శివమొగ్గ నగరంలోని నెహ్రు రోడ్డులో గల మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయంలో రూ.11.50 లక్షలు చోరీకి గురైన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది.
శివమొగ్గ : శివమొగ్గ నగరంలోని నెహ్రు రోడ్డులో గల మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయంలో రూ.11.50 లక్షలు చోరీకి గురైన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నెహ్రు రోడ్డులో గల మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యాలయంలో దుండగులు కమలానెహ్రు కాలేజీ వెనుకభాగం ద్వారా చిట్‌ఫండ్ కార్యాలయం కిటికీ బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో నగదు ఉంచిన స్ట్రాంగ్ రూం తలుపులు తెరిచి అందులో ఉన్న సుమారు రూ.11 లక్షల 50 వేలు తీసుకెళ్లారు.
గ్యాస్‌కట్టర్ కారణంగా చెలరేగిన స్వల్ప మంటలతో గదిలో ఉన్న ఉన్న విలువైన చెక్కులు, కొంత నగదు అగ్నికి ఆహుతయ్యాయి. ఎస్‌పీ.కౌశలేంద్రకుమార్, కోటే పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దీపక్ హెగ్డే, ఎస్‌ఐ చిన్నప్ప సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేయించారు. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపే ఈ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు. సోమవారం కార్యాలయానికి సెలవు. మంగళవారం కార్యాలయానికి సిబ్బంది రావడంతో చోరీ వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.