మృతి చెందిన సిరాజిన్
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
బండిఆత్మకూరు(కర్నూలు): ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు బి.కోడూరు గ్రామానికి చెందిన షేక్‌మాబు, తహరూన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. రెండో కుమార్తె సిరాజిన్(16) నంద్యాల పట్టణంలో ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
కాగా సిరాజిన్ తండ్రి షేక్‌మాబు కార్పెంటర్‌గా పని చేస్తునన్నాడు. అయితే ఇతని వద్ద అదే గ్రామానికి చెందిన సయ్యద్ జమాల్ అనే వ్యక్తి కార్పెంటర్‌గా పని చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో జమాల్ తరచూ షేక్‌మాబు ఇంటి వద్దకు వస్తున్న క్రమంలో సిరాజాన్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో అతనితో పెళ్లి జరిపించాలని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. తండ్రి ఇప్పుడే పెళ్లి వద్దని కుమార్తెను మందలించాడు. చదువు పూర్తయిన తర్వాత ఆలోచిద్దామని తెలిపాడు.
దీంతో తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాదేమోనని తరచూ సమీప బంధువులతో చెప్పుకొని బాధపడేది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది గురువారం పురుగుల తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.