ఉపాధ్యాయుడి అరెస్ట్‌ | teacher arrest | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడి అరెస్ట్‌

Published Sat, Jun 10 2017 11:50 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

teacher arrest

కోవెలకుంట్ల: విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన ఓ ఉపాధ్యాయుడు తప్పుడు మార్గంలో నడిచి చివరకు కటకటాలపాలయ్యాడు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో కోవెలకుంట్ల సీఐ అందించిన సమాచారం మేరకు వివరాలు... కొలిమిగుండ్ల మండలం పెట్నికోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్‌ విద్యార్థినిపై కన్నేశాడు. పాఠాలు బోధిస్తూనే ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి ఆ విద్యార్థినిని గత నెల 31వ తేదీన తన బైక్‌పై తీసుకెళ్లాడు. కుమార్తె కనిపించకపోవడంతో ఈ నెల 2వ తేదీన కొలిమిగుండ్ల పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్థిని తండ్రి  ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలిక అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
బాలికను తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు కడప జిల్లా మైదుకూరు, బద్వేలు, నెల్లూరు, జిల్లాలోని మంత్రాలయం, తదితర ప్రాంతాలకు తిప్పి వివాహం చేసుకోకుండా శారీరకంగా అనుభవించేందుకు ప్రయత్నించాడు. విద్యార్థిని ఒప్పుకోకపోవడంతో గదిలో బంధించగా మూడు రోజుల క్రితం తప్పించుని ఇంటికి చేరి తల్లిదండ్రుల సహాయంతో రాతపూర్వకంగా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో కిడ్నాప్‌ కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన కొలిమిగుండ్ల పోలీసులు రాజశేఖర్‌ను బెలూం గుహల వద్ద అరెస్టు చేసి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉపాధ్యాయుడు గతంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచే స్తూ మైనర్‌ బాలికలకు మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలు ఉన్నాయి. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిని విధుల నుంచి తప్పించాలని డీఈఓకు రాత పూర్వకంగా తెలియజేశారు. కార్యక్రమంలో కొలిమిగుండ్ల ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, ఏఎస్‌ఐ ఉస్మాన్‌గని, కానిస్టేబుళ్లు రాముడు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement