కందకూరు తేళ్లు కుట్టనే కుట్టవు...
కందకూరు తేళ్లు కుట్టనే కుట్టవు...
Published Sun, Aug 3 2014 10:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
రాయచూరు రూరల్ : ఒక తేలు కనిపిస్తే ఆమడ దూరం పరుగెత్తుతాం.. ఒకే సారి వందలాది తేళ్లు కనిపిస్తే గుండె ఆగినంత పనవుతుంది. అయితే యాదగిరి తాలూకాలోని కందకూరు గ్రామంలో మాత్రం తేళ్లు కుట్టనే కుట్టవు..వాటిని గిచ్చి గిల్లి ఒంటిపై వేసుకున్నా సాధు జంతువులా ఉంటాయి తప్పితే కుట్టనే కుట్టవు..ఇది ఒక్క రోజు మాత్రమే.
ఎందుకంటే ఆరోజు కొండమాయి దేవి ఉత్సవం జరుగుతుంది కాబట్టి. వివరాల్లోకి వెళ్తే.. దేశ వ్యాప్తంగా నాగ పంచమి రోజున నాగదేవతకు పూజలు నిర్వహిస్తే యాదగిరి తాలూకాలోని కందకూరులో కొండమాయి(తేలు)దేవికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ.
తేళ్లకు పుట్టినిల్లుగా పేరొందిన ఈ గ్రామంలో కొండపై ఉన్న కొండమాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంచమి రోజున కొండపై అనేక జాతులకు చెందిన తేళ్లు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తాయి. ఎర్ర తేలు, ఇనుప తేళ్లు వంటి విషపూరితమైన తేళ్లు అధిక సంఖ్యలో దర్శనమిస్తాయి. గ్రామ ప్రజలకు జాతి, మత భేదాలు లేకుండా దేవస్థానంలో పూజలను నిర్వహిస్తారు.
దేవస్థానానికి వచ్చే భక్తులు, పిలల్లు ఈ తేళ్లను పట్టుకునేందుకు పోటీలు పడుతుంటారు. పాములను కూడా మెడలో వేసుకుని ఆడుకుంటుంటారు. ఈరోజున ఏ విష జంతువు అయినా హాని తలపెట్టదని, కాటు వేసినా కొండమాయి దేవి విబూధిని పెట్టుకుంటే నయమవుతుందని ఈ పద్దతి అనేక సంవత్సరాల నుండి కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.
నాగపంచమిని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం కొండపై అమ్మవారికి పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి తేళ్లను పట్టుకొని ప్రత్యేక అనుభూతికి లోనయ్యారు.
Advertisement
Advertisement