ఇకపై భార్య‘లు’ ఉంటే క్రిమినల్స్‌ కిందే లెక్క..! | Madurai Court Series on Police Two Marriages Case | Sakshi
Sakshi News home page

ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్‌ కథ..!

Published Sat, Jul 27 2019 7:38 AM | Last Updated on Sat, Jul 27 2019 7:54 AM

Madurai Court Series on Police Two Marriages Case - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: కుటుంబ నియంత్రణ చట్టం వచ్చినపుడు ‘మే మిద్దరం..మాకిద్దరు’ అనే నినాదం మార్మోగిపోయింది. అయినా జనాభా పెరుగుదల ఆగకపోవడంతో ‘మేమిద్దరం..మాకొక్కరు’ అంటూ నినాదంలో మార్పులు తెచ్చారు. అయితే కొందరు వ్యక్తులు ‘నేనొక్కడిని..నాకిద్దరు భార్యలు’ అంటూ పలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకునే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మదురై హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.  వివరాలు ఇలా ఉన్నాయి.    

మదురైకి చెందిన తేన్‌మొళి అనే మహిళ మదురై హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. నా భర్త పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఎస్‌ఐగా పదోన్నతి పొందాడు. 1982లో మాకు వివాహం కాగా ఆయనకు అంతకు ముందే ముత్తులక్ష్మి అనే మహిళతో వివాహమై ముగ్గురు పిల్లలున్నట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో మా ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొనగా ఉసిలంపట్టి పోలీసు స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేశాను. ఇద్దరి మధ్య జరిగిన సామరస్య పూర్వకచర్చల ఫలితంగారెండు కుటుంబాలను బాగా చూసుకుంటానని పెద్దల ముందు వాగ్దానం చేశాడు. 2011లో భర్త చనిపోగా పింఛను, ఇతరత్రా ఆర్థిక సహాయాలు నాకు అందలేదు.

పోలీసుశాఖాపరంగా మంజూరైన మొత్తాల్లో 50 శాతం నాకు చెందేలా ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్‌లో పేర్కొంది.ప్రజాసేవలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఎంఎం సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు.  అయితే వారు విధుల్లో ఉండగా బయటకురావడం లేదు, రిటైరయినా, మరణించిన తరువాత ఆర్థికవ్యవహారాల్లో వివాదాలు ఏర్పడి వెలుగుచూస్తున్నాయి. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం మంచి నడవడిక అనిపించుకోదు. అంతేగాక చట్ట ప్రకారం నేరం. అయితే ఈ చట్టాలను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తేన్‌మొళి కేసులో పోలీసులే రెండు పెళ్లిళ్లకు అనుకూలంగా రాజీ కుదర్చడం ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంది.

ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నతాధికారులపై తగిన చర్యలు తీసుకున్నపుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రిటైరైన ఉద్యోగి మరణిస్తే అతని పింఛన్‌ సొమ్ము భార్యకు చెందేలా ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత మార్చేందుకు వీలుపడదు కాబట్టి తేన్‌మొళి పిటిషన్‌ను కొట్టివేస్తున్నాను. అయితే రిటైరైన ఉద్యోగికి పింఛన్‌ మంజూరు చేసే ముందు సంబంధిత అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరపాల్సి ఉంటుంది. రెండో పెళ్లి చేసుకున్నట్లు నిర్ధారణైతే శాఖాపరమైన చర్యలతోపాటూ క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పేర్కొంటూ తేన్‌మొళి పిటిషన్‌ను కొట్టివేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement