అన్నట్టుగా పరిస్థితి మారింది. కొందరు సాహసం చేసి లంచగాళ్లను ఏసీబీకి పట్టిస్తున్నారు. మరికొందరు తమ పని త్వరితగతిన ముగియాలన్న కాంక్షతో లంచం ఇచ్చుకోక తప్పడం లేదు. ఈ లంచం, అవినీతిని రూపు మాపుతామంటూ పాలకుల వ్యాఖ్యలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో లంచం పుచ్చుకునే వాళ్లతో కఠినంగా వ్యవహరించినప్పుడే రూపుమాపగలమంటూ పాలకులకు మధురై ధర్మాసనం హితబోధ చేసింది. పిటిషన్: మదురై సూర్యనగర్‌కు చెందిన భరణిభారతి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి జరిగిన రాత పరీక్ష గురించి వివరించారు. పరీక్ష ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పేపర్ లీక్ అయ్యిందని, ఇంతవరకు ఆ లీక్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్లో వివరించారు. అయితే, ఆ పోస్టుల భర్తీకి తగ్గ నియమకాల మీద అధికార వర్గాలు దృష్టి పెట్టి ఉన్నారని వివరించారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు కృపాకరణ్, ఎస్ఎస్ సుందర్ నేతృత్వంలోని బెంచ్ ముందు సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు లంచగాళ్ల మీద తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంగా సీసీ కెమెరాలు, సెల్ఫోన్ల రాకతో లంచగాళ్ల బండారాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ప్రతి పనికి లంచం సహజంగా మారిందని ధ్వజమెత్తారు. దీనిని రూపు మాపుతామంటున్నారేగానీ, ఇంతవరకు ఆచరణలో పెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరి శిక్ష:ఈ కేసులో ధర్మాసనం పేర్కొంటూ.. లంచం అన్న పదం తెరమరుగు కావాలన్నా, లంచం పుచ్చుకునేందుకు భయపడాలన్నా. అవినీతి సమూలంగా నశించాలన్నా శిక్షలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లంచం పుచ్చుకుంటూ పట్టుబడే వాళ్లను ఉరి తీయాలని, లేదా దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి కటకటాలకే పరిమితం చేయాలని సూచించారు. అలాగే, లంచగాళ్ల ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షలు అమల్లోకి తెచ్చినప్పుడే ఈ దేశంలో లంచం, అవినీతి అన్నది రూపు మాపబడుతుందని వ్యాఖ్యానించారు. చివరకు ఈ కేసులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ, తదుపరి విచారణను ఒకటో తేదీకి వాయిదా వేశారు. -
స్వాతంత్ర్య సమరయోధులు : సంచలన తీర్పు
సాక్షి, చెన్నై : స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్లపై మధురైలోని మద్రాసు హైకోర్టు బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. దేశంలోని స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి.. వెతుక్కుంటూ ఇంటింటికి వెళ్లి మరీ పింఛన్లు అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బెంచ్ ఆదేశించింది. స్వాతంత్ర్య సమరయోధులకు పింఛన్లు అందజేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం నేపథ్యంలో మధురై హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేయాలని ఆదేశించింది. -
అశ్లీల నృత్యాల నిషేధం కోరుతూ పిటిషన్
చెన్నై: దసరా ఉత్సవాల్లో సినీ డ్యాన్సర్ల నత్యాలపై నిషేధం విధించాలంటూ సామాజిక కార్యకర్త రాంకుమార్ ఆదిత్తన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మధురై హైకోర్టు బెంచ్ విచారణకు స్వీకరించింది. తమిళనాడు కులశేఖర పట్టణం ముత్తారమ్మన్ ఆలయంలో ఏటా పది రోజులపాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని, పదవ రోజున శూరసంహారం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో సినీ, టీవీ కళాకారిణులు, ముంబై బార్లలోని డ్యాన్సర్లతో నృత్యాలు చేయిస్తారని పేర్కొన్నారు. ఈ నృత్యాలతో యువత పెడదోవ పడుతున్నారని, ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో నృత్యాలు చేయడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన న్యాయమూర్తులు శశిధరన్, స్వామినాథన్ దీనిపై సంజాయిషీ ఇవ్వాలని తూత్తుకుడి కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. అనంతరం విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేశారు. -
వాట్సాప్ దెబ్బకు సీటు గల్లంతు
* అన్నాడీఎంకే అభ్యర్థి మార్పు * వైకుంఠపాళికి గురైన శ్రీవైకుంఠం అభ్యర్థి సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో ఒకరి స్థానాన్ని ఖాళీ చేయిస్తేనే మరొకరికి అవకాశం దక్కడం సహజ సూత్రం. అదే సూత్రానికి శ్రీవైకుంఠం అన్నాడీఎంకే అభ్యర్థి భువనేశ్వరన్ బలైపోయి, సీటును చేజార్చుకున్నాడు. శ్రీవైకుంఠం అన్నాడీఎంకే అభ్యర్థిగా భువనేశ్వరన్‌ను పార్టీ అధినేత్రి జయలలిత ఎంపిక చేసింది. ఎమ్మెల్యే కావాలని కలలు కంటూ ఎన్నికల ప్రచారం చేసుకుంటూ పోతున్న శ్రీవైకుంఠం నియోజకవర్గ అభ్యర్థి భువనేశ్వరన్‌పై పథకం కుట్రసాగింది. కరూరు జిల్లా అరవైకురిచ్చి తాలూకాకు చెందిన రవిసెల్వం తరఫున న్యాయవాది మదురై హైకోర్టులో పిటిషన్ వేశాడు. స్థల వివాదంలో భువనేశ్వరన్ మరో ఐదుగురు తనపైన 2012లో హత్యా బెదిరింపులకు పాల్పడ్డాడని అందులో పేర్కొన్నాడు. అయితే ఈ కేసు ఇంకా విచారణ దశకు రాకముందే వాట్సాప్‌లో ప్రచారం చేసేశారు. రవిరత్నం క్రిమినల్ కేసులో మదురై హైకోర్టు సదరు భువనేశ్వరన్కు వ్యతిరేకంగా చార్జిషీటు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ సమాచారం జయకు చేరడంతో వెంటనే భువనేశ్వరన్‌ను తొలగించి షణ్ముగనాథన్ అనే వ్యక్తిని అభ్యర్థిగా నియమించారు. అదే సీటును ఆశించిన అన్నాడీఎంకే నేతలో లేదా భువనేశ్వరన్‌ను ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని కుట్రపన్నిన ప్రబుద్ధుల్లో వాట్సాప్‌లో ఈ సమాచారాన్ని ప్రచారం చేశారు. ఈ పరిణామం తరువాత రవిసెల్వం పేరుతో దాఖలైన పిటిషన్‌ను వాపస్ తీసుకుంటున్నట్లుగా కోర్టు రిజిస్ట్రార్‌కు లాయర్ ఉత్తరం సమర్పించారు. అయితే వాస్తవానికి రవి సెల్వం వ్యవహారంతో భువనేశ్వరన్కు ఎంతమాత్రం సంబంధం లేదని తెలుస్తోంది. హైకోర్టు పేరుతో తప్పుడు సమాచారం వెళ్లిపోయిందని తెలుసుకున్న న్యాయమూర్తులు ఖంగుతిన్నారు. పుకార్లను ప్రచారం చేసేందుకు చివరకు న్యాయస్థానాలను కూడా వాడుకుంటున్నారని ఆశ్చర్యపోయారు. వాట్సాప్‌లో సదరు సమాచారాన్ని ప్రచారం చేసిన వ్యక్తిని వెంటనే కనుగొనాలని ఆదేశించారు. మదురై సైబర్ క్రైం పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. అన్నాడీఎంకే అభ్యర్థి భువనేశ్వరన్‌ను దెబ్బతీసే ఉద్దేశంలో నడిపిన కుట్రగా భావిస్తూ ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజానిజాలు తేలినా రాజకీయంగా ఎదగాలనుకున్న భువనేశ్వరన్ భవిష్యత్తును వాట్సాప్ సమాచారం కాలరాచింది. -
టీచర్‌తో పరారైన విద్యార్థి
కోర్టులో హాజరు తల్లి వెంట వెళ్లడంతో సంచలనం టీనగర్: టీచర్‌తో పరారైన విద్యార్థి మదురై హైకోర్టులో మంగళవారం హాజరయ్యాడు. అతను తల్లి వెంట వెళతానని చెప్పడంతో సంచలనం ఏర్పడింది. వివరాలు ఇలావున్నాయి. తిరునల్వేలి జిల్లా, సెంగోట్టై సమీపానగల కాలాంగరైకు చెందిన ఉపాధ్యాయిని గోదైలక్ష్మి(23) తెన్కాశి సమీపానగల ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తోంది. అక్కడ 10 తరగతి చదువుతున్న కడయనల్లూరు, కృష్ణాపురానికి చెందిన విద్యార్థి శివసుబ్రమణియంతో 31 మార్చి, 2015న పరారైంది. వారు పుదుచ్చేరికి వెళ్లి వివాహం చేసుకుని తిరుపూరులో నివశిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. పోలీసులు గత 10వ తేదీన అక్కడికి వెళ్లి గోదైలక్ష్మి, శివసుబ్రమణియన్లను పులియంగుడికి తీసుకువచ్చారు. ఇరువురికి తెన్కాశి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు జరిపారు. గోదైలక్ష్మిని తిరునల్వేలి కొక్కిరకులంలోగల మహిళా జైలులో నిర్బంధించారు. శివసుబ్రమణియన్‌ను నెల్లై జువైనల్ హోంలో వుంచారు. గోదైలక్ష్మి నాలుగు నెలల గర్భవతిగా ఉన్నందున ఆమెకు తగిన వైద్య చికిత్సలు అందించేందుకు కొక్కిరకుళం మహిళా జైలులో వసతులు లేకపోవడంతో తిరుచ్చిలోని మహిళా జైలుకు మార్చారు. హైకోర్టులో హాజరు: విద్యార్థి శివసుబ్రమణియన్ ఆచూకీ కనుగొని తెలపాలంటూ అతని తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా మంగళవారం మదురై హైకోర్టు బెంచ్‌లో శివసుబ్రమణియన్‌ను హాజరుపరిచారు. విద్యార్థి శివసుబ్రమణియన్ గడ్డం పెంచుకున్న స్థితిలో బ్రౌన్ కలర్ జీన్స్, ఎరుపు రంగు టీ షర్టు ధరించి వచ్చాడు. వీటితోపాటు కళ్లజోడు కూడా ధరించాడు. న్యాయమూర్తులు సెల్వం, చొక్కలింగం విద్యార్థితో ఎక్కడికి వెళ్లారని అడిగారు. అందుకు తిరుపూర్ వెళ్లినట్లు శివసుబ్రమణియన్ తెలిపాడు. నీ వయసెంత అని ప్రశ్నించగా 16 ఏళ్ల నాలుగు నెలలని బదులిచ్చాడు. నువ్వు మైనర్ కావడంతో ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావని న్యాయమూర్తులు ప్రశ్నించగా, అందుకు తల్లితో వెళ్లాలనుకుంటున్నట్లు శివసుబ్రమణియన్ సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను న్యాయమూర్తులు జారీ చేశారు. తర్వాత తల్లి మారియమ్మాల్కు శివసుబ్రమణియన్‌ను అప్పగించారు. అతన్ని కన్నీటితో తల్లి మారియమ్మాళ్ తీసుకువెళ్లింది. ఈ కేసులో విద్యార్థి శివసుబ్రమణియన్ తల్లితో వెళతానని చెప్పడం సంచలనం కలిగించింది. ఉపాధ్యాయిని గోదైలక్ష్మిని హైకోర్టులో హాజరు పరిచేందుకు ఆమె తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె కూడా మంగళవారం కోర్టులో హాజరవుతారని భావించారు. ఈ కారణంగా హైకోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున జనం గుమికూడారు. అయితే గోదైలక్ష్మి మంగళవారం హాజరు కాలేదు. ఆమె త్వరలో హాజరు కానున్నట్లు సమాచారం. -
గ్రానైట్ స్కాంలో అధికారులు
- విచారణకు పట్టు - సహాయంకు భద్రత పెంపు సాక్షి, చెన్నై : గ్రానైట్ స్కాంలో మదురై కేంద్రంగా గతం లో పనిచేసిన అధికారులు, రిటైర్డ్ అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు బయలు దేరాయి. వారందర్నీ విచారించాల్సిందేనని సహాయం కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక, సహాయం కమిటీ రహస్య విచారణలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు బయటకు పొక్కుతున్నట్టు అనుమానాలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో సహాయంకు భద్రతను పెంచారు. మదురై కేంద్రంగా సాగిన గ్రానైట్ స్కాం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు వేల కోట్ల స్కాంలోని తిమింగళాల భరతం పట్టడం, ప్రభుత్వానికి గండి పడ్డ ఆదాయాన్ని కక్కించడం లక్ష్యంగా ఐఏఎస్ సహాయం కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీ తన విచారణను వేగవంతం చేసింది. మదురైలో తిష్ట వేసి ఉన్న సహాయంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతాల్లో అంటే తమ ప్రాంతాల్లో భారీగా గ్రానైట్ తవ్వకాల రూపంలో నష్టాలు జరిగినట్టు బాధితులు తీవ్ర ఆవేదనతో ఫిర్యాదుల్ని అందజేస్తూ వస్తున్నారు. శుక్రవారం వామపక్షాల నేతృత్వంలో పలువురు సహాయంకు వినతి పత్రం అందజేశారు. ఈ వేల కోట్ల స్కాంలో అధికారుల హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశా రు. గతంలో మదురై కేంద్రంగా పనిచేసి బదిలీ మీద మరో చోట పనిచేస్తున్న అధికారులు, రిటైర్డ్ అధికారుల ప్రమేయం తప్పకుండా ఉండి ఉంటుందని ఆరోపించారు. అధికారుల అండదండలతోనే ఈ స్కాం సాగి ఉంటుందని, వారిని సైతం విచారించాలని ఆ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇక, బాధితులు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్ని స్వీకరించిన సహాయం, వారి వాదనల్ని రహస్యంగా నమోదు చేసుకునే పనిలో పడ్డారు. భద్రత పెంపు ఐఏఎస్ అధికారి సహాయం నిక్కచ్చితనానికి మారు పేరు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి నందుకు గాను అనేక బదిలీ ఉత్తర్వుల్ని అందుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వేల కోట్ల స్కాం విచారణ ఆయనకు అప్పగించడంతో దాని వెనుక ఉన్న బడబాబులు, రాజకీయ నాయకుల్లో గుబులు పట్టుకుంది. ఆయన విచారణ ఏ విధంగా సాగుతున్నదో, ఆయన్ను ఎవరెవరు కలుస్తున్నారో, ఆయనకు ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయోనన్న వివరాలు బయటకు పొక్కుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. సహాయంకు తెలి యకుండా అదృశ్య శక్తులు ఎవ్వరో ఆయన విచారణ శైలిని పసిగట్టే పనిలో పడ్డట్టు ఆరోపణలు బయలు దేరాయి. ఎవరో కొందరు ఆయన విచారణను టాంపరింగ్ చేసి పెద్ద చేపలకు అందజేస్తున్నట్టు అనుమానాలు బయలు దేరాయి. దీంతో సహాయం భద్రతపై ఆందోళన నెలకొంది. ఆయన విచారణ లీక్ కాని రీతి లో, ఆయనకు ఎలాంటి ప్రమాదం తలెత్తని విధంగా గట్టి భద్రతను కల్పించారు. ఇద్దరు గన్మెన్లు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఐదుగురు కానిస్టేబుళ్లను ఆయ న భద్రతకు రంగంలోకి దించి ఉన్నారు. మరో కేసు ఓ వైపు సహాయం కమిటీ విచారణ సాగిస్తుంటే, మరో వైపు మరో గ్రానైట్ మోసానికి సంబంధించిన మదురై మేలూరు సమీపంలోని కీల్ వలపు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణగిరికి చెందిన రాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. గ్రానైట్ పాలిషింగ్ పేరిట కీల్ వలపులో ఓ ప్రైవేటు సంస్థ చాప కింద నీరులా గ్రానైట్ తవ్వకాలు సాగుతున్నట్టుగా ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, రాజా మదురై హైకోర్టును సైతం ఆశ్రయించారు. అప్పుడు స్పందించని పోలీసులు సహాయం కమిటీ రంగంలోకి దిగడంతో ఉరకలు తీస్తూ కేసులు పెట్టడం గమనార్హం. -
'లింగా' చిత్రంపై మధురై హైకోర్టులో కేసు
చెన్నై: 'లింగా' సినిమా విడుదలపై స్టే కోరుతూ మధురై హైకోర్టు (బెంచ్)లో పిటిషన్ దాఖలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా రాక్ లైన్ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలను నిలిపివేయాలని రవి రత్నం అనేవ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. సినిమా హీరో రజనీకాంత్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు పంపారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాను రజనీ కాంత్ జన్మదిన కానుకగా డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రదర్శన హక్కులను ఓ ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రవికుమార్ - రజనీ కాంత్ కాంబినేషన్లో గతంలో నిర్మించిన ముత్తు, అరుణాచలం, నరసింహ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. దాంతో లింగా చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. **