సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థుల చేతుల్లోకి విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్లు అణుబాంబులంత ప్రమాదకరమైనవని మదురై హైకోర్టు న్యాయమూర్తులు ఎన్. కృపాకరన్, ఎస్‌ఎస్ సుందర్ వ్యాఖ్యానించారు. విచక్షణ మరిచిపోయి సెల్‌ఫోన్ వాడకం ఎంత ప్రమాదమనే సత్యాన్ని పొల్లాచ్చి ఘటన లోకానికి చాటిచెప్పిందని వారు అన్నారు. పొల్లాచ్చి ఘటన నేపథ్యంలో మదురైకి చెందిన విజయకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్)ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్ వినియోగంలోని మంచి చెడులను తెలుసుకోకుండా వినియోగిస్తే పొల్లాచ్చి వంటి సంఘటనల దారితీస్తాయని అన్నారు.
ఇంటర్నెట్‌లోని ఫేస్‌బుక్, అశ్లీల ఇంటర్నెట్ సైట్లు, మద్యం సమాజాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ పోకడల వల్ల పిల్లల ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు దారుణంగా దెబ్బతినగలదని హితవుపలికారు. తల్లిదండ్రులు తమ సంతానం నడవడిక, నడత పట్ల ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పొల్లాచ్చి నిందితులు యువతులతో చిత్రీకరించిన దృశ్యాలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని మదురై హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలను అరికట్టడం కేవలం న్యాయస్తానాల బాధ్యత మాత్రమే కాదు, అధికారులు సైతం జాగరూకులై ఉండాలని సూచించారు. ప్రస్తుతం భారత్‌కు ఇంటర్నెట్ వ్రతం ఆచరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని నటుడు వివేక్ ట్వీట్ చేశారు.
అన్నాడీఎంకే నేతలపై ఆరోపణలు:
పొల్లాచ్చి దారుణంలో మంత్రి కుమారుని పాత్రతోపాటు అన్నాడీఎంకే అగ్రనేతల కుమారులు కూడా కొందరు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీకి చెందిన వీఐపీ నేతల కుమారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. యువతులతో నిందితులు చిత్రీకరించిన అశ్లీల వీడియో దృశ్యాలను అధికారపార్టీకి అనుకూలంగా పోలీసులు చెరిపివేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక నలుగురు మృగాళ్లకు పోలీసుశాఖలో ఒక స్నేహితుడు ఉన్నట్లు అంటున్నారు. బాధిత యువతుల వీడియోలను బహిర్గతం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ఆక్షేపించారు. పొల్లాచ్చి దుర్ఘటనను సీబీఐ విచారణ చేపట్టడంలో తమకు నమ్మకం లేదు, న్యాయస్తానం పర్యవేక్షణలో సీబీఐ విచారణ సాగాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. పాల్లాచ్చి ఘటనకు నిరసనగా విద్యార్థులు శుక్రవారం మూడోరోజు కూడా తరగతులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, బస్‌స్టేషన్ల ముందు రాస్తారోకోలను నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. డీఎంకే యువజన విభాగానికి చెందిన మహిళా నిర్వాహకురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఈరోడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మాహుతి యత్నం చేసింది. పుదుక్కోట్టైలో ముగ్గురు కాలేజీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది. వారిని విడిచిపెట్టాల్సిందిగా ఆందోళనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ముగ్గురు విద్యార్థినులను వాహనంలో ఎక్కించి తీసుకెళుతుండగా అడ్డుకున్నారు. సుమారు అరంగంటపాటు పోలీసులు, విద్యార్థుల నడుమ చర్చలు జరగ్గా చివరకు వారిని విడిచిపెట్టారు.
గూండా చట్టం కింద అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ సీబీసీఐడీ పోలీసులు కోయంబత్తూరు చీఫ్ మేజిస్ట్రేటు కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రజలు కూడా తెలియజేయవచ్చని సీబీసీఐడీ అధికారులు పిలుపునిచ్చారు. పొల్లాచ్చి ఘటనపై విద్యార్థుల ఆందోళనలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయివేటు కాలేజీలకు అకస్మాత్తుగా సెలవులు ప్రకటించారు. అవసరమైతే నిరవధిక సెలవులు ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేగాక హాస్టళ్లలోని విద్యార్థులను ఇళ్లకు పంపివేస్తున్నారు. సమయానికి పార్లమెంటు ఎన్నికలు కూడా సమీపించడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు 8 రోజులు ముందుగానే సెలవులు ఇచ్చేశారు. ఏప్రిల్ 12వ తేదీ తుది పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.
సేలంలో:
పలు కళాశాలలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో విద్యార్థులందరూ రోడ్డుపై బైటాయించి పొల్లాచ్చి నేరస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా సేలం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ కేసును సీబీఐకి మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకుని, నేరస్తులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మార్కిస్ట్ పార్టీ తరఫున సేలంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొలాచ్చి ఘటనలో గోప్యంగా ఉంచాల్సిన బాధిత యువతుల వివరాలను బయటపెట్టిన కోవై ఎస్పీ పాండ్యరాజన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత యువతి కుటుంబానికి రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని మదురై హైకోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment