
కారు అద్దాలు పగులగొట్టి రూ.5 లక్షలు చోరీ
పళ్లిపట్టు: పట్టపగలు ఆగి ఉన్న కారు అద్దాలు పగులగొట్టి రూ. ఐదు లక్షల నగదు చోరీ చేశారు. ఈ సంఘటన కంచిలో కలకలం రేపింది. కాంచీపురం జిల్లా తిరుక్కళికుండ్రం ప్రాంతానికి చెందిన సత్యనారాయణన్ (45) బిల్డర్. ఇతడు శుక్రవారం ఉదయం చెంగల్పట్టు బ్యాంకు నుంచి రూ. ఐదు లక్షల నగదు డ్రా చేసుకుని ఒరగడంలో భవనం నిర్మిస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు బయలుదేరాడు.
అయితే మార్గమధ్యలో కాంచీపురంలో బంధువుల ఇంటికి వెళ్తూ గాంధీ రోడ్డులో కారు ఆపి వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అదును చూసి దుండగులు కారు అద్దాలు పగులగొట్టి అందులోని రూ. ఐదు లక్షలను చోరీ చేసి పరారయ్యారు. దీనిపై బాధితుడు కంచి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.