కోర్టులో హాజరు
తల్లి వెంట వెళ్లడంతో సంచలనం
టీనగర్: టీచర్‌తో పరారైన విద్యార్థి మదురై హైకోర్టులో మంగళవారం హాజరయ్యాడు. అతను తల్లి వెంట వెళతానని చెప్పడంతో సంచలనం ఏర్పడింది. వివరాలు ఇలావున్నాయి. తిరునల్వేలి జిల్లా, సెంగోట్టై సమీపానగల కాలాంగరైకు చెందిన ఉపాధ్యాయిని గోదైలక్ష్మి(23) తెన్‌కాశి సమీపానగల ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తోంది. అక్కడ 10 తరగతి చదువుతున్న కడయనల్లూరు, కృష్ణాపురానికి చెందిన విద్యార్థి శివసుబ్రమణియంతో 31 మార్చి, 2015న పరారైంది. వారు పుదుచ్చేరికి వెళ్లి వివాహం చేసుకుని తిరుపూరులో నివశిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. పోలీసులు గత 10వ తేదీన అక్కడికి వెళ్లి గోదైలక్ష్మి, శివసుబ్రమణియన్‌లను పులియంగుడికి తీసుకువచ్చారు. ఇరువురికి తెన్‌కాశి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు జరిపారు. గోదైలక్ష్మిని తిరునల్వేలి కొక్కిరకులంలోగల మహిళా జైలులో నిర్బంధించారు. శివసుబ్రమణియన్‌ను నెల్లై జువైనల్ హోంలో వుంచారు. గోదైలక్ష్మి నాలుగు నెలల గర్భవతిగా ఉన్నందున ఆమెకు తగిన వైద్య చికిత్సలు అందించేందుకు కొక్కిరకుళం మహిళా జైలులో వసతులు లేకపోవడంతో తిరుచ్చిలోని మహిళా జైలుకు మార్చారు.
హైకోర్టులో హాజరు:
విద్యార్థి శివసుబ్రమణియన్ ఆచూకీ కనుగొని తెలపాలంటూ అతని తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా మంగళవారం మదురై హైకోర్టు బెంచ్‌లో శివసుబ్రమణియన్‌ను హాజరుపరిచారు. విద్యార్థి శివసుబ్రమణియన్ గడ్డం పెంచుకున్న స్థితిలో బ్రౌన్ కలర్ జీన్స్, ఎరుపు రంగు టీ షర్టు ధరించి వచ్చాడు. వీటితోపాటు కళ్లజోడు కూడా ధరించాడు. న్యాయమూర్తులు సెల్వం, చొక్కలింగం విద్యార్థితో ఎక్కడికి వెళ్లారని అడిగారు. అందుకు తిరుపూర్ వెళ్లినట్లు శివసుబ్రమణియన్ తెలిపాడు. నీ వయసెంత అని ప్రశ్నించగా 16 ఏళ్ల నాలుగు నెలలని బదులిచ్చాడు.
నువ్వు మైనర్ కావడంతో ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావని న్యాయమూర్తులు ప్రశ్నించగా, అందుకు తల్లితో వెళ్లాలనుకుంటున్నట్లు శివసుబ్రమణియన్ సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను న్యాయమూర్తులు జారీ చేశారు. తర్వాత తల్లి మారియమ్మాల్‌కు శివసుబ్రమణియన్‌ను అప్పగించారు. అతన్ని కన్నీటితో తల్లి మారియమ్మాళ్ తీసుకువెళ్లింది. ఈ కేసులో విద్యార్థి శివసుబ్రమణియన్ తల్లితో వెళతానని చెప్పడం సంచలనం కలిగించింది. ఉపాధ్యాయిని గోదైలక్ష్మిని హైకోర్టులో హాజరు పరిచేందుకు ఆమె తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆమె కూడా మంగళవారం కోర్టులో హాజరవుతారని భావించారు. ఈ కారణంగా హైకోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున జనం గుమికూడారు. అయితే గోదైలక్ష్మి మంగళవారం హాజరు కాలేదు. ఆమె త్వరలో హాజరు కానున్నట్లు సమాచారం.
టీచర్‌తో పరారైన విద్యార్థి
Published Wed, Mar 16 2016 2:30 AM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM
Advertisement