పుట్టిన రోజు పండుగ | jayalalitha birthday celebrations | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజు పండుగ

Published Mon, Feb 24 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

పుట్టిన రోజు పండుగ

పుట్టిన రోజు పండుగ

 జయలలితకు శుభాకాంక్షల వెల్లువ
  వాడ వాడలా వేడుకలు
  పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరాల పంపిణీ
 
 రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సోమవారం 66వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆమె జన్మదినాన్ని రాష్ట్ర ప్రజలు పండుగలా జరుపుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఆకారంలో 66 కిలోల కేక్‌ను కట్ చేసి పంచిపెట్టారు. రాష్ర్ట వ్యాప్తంగా పేదలకు చీరలు, స్వీట్లు పంచిపెట్టారు. విరివిగా అన్నదానం, రక్తదానం కార్యక్రమాలు నిర్వహించారు.
 
 సాక్షి, చెన్నై:
 పురట్చి తలైవి జయలలిత జన్మదిన వేడుకలకు అన్నాడీఎంకే వర్గాలు భారీగా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. సోమవారం వేకువజాము నుంచే అమ్మ జన్మదిన సంబరాలు మొదలయ్యాయి. మదురై, తిరుచ్చి, పళని, తిరుత్తణి, తిరుచెందూరుల్లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. వాడవాడలా అన్నాడీఎంకే జెండాలు, తోరణాలు బాణసంచాల మోత మోగించారు. దివంగత నేత ఎంజీయార్, సీఎం జయలలిత చిత్రాల్లోని పాటలను హోరెత్తించారు. 66 కిలోల కేక్‌లను కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనాథ ఆశ్రమాలు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు పంచి పెట్టారు. అన్నదానాలు, రక్తదానాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు వస్త్రాలు, కుట్టుమిషన్లు తది తర సంక్షేమ పథకాల్ని అందించారు. సోమవారం పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరాల్ని తొడిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడ వాడల్లో వేడుకలు అంబరాన్ని తాకాయి. బహిరంగ సభల రూపంలో అన్నాడీఎంకే రాష్ట్ర పార్టీ కార్యాలయం నేతృత్వంలో అన్ని జిల్లాల్లో వేడుకలు సాయంత్రం ఆరంభం అయ్యాయి. ఈనెల 28వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. అన్నాడీఎంకే ప్రస్తానం, సీఎం జయలలిత పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
 
 రాష్ట్ర కార్యాలయంలో...: రాాష్ట్ర పార్టీ కార్యాలయంలో వేడుకలు అంబరాన్ని తాకారుు. ఉదయాన్నే పోయేస్ గార్డెన్‌కు పెద్ద ఎత్తున అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తరలి వచ్చారు. తమ అధినేత్రికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉరకలు తీశారు. పార్టీ అనుబంధ మహిళా విభాగం నేతృత్వంలో పోయేస్ గార్డెన్ ఇంటి వద్ద భారీ కేక్‌ను కట్ చేశారు. ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం అందరికీ కేక్ పంచి పెట్టారు. పేదలకు వస్త్రదానం చేశారు. పోయేస్ గార్డెన్ నుంచి రాయపేట పార్టీ కార్యాలయానికి బయలు దేరిన జయలలితకు అడుగడుగున నీరాజనాలు పలికారు. కోలాటాలు, డప్పు వాయిద్యాలు, కేరళ మేళతాళాలు, గరగాట్టం, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో ఆ మార్గం  జాతరను తలపించింది. పార్టీ కార్యాలయానికి చేరుకున్న జయలలిత కార్యకర్తలు, నాయకులు అభివాదం తెలియజేశారు. అనంతరం ఎంజియార్ మండ్రం నేతృత్వంలో పార్లమెంట్ ఆకారంలో 66 కిలోల కేక్‌ను సిద్ధం చేశారు. దీనిని ఆ మండ్రం నేతలు పీహెచ్ పాండియన్, పొన్నయ్యన్‌లు కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు మంత్రి వలర్మతి, థౌజండ్ లైట్స్ కౌన్సిలర్ శివరాజ్ నేతృత్వంలో శీతల పానీయాలు అందజేశారు. అనంతరం సచివాలయం చేరుకున్న జయలలిత పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రోజంతా బిజీబిజీగా గడిపారు.
 
 శుభాకాంక్షల వెల్లువ: ముఖ్యమంత్రి జయలలితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా, బొకేతో తన ప్రతినిధిని పోయేస్ గార్డెన్‌కు పంపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, తదితర నాయకులతో పాటుగా పలువురు బీజేపీ జాతీయ నేతలు, మరికొన్ని పార్టీల నాయకులు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement