లంచం పుచ్చుకుంటే ఉరి! | Madurai High Court Comments on Bribery Demanda | Sakshi
Sakshi News home page

లంచం పుచ్చుకుంటే ఉరి!

Published Tue, Feb 26 2019 12:26 PM | Last Updated on Tue, Feb 26 2019 12:26 PM

Madurai High Court Comments on Bribery Demanda - Sakshi

మదురై ధర్మాసనం

సాక్షి, చెన్నై: లంచం పుచ్చుకుంటూ పట్టుబడే వారిని ఉరి తీయాల్సిందే లేదా దేశద్రోహం కేసు నమోదు చేయాల్సిందే అని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి వారి ఆస్తుల్ని జప్తు చేయాల్సిన అవసరం కూడా ఉందని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి కఠిన చట్టాల్ని అమల్లోకి తెచ్చినప్పుడే లంచం, అవినీతిని పూర్తిగా రూపు మాపేందుకు వీలుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అన్ని విభాగాల్లోనూ లంచం తాండవం చేస్తూనే ఉంది. ప్రతి పనికి పైసా అన్నట్టుగా పరిస్థితి మారింది. కొందరు సాహసం చేసి లంచగాళ్లను ఏసీబీకి పట్టిస్తున్నారు. మరికొందరు తమ పని త్వరితగతిన ముగియాలన్న కాంక్షతో లంచం ఇచ్చుకోక తప్పడం లేదు. ఈ లంచం, అవినీతిని రూపు మాపుతామంటూ పాలకుల వ్యాఖ్యలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో లంచం పుచ్చుకునే వాళ్లతో కఠినంగా వ్యవహరించినప్పుడే రూపుమాపగలమంటూ పాలకులకు మధురై ధర్మాసనం హితబోధ చేసింది.

పిటిషన్‌: మదురై సూర్యనగర్‌కు చెందిన భరణిభారతి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఇటీవల ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యుత్‌ శాఖలో ఖాళీల భర్తీకి జరిగిన రాత పరీక్ష గురించి వివరించారు. పరీక్ష ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు పేపర్‌ లీక్‌ అయ్యిందని, ఇంతవరకు ఆ లీక్‌కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో వివరించారు. అయితే, ఆ పోస్టుల భర్తీకి తగ్గ నియమకాల మీద అధికార వర్గాలు దృష్టి  పెట్టి ఉన్నారని వివరించారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తులు కృపాకరణ్, ఎస్‌ఎస్‌ సుందర్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందు సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌ విచారణ సమయంలో న్యాయమూర్తులు లంచగాళ్ల మీద తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంగా సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ల రాకతో లంచగాళ్ల బండారాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ప్రతి పనికి లంచం సహజంగా మారిందని ధ్వజమెత్తారు. దీనిని రూపు మాపుతామంటున్నారేగానీ, ఇంతవరకు ఆచరణలో పెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉరి శిక్ష:ఈ కేసులో ధర్మాసనం పేర్కొంటూ.. లంచం అన్న పదం తెరమరుగు కావాలన్నా, లంచం పుచ్చుకునేందుకు భయపడాలన్నా. అవినీతి సమూలంగా నశించాలన్నా శిక్షలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లంచం పుచ్చుకుంటూ పట్టుబడే వాళ్లను ఉరి తీయాలని, లేదా దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి కటకటాలకే పరిమితం చేయాలని సూచించారు. అలాగే, లంచగాళ్ల ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వ గుప్పెట్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షలు అమల్లోకి తెచ్చినప్పుడే ఈ దేశంలో లంచం, అవినీతి అన్నది రూపు మాపబడుతుందని వ్యాఖ్యానించారు. చివరకు ఈ కేసులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ, తదుపరి విచారణను ఒకటో తేదీకి వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement