ప్రత్యేక పాలన | Local elected representatives dead line is over in chennai city | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పాలన

Published Tue, Oct 25 2016 2:32 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

Local elected representatives dead line is over in chennai city

ముగిసిన స్థానిక ప్రజాప్రతినిధుల గడువు
నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన
గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పెత్తనానికి సోమవారంతో తెరపడింది. వారి స్థానంలో నియమితులైన ప్రత్యేక అధికారుల అజమాయిషీకి మంగళవారం తెర లేవనుంది. ప్రత్యేక అధికారుల పాలన కోసం ప్రభుత్వం సోమవారం గెజిట్ ద్వారా ఉత్తర్వులను విడుదల చేసింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని 12 కార్పొరేషన్ల పరిధిలో 919 వార్డు సభ్యులు, 124 మున్సిపాలిటీల్లో  3613 వార్డు సభ్యులు, 528 పంచాయతీల్లో 8,288 వార్డు సభ్యులు లెక్కన మొత్తం 12,820 ప్రజా ప్రతినిధుల పదవులు ఉన్నాయి. 31 జిల్లా పంచాయతీల్లో 655 వార్డు సభ్యులు, 388 పంచాయతీల్లో 6,471 వార్డు సభ్యులు 12,524 గ్రామ పంచాయతీల్లో 99,324 వార్డు సభ్యుల పదవులున్నాయి. ఇలా అన్ని స్థానిక సంస్థలను కలుపుకుని మొత్తం 1,31,794 స్థానిక సంస్థల్లోని పదవులకు 2011లో ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. వీరి పదవీకాలం  సోమవారం ముగిసిపోయింది. వీరి పదవీకాలం ముగిసిపోయేలోపే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 17, 19 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయలేదంటూ మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్నికలను రద్దు చేయడంతోపాటూ తాజా నోటిఫికేషన్‌ను జారీ చేసి ఈ ఏడాది డిసెంబరు 31లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కార్యకలాపాలను వెంటనే నిలిపి వేసింది.

 ప్రత్యేక అధికారులు

 పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజాప్రతినిధులు లేని స్థానిక సంస్థల్లో  ప్రత్యేక అధికారుల నియామకం అవసరమైంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన కేబినెట్ సమావేశమై ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. మరలా 19వ తేదీన మంత్రివర్గం మళ్లీ సమావేశమై అధికారులకు అప్పగించాల్సిన బాధ్యతలపై చర్చించారు. ప్రత్యేక అధికారుల పాలనపై రంగం సిద్ధం కాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ ద్వారా ప్రభుత్వం సోమవారం జారీచేసింది. ప్రజాప్రతినిధులు లేనపుడు సహజంగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కమిషనర్లు, పంచాయితీల్లో పంచాయతీ ఆఫీసర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. తాజా పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలుచేయనుంది. అయితే గ్రామ పంచాయతీ పదవులు లక్షకు పైగా ఉన్నందున ఆయా పంచాయతీలపై పరిపాలనపరమైన నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్లకు వదిలివేశారు. ఒక్కో ప్రత్యేకాధికారికి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ద్వారా తెలుస్తోంది. అలాగే ప్రత్యేక అధికారులకు బాధ్యతలతోపాటూ వాహన సదుపాయం, నెలకు 50 లీటర్ల డీజిల్‌ను కేటాయించనున్నారు. మంగళవారం నుంచి బాధ్యతల్లో దిగనున్న ప్రత్యేక అధికారులు ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు ఆయా బాధ్యతల్లో కొనసాగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement