టీచర్ ను మోసగించిన విద్యార్థినికి జైలు!
స్వలాభం కోసం ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలినే టార్గెట్ చేసింది. అనారోగ్యం, బాధలు, కష్టాలు వంటి అనేక అసత్యాలతో నమ్మించి మోసంచేసింది. కార్న్ వాల్ కు చెందిన 22 ఏళ్ళ ఎలిసా బియాంకో.. తన ఉపాధ్యాయురాలు... 49 ఏళ్ళ సాలీ రెట్టాలక్ దయాగుణాన్నిగ్రహించి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించింది. నకిలీ ప్రేమను చూపించి, విషాదగాధను వినిపించి మైండ్ గేమ్ ఆడుకుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టించి వారి జీవితాలను నాశనం చేసి, చివరికి జైలుపాలయ్యింది.
ఎవరో తన వెంట పడుతున్నారని, తల్లిదండ్రులు సరిగా చూడటం లేదని, క్యాన్సర్ వల్ల కేవలం మూడు నెలలే బతుకుతానని ఎన్నో అబద్ధాలు చెప్పి, రెట్టాలక్ చూపించిన జాలినే ఆయుధంగా చేసుకొని, ఏకంగా ఆమె ఇంటికే మకాం మార్చేసింది. క్యాన్సర్ చికిత్స పేరున ప్రతిరోజూ ఆస్పత్రికి దింపుతున్న రెట్టాలక్ కళ్ళుగప్పి ఓ కేఫ్ లో కూర్చొని నకిలీ బ్యాండేజ్ లు వేసుకుంటూ కాలం గడిపింది. బియాంకో వేసిన నాటకాలకు రెట్టాలక్ పడిపోయింది. అంతేకాదు ఆమె ఖర్చులకు కష్టం అవుతుందని పని కూడ ఇప్పించింది. అయితే అన్నం పెట్టిన చేతినే నరికిన చందాన.. మరో అడుగు ముందుకేసిన బియాంకో... ఓ కన్సల్టెంట్ ఫిజీషియన్ జాన్ పేరున తప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తో మెయిల్స్ ఇస్తూ.. గొంతు మార్చి ఫోన్లు చేస్తూ వారిద్దరూ దగ్గరయ్యేలా చేసింది. రకరకాల నాటకాలాడుతూ బియాంకో.. రెట్టాలక్ కాపురంలో నిప్పులు పోసింది. వారి కుటుంబం విచ్ఛిన్నం అయ్యేలా చేసింది.
డాక్టర్ క్యారెక్టర్ ద్వారా తన క్యాన్సర్ ముదిరినట్లు చెప్పింది. తనపై జాలి మరింత పెరిగేలా చేసుకొంది. 2013 లో తనకు రోగం ముదిరిపోయిందని, ఇదే తన ఆఖరి పుట్టిన రోజని చెప్పి... పార్టీకోసం రెట్టాలక్ దగ్గర డబ్బు కూడ గుంజింది. దీంతో బియాంకో బాధను చూడలేని రెట్టాలక్ డాక్టర్ (లవర్ జాన్) ను కలసి ట్రీట్ మెంట్ గురించి మాట్లాడదామని ప్రయాణమైంది. తీరా డాక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించడంతో కారు ప్రయాణంలో ఆ క్యారెక్టరే లేదని నిజం చెప్పిన బియాంకో... ఏకంగా రెట్టాలక్ ను కారునుంచి బయటకు గెంటి చంపేందుకు ప్రయత్నించింది. దీంతో అసలు బండారం బయట పడింది. రెట్టాలక్ కోర్టుకు జరిగిన కథ వివరించడంతో బియాంకోకు రెండు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష వేశారు.
ఎలీసా బియాంకో అవసరానికో అబద్ధం చెబుతూ సాలీ రెట్టాలక్ జీవితాన్నే నాశనం చేసింది. 16 ఏళ్ళ వయసులో కార్న్ వాల్ లోని సెయింట్ ఆస్టెల్ కాలేజ్ లో ఆరోగ్య, సామాజిక సంరక్షణ కోర్సులో చేరిన బియాంకో.. 2009 లో ట్యూటర్ గా వచ్చిన సాలీ రెట్టాలక్ తో పరిచయం పెంచుకుంది. నిజానికి ఇటువంటి వింత, భయంకరమైన కేసులను ఎప్పుడూ తమ జీవితంలో చూడలేదని క్లిస్టఫర్ హార్వే క్లార్క్ సహా పలువురు న్యాయమూర్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.