రూ.1,333 బదులుగా రూ.1.33 లక్షలు..
రూ.1,333 బదులుగా రూ.1.33 లక్షలు..
Published Thu, Aug 17 2017 9:28 AM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM
ముంబై: లోకల్ టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద రైల్వే సిబ్బంది చేసిన చిన్న పొరపాటుతో ఓ ప్రయాణికుడి ఖాతాలోంచి రూ.1,333 బదులుగా ఏకంగా రూ.1.33 లక్షలు రైల్వే ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ మొత్తాన్ని రికవరి చేసుకోవడానికి రైల్వే కార్యాలయం చుట్టు తిరిగి, తిరిగి బేజారైతున్నాడు ఆ ప్రయాణికుడు.
ముంబై బోరివలిలో ఉంటున్న వికాస్ మంచేకర్ నిత్యం లోకల్ రైలులో ప్రయాణిస్తాడు. ఈ నెల నాలుగో తేదీన సీజన్ పాస్ కొనుగోలు చేయడానికి బోరివలి స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ మొదటి తరగతి (ఫస్ట్ క్లాస్) త్రైమాసిక సీజన్ పాస్ రూ.1,333.30 పైసలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో వికాస్ తనవద్ద ఉన్న క్రెడిట్ కార్డు బుకింగ్ క్లర్క్‌కు ఇచ్చాడు.
పీఓఎస్ మెషిన్‌పై స్వైప్ చేసిన ఆ క్లర్క్ పొరపాటున రూ.1333.30 బదులుగా రూ.1,33,330 ఇలా అంకెలు వేయడంతో ఏకంగా రూ.1.33 లక్షలు వికాస్ అకౌంట్‌లో నుంచి రైల్వే అకౌంట్‌లోకి వెళ్లిపోయాయి. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో లబోదిబోమంటూ సమీపంలో ఉన్న రైల్వే కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు ఇప్పటికీ తన అకౌంట్‌లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అనేక మంది క్రెడిట్, డెబిట్ కార్డు, ఏటీఎం, యూపిఐ లాంటి ఈ–పేమెంట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే వికాస్ తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డు ఇచ్చాడు. కానీ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పుల్‌స్టాప్, కామాలు అటు, ఇటు కావడంతో అతడి కొంప ముంచింది. ఇప్పటికి ముంబై సెంట్రల్, ప్రజా సంబంధాల అధికారితో తరుచూ సంప్రదింపులు జరుపుతున్నారు. వికాస్ క్రెడిట్ కార్డు ఈ నెల 24తో గడువు ముగుస్తుంది. ఆ లోపు రైల్వే అతని డబ్బులు ఖాతాలో వేయని పక్షంలో అదనంగా రూ.4–5 వేల జరిమానా భారం పడనుంది.
Advertisement
Advertisement