వాట్సాప్ దెబ్బకు సీటు గల్లంతు
* అన్నాడీఎంకే అభ్యర్థి మార్పు
* వైకుంఠపాళికి గురైన శ్రీవైకుంఠం అభ్యర్థి
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లో ఒకరి స్థానాన్ని ఖాళీ చేయిస్తేనే మరొకరికి అవకాశం దక్కడం సహజ సూత్రం. అదే సూత్రానికి శ్రీవైకుంఠం అన్నాడీఎంకే అభ్యర్థి భువనేశ్వరన్ బలైపోయి, సీటును చేజార్చుకున్నాడు. శ్రీవైకుంఠం అన్నాడీఎంకే అభ్యర్థిగా భువనేశ్వరన్‌ను పార్టీ అధినేత్రి జయలలిత ఎంపిక చేసింది. ఎమ్మెల్యే కావాలని కలలు కంటూ ఎన్నికల ప్రచారం చేసుకుంటూ పోతున్న శ్రీవైకుంఠం నియోజకవర్గ అభ్యర్థి భువనేశ్వరన్‌పై పథకం కుట్రసాగింది. కరూరు జిల్లా అరవైకురిచ్చి తాలూకాకు చెందిన రవిసెల్వం తరఫున న్యాయవాది మదురై హైకోర్టులో పిటిషన్ వేశాడు.
స్థల వివాదంలో భువనేశ్వరన్ మరో ఐదుగురు తనపైన 2012లో హత్యా బెదిరింపులకు పాల్పడ్డాడని అందులో పేర్కొన్నాడు. అయితే ఈ కేసు ఇంకా విచారణ దశకు రాకముందే వాట్సాప్‌లో ప్రచారం చేసేశారు. రవిరత్నం క్రిమినల్ కేసులో మదురై హైకోర్టు సదరు భువనేశ్వరన్‌కు వ్యతిరేకంగా చార్జిషీటు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ సమాచారం జయకు చేరడంతో వెంటనే భువనేశ్వరన్‌ను తొలగించి షణ్ముగనాథన్ అనే వ్యక్తిని అభ్యర్థిగా నియమించారు. అదే సీటును ఆశించిన అన్నాడీఎంకే నేతలో లేదా భువనేశ్వరన్‌ను ఎలాగైనా పోటీ నుంచి తప్పించాలని కుట్రపన్నిన ప్రబుద్ధుల్లో వాట్సాప్‌లో ఈ సమాచారాన్ని ప్రచారం చేశారు.
ఈ పరిణామం తరువాత రవిసెల్వం పేరుతో దాఖలైన పిటిషన్‌ను వాపస్ తీసుకుంటున్నట్లుగా కోర్టు రిజిస్ట్రార్‌కు లాయర్ ఉత్తరం సమర్పించారు. అయితే వాస్తవానికి రవి సెల్వం వ్యవహారంతో భువనేశ్వరన్‌కు ఎంతమాత్రం సంబంధం లేదని తెలుస్తోంది. హైకోర్టు పేరుతో తప్పుడు సమాచారం వెళ్లిపోయిందని తెలుసుకున్న న్యాయమూర్తులు ఖంగుతిన్నారు. పుకార్లను ప్రచారం చేసేందుకు చివరకు న్యాయస్థానాలను కూడా వాడుకుంటున్నారని ఆశ్చర్యపోయారు. వాట్సాప్‌లో సదరు సమాచారాన్ని ప్రచారం చేసిన వ్యక్తిని వెంటనే కనుగొనాలని ఆదేశించారు.
మదురై సైబర్ క్రైం పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు. అన్నాడీఎంకే అభ్యర్థి భువనేశ్వరన్‌ను దెబ్బతీసే ఉద్దేశంలో నడిపిన కుట్రగా భావిస్తూ ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజానిజాలు తేలినా రాజకీయంగా ఎదగాలనుకున్న భువనేశ్వరన్ భవిష్యత్తును వాట్సాప్ సమాచారం కాలరాచింది.