Nagula Panchami
-
పుట్టలో పాలుపోసి వచ్చాక.. ఇలా జరగడంతో.. భయాందోళనలో స్థానికులు!
సాక్షి, కరీంనగర్: నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలుపోసిన ఓ మహిళ.. తన కుటుంబసభ్యులను సల్లంగా చూడాలని వేడుకుంది. నాగదేవతకు పూజలుచేసింది. ఆ రాత్రే ఆమె అనూహ్యంగా పాముకాటుకు గురై ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధి అంబేడ్కర్‌నగర్‌కు చెందిన బొడ్డెల భారతి(40) శుక్రవారం రాత్రి పాముకాటుతో మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో కింద వేసుకున్న దుప్పట్లలో దూరిన పాము భారతినికాటు వేసింది. ఏదో కుట్టినట్లుగా ఉండడంతో నిద్రలేచేసరికి పాము కనిపించిందని, శరరంపై గాట్లు కూడా ఉండడంతో వెంటనే స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు.. గోదావరిఖనికి తరలించగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా నాగులపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించిన సదరు మహిళ.. పాముకాటుకు గురికావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇవి చదవండి: వివాహం కావడంలేదని.. యువకుడు మనస్తాపంతో ఇలా.. -
నాగుల పంచమి నాడు నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు
శ్రావణమాసానికి ఎంతో విశిష్టత ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మాసంలో ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణమాసం ప్రారంభం కాగానే నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతాయి. ఇక నిన్న శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగపంచమి అంటే పుట్టలో పాలుపోసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. కానీ పామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసే వ్యక్తులు ఉంటారన్న విషయం మీకు తెలుసా? ఇది ఏంటో తెలియాలంటే స్టోరీ చదివేయండి. నాగ పంచమి రోజున నాగపామునే నట్టింట్లోకి తీసుకొచ్చి పూజ చేసింది ఓ కుటుంబం. చక్కగా పూలు, పాలతో పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆశీస్సులు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన ప్రశాంత్ హులేకర్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రతి ఏటా నాగులపంచమికి కుటుంబంతో కలిసి పాములకు ప్రత్యేకంగా పూజలు చేస్తారట. అది కూడా ఇంటికి తీసుకొచ్చి మరీ. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నాగుల పంచమి సందర్భంగా ఓ పామును తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆ పామును అడవిలో వదిలిపెట్టారు. తనకు పాములంటే ఇష్టమని పాముల సంరక్షణ కోసం కృషి చేస్తుంటానని ప్రశాంత్ తెలిపాడు. అతని తండ్రి సురేష్ కూడా పాముల సంరక్షణ కోసం చాలా చేశాడట. ఇక ప్రతీ ఏడాది నాగుల పంచమి నాడు ఇలా పాముని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని అడవిలో వదిలివేయడం చేస్తామని పేర్కొన్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా ఇలా చేయడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తుందని, ఇప్పటివరకు దీని వల్ల కుటుంబంలో ఎవరికి హానీ జరగలేదని తెలిపాడు. పాముల పట్ల తమకు ప్రత్యేక భక్తి ఉందని, అందుకే ఇలా చేస్తానని వెల్లడించాడు. -
అంతటా నాగుల పంచమి.. కానీ అక్కడ మాత్రం తేళ్ల పంచమి
శుక్రవారం అందరూ నాగుల పంచమి వేడుకలు చేసుకుంటే.. నారాయణపేట జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరులో భక్తులు తేళ్ల పంచమి నిర్వహించారు. గ్రామ సమీపంలోని కొండపై కొండమవ్వను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై ఏ చిన్నరాయిని తొలగించినా తేళ్లు కనిపించడంతో పట్టుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపారు. పంచమి నాడు వాటిని చేతితో తాకినా, పట్టుకున్నా, శరీరంపై పాకించినా కుట్టవని భక్తుల నమ్మకం. తేళ్లను తమ ముఖం, చేతులు, మెడపై వేసుకుంటూ వారు ఆనందపడ్డారు. ఏటా నాగులపంచమి రోజే తేళ్ల పంచమి నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కాగా తేళ్లను తాకితే మంచి జరుగుతుందని భక్తులు అంటుండగా.. వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా ఆ తేళ్లు కుట్టవని కొందరు విద్యావేత్తలు చెబుతుంటారు. – నారాయణపేట ప్రాణముందని.. ప్రేమను పంచి మహబూబ్‌నగర్ పట్టణం బండ్లగేరిచౌరస్తాలో.. ఎద్దులు బండిని లాగుతుండగా దాని మీద రైతు నిల్చున్నట్లుగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే, శుక్రవారం అటుగా వెళ్తున్న ఓ ఆవు.. బొమ్మ ఎద్దులు నిజమైనవి అనుకొని ఇలా వాటి వద్దకు వెళ్లి మూగ ప్రేమను పంచడం చూపరులను ఆకట్టుకుంది. – ‘సాక్షి’ సీనియర్ ఫొటోగ్రాఫర్, మహబూబ్‌నగర్ జనసంద్రమైన నాగోబా ఆలయం.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం శుక్రవారం జనసంద్రంగా మారింది. నాగులపంచమి కావడంతో భారీసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులకు జొన్నగట్కాతో అన్నదానం చేశారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, సర్పంచ్ మెస్రం రేణుక పూజల్లో పాల్గొన్నారు. – ఇంద్రవెల్లి(ఖానాపూర్) -
నాగ పంచమి: నాగులను పూజించడం వెనుక ఆంతర్యం ఏంటంటే..
‘ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్’ ప్రతి ఏటా శ్రావణమాసంలో ఐదవరోజు… శుద్ధ పంచమి రోజును నాగ పంచమిగా పాటిస్తారు. ‘నాగ పంచమి’గా కొందరు, ‘గరుడ పంచమి’ గా మరికొందరూ పూజలు చేస్తారు. నారాయణుడి శయ్య అయిన శేషుడి పేరు మీదుగా చేసుకునే పూజే ‘నాగ పంచమి’. కార్తీకమాసంలో వచ్చే ‘నాగులచవితి’ మాదిరిగానే ‘నాగ పంచమి’ నాడు కూడా నాగదేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజుగా దీనికి ప్రశస్తి. ‘‘నాగుల చవితి’’ రోజులాగే.. ‘‘నాగ పంచమి” నాడు కూడా నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ ఉండవని, చేపట్టిన కార్యాలు సవ్యంగా నెరవేరుతాయని, అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో ‘సర్పం’ దైవ స్వరూపమే. వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు. పరమేశ్వరుడికి కర్ణాభరణమ్. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు కూడా. వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయం దేశమంతా నడుస్తోంది. పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, జారవిడిచి నైవేద్యంగా సమర్పిస్తారు. పార్వతీ దేవికి పరమేశ్వరుడు ఈ క్రింది విధముగా చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగినది. ఓ పార్వతీ దేవి, శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగ దేవతారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల సర్ప ప్రతిమను చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల సర్ప చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. పురాణ కథ.. కశ్యప ప్రజాపతి, కద్రువ దంపతులకు.. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , నవనాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు.. జన్మిస్తారు. వీళ్లు కనబడిన వారినల్లా కాటు వేస్తూ ప్రాణాలను హరిస్తుంటారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను ఆశ్రయిస్తారు. దీంతో బ్రహ్మ ఆగ్రహించి.. ‘తల్లి చేతిలో శాపానికి గురై వాళ్లంతా నాశనం అవుతార’ని శపిస్తాడు. అప్పుడు ఆ అన్నదమ్ములంతా విధాత ముందు తలవంచుతారు. ‘‘సృష్టించిన మీరే.. మమ్మల్ని నాశనం కావాలని శపించడం న్యాయమా?’’ అని వేడుకుంటారు. దీంతో శాంతించిన బ్రహ్మ.. నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మణి సమేతులను తప్పించుకుని తిరగండి . దేవతా విహంగ గణాలకు, జ్ఞాతులైన మీరు.. మీమీ స్థాన గౌరవాలను కాపాడుకోండి. వాయుభక్షకులై సాధుజీవులుగా మారిపోండి. మీ నాగులంతా ఇక అతల, వితల పాతాళ లోకాలలో నివాసం చేయండి’’ అని శాసిస్తాడు. దీంతో ఆ నాగ సంతతి అన్నదమ్ములంతా బ్రహ్మ ఆజ్ఞను శిరసావహిస్తారు. అది చూసి దేవతలంతా నాగులను ప్రశంసించగా.. భూలోక వాసులంతా పూజలు చేశారు. అలా దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతా పూర్వకంగా నాగ పంచమి నాడు నాగులను పూజించడం జనాలకు పరిపాటిగా మారింది. ఎలా చేస్తారంటే.. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నెయ్యితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి. నాగ పంచమి వ్రత కథ పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుండేది. ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు, వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . ఆయన విని “అమ్మా ” నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందు వలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , ఇపుడు పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి. ఆంతర్యం ఇదే.. ఇక ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని, పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాశము వారిది అని అనుకోవాలి. మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శారీరక పరంగా వానరం ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా సర్పం విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే.. సర్పాలు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షింపబడతాయి. అలాగే వీటి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ కొంత జరుగుతుందని విశ్వసిస్తారు. పుట్టలో పాలు ఈ క్రింది శ్లోకం చదువుతూ పోయాలి . విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీరభయం భవతి కుత్ర చిత్।। ఈక్రింది శ్లోకం మననం చేసుకోని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే, నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం . కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం।। గరుడ పంచమి నాగపంచమిలాగే గరుడ పంచమి వ్రతాన్ని కూడా కొందరు చేస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు గరుత్మంతునిలా బలంగా చురుగ్గా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు. తిరుమలలో స్వామివారు గరుడ పంచమినాడు మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతారు, ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి అనూచానంగా వస్తున్న విధానం ప్రకారం చేయడం సంప్రదాయం. ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. లేనివారు స్నానం చేసి శుచిగా ఓం తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్ అనే గరుడ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మంచిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం
-
నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో నాగుల పంచమి రోజున అరుదైన దృశ్యం వెలుగు చూసింది. గ్రామ శివారులోని బొమ్మన వేణి మల్లయ్య వ్యవసాయ పొలంలో రెండు సర్పాలు సయ్యాటలాడాయి. రెండు గంటలపాటు ప్రకృతి ఒడిలో పరవసించి పోయాయి. పాముల సయ్యాటను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఆసక్తిగా తిలకించారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. (నెటిజనుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్) -
నాగుల పంచమి: కొండచిలువ కలకలం
సాక్షి, నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం రేపింది. ఆలయంలోని అక్షరాభ్యాస మండపం ప్రధాన ద్వారం ముందు పొడవాటి కొండచిలువ శనివారం కనిపించింది. ఈ రోజు శ్రావణమాసం మొదటి శనివారం, నాగుల పంచమి కావడంతో లింగాకారంలో కొండచిలువ దర్శనం ఇచ్చిందని భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కొండ చిలువకు భక్తులు పాలు పోసి పూజలు చేశారు. దీంతో ఆలయం సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. (పులికి చెమటలు పట్టించిన పైథాన్) అదే విధంగా ఆదిలాబాద్ మండల పరిధిలోని అర్లిబి గ్రామంలో నాగుల పంచమి సందర్భంగా రెండు జంట నాగులు సయ్యాటలాడాయి. ఈ ఘటన చెక్ డ్యాం వద్ద చోటుచేసుకుంది. శనివారం నాగుల పంచమి కావడం, రెండు నాగుపాములు ఆడుతూ కనిపించడంతో స్థానికులు ఆసక్తికరంగా వీక్షించారు. -
బాసర సరస్వతి ఆలయంలో కొండచిలువ కలకలం
-
ఇంట్లోకి వచ్చిన నాగుపాముకు పూజలు
సాక్షి, బెంగళూరు : నాగపంచమి రోజున ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగు పాముకు స్థానికులు పూజలు నిర్వహించారు. వివరాలు.. శ్రీనివాసపురం పట్టణంలో వీరేంద్రకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆదివారం నాగుపాము ఇంట్లోకి ప్రవేశించగా పాములు పట్టే నిపుణుడు అమీర్ చాంద్‌ను పిలిపించారు. దానిని పట్టుకునేందుకు యత్నిస్తుండగా బచ్చలిపైప్లోకి వెళ్లిపోయింది. దీంతో మరో వైపు నుంచి నీరుపోయడంతో పాము బయటకు రాగా స్నేక్రాజ్ ఒడిసి పట్టుకున్నాడు. అయితే నాగపంచమి రోజున ఇంటికి వచ్చిన నాగుపాముకు మహిళలు భక్తితో పూజలు చేశారు. అనంతరం పామును సురక్షితంగా అడవిలో వదలిపెట్టారు. నేడు గరుడ పంచమి తిరుమలలో సోమవారం గరుడ పంచమి ఘనంగా నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితంలో ఆనందాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడపంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం. ఇందులో భాగంగా రాత్రి 7నుంచి 9గంటల వరకు మలయప్ప స్వామి తనకు ఇష్టవాహనమైన గరుడినిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. అలాగే ఈ నెల 15న గురువారం శ్రావణ పౌర్ణమినాడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 9గంటలక వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. -
పాములకు పాలుపోస్తే ఖబర్దార్!
సాక్షి, హైదరాబాద్ : పాములకు పాలు పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. పాములు పాలు తాగుతాయన్నది మూఢ నమ్మకమని, పాములను పట్టుకుని హింసించవద్దని సూచించింది. ఎవరైనా పాములను పట్టుకుని ఆడిస్తే... వెంటనే అటవీశాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. వన్యప్రాణి చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనిపై ప్రసార మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా నాగుల చవితి, పంచమి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోయడం ఆచారంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే పర్యావరణ సమతుల్యతలో పాములు కూడా భాగమే అని, పాములను పట్టి ఆడించడం కూడా వన్యప్రాణి చట్టప్రకారం నేరం అని అటవీశాఖ స్పష్టం చేసింది. వచ్చే నెల 5వ తేదీన పంచమి సందర్భంగా పాములకు పాలు పోయడంపై... సోమవారం అరణ్య భవనంలో జరిగిన అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో ఓ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాములకు పాలు పోయడం, పాములను ఆడించడం, బలవంతంగా పాములను హింసించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మరోవైపు ప్రజల మనోభావాలను దెబ్బతీయరాని, వారిపై బలవంతపు నిర్ణయాలు రుద్దడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
కిక్కిరిసిన కేస్లాపూర్
ఇంద్రవెల్లి(ఖానాపూర్) : నాగుల పంచమి పండుగ సందర్భంగా బుధవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలిరావడంతో జాతరను తలపించింది. ఉదయం నుంచే మండలంలోపాటు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు, మెస్రం వంశీయులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు హాజరై నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మెస్రం వంశీయులు నాగుల పంచమి పండుగ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో వండిన జొన్న గట్కాను వారి ఆచారం ప్రకారం మోదుగ ఆకుల్లో భోజనం చేశారు. ఆలయ పరిసర ప్రాంతంలో దుకాణాలు, రంగుల రాట్నాలు, సర్కస్‌లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఉల్లాసంగా గడిపారు. మొదటి రోజు నాగుల పంచమి పూజలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు మూడు కిలోమీటర్ల వరకు ట్రాపిక్ జాం అయింది. దీంతో ముత్నూర్ నుంచి కాలనడకన నాగోబా ఆలయానికి వెళ్లి భక్తులు పూజలు చేశారు. నాగుల పంచమి పూజలు గురువారం వరకు కొనసాగుతాయని మెస్రం వంశీయులు తెలిపారు. ఆకట్టుకున్న ఆటల పోటీలు ఈ సందర్భంగా శ్రీ నాగోబా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలు అకట్టుకున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచే కాక మహారాష్ట్రలోని కిన్వట్ తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సుమారు 20కు పైగా వాలీబాల్ జట్లు, 42 కబడ్డీ జట్లు పాలొగన్నాయి. ఈ పోటీలను ఎంపీ గోడం నగేశ్, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, జెడ్పీటీసీ దేవ్‌పూజే సంగీత, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గడ్గే సుబాష్, కృష్ణకుమార్, పెందోర్ తులసీరాం, జీవీ రమణ, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, మాజీ సర్పంచ్ మెస్రం నాగ్నాథ్, మెస్రం వంశీయులు మెస్రం చిన్ను, మెస్రం హనుమంత్‌రావ్, కోసు, మెస్రం వంశం ఉద్యోగస్తులు మెస్రం శేఖర్, మెస్రం దేవ్‌రావ్ ఉన్నారు. పోలీసు భారీ బందోబస్తు కేస్లాపూర్ నాగోబా ఆలయంలో పూజలకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉట్నూర్ సీఐ వినోద్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ట్రాపిక్ సమస్య తలెత్తకుండా ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు ప్రత్యేకంగా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. -
ఘనంగా నాగుల పంచమి
మొయినాబాద్: నాగుల పంచమి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మహిళలు నాగదేవతలకు పూజలు నిర్వహించారు. మండలంలోని పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, దేవల్ వెంకటాపూర్, చందానగర్, రెడ్డిపల్లి, మోత్కుపల్లి, ఎలుకగూడ, అమీర్‌గూడ, మొయినాబాద్, సురంగల్, శ్రీరాంనగర్, వెంకటాపూర్, నాగిరెడ్డిగూడ తదితర గ్రామాల్లో మహిళలు నాగదేవతల విగ్రహాలకు, పుట్టలకు పూజలు చేశారు. -
కందకూరు తేళ్లు కుట్టనే కుట్టవు...
రాయచూరు రూరల్ : ఒక తేలు కనిపిస్తే ఆమడ దూరం పరుగెత్తుతాం.. ఒకే సారి వందలాది తేళ్లు కనిపిస్తే గుండె ఆగినంత పనవుతుంది. అయితే యాదగిరి తాలూకాలోని కందకూరు గ్రామంలో మాత్రం తేళ్లు కుట్టనే కుట్టవు..వాటిని గిచ్చి గిల్లి ఒంటిపై వేసుకున్నా సాధు జంతువులా ఉంటాయి తప్పితే కుట్టనే కుట్టవు..ఇది ఒక్క రోజు మాత్రమే. ఎందుకంటే ఆరోజు కొండమాయి దేవి ఉత్సవం జరుగుతుంది కాబట్టి. వివరాల్లోకి వెళ్తే.. దేశ వ్యాప్తంగా నాగ పంచమి రోజున నాగదేవతకు పూజలు నిర్వహిస్తే యాదగిరి తాలూకాలోని కందకూరులో కొండమాయి(తేలు)దేవికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. తేళ్లకు పుట్టినిల్లుగా పేరొందిన ఈ గ్రామంలో కొండపై ఉన్న కొండమాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంచమి రోజున కొండపై అనేక జాతులకు చెందిన తేళ్లు ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తాయి. ఎర్ర తేలు, ఇనుప తేళ్లు వంటి విషపూరితమైన తేళ్లు అధిక సంఖ్యలో దర్శనమిస్తాయి. గ్రామ ప్రజలకు జాతి, మత భేదాలు లేకుండా దేవస్థానంలో పూజలను నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు, పిలల్లు ఈ తేళ్లను పట్టుకునేందుకు పోటీలు పడుతుంటారు. పాములను కూడా మెడలో వేసుకుని ఆడుకుంటుంటారు. ఈరోజున ఏ విష జంతువు అయినా హాని తలపెట్టదని, కాటు వేసినా కొండమాయి దేవి విబూధిని పెట్టుకుంటే నయమవుతుందని ఈ పద్దతి అనేక సంవత్సరాల నుండి కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. నాగపంచమిని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం కొండపై అమ్మవారికి పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి తేళ్లను పట్టుకొని ప్రత్యేక అనుభూతికి లోనయ్యారు. -
ఘనంగా నాగుల పంచమి
సాక్షి, ముంబై: నగరంలో ఆదివారం తెలుగు ప్రజలు నాగపంచమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి నాగ దేవతకు పాలు పోసేందుకు భక్తులు ఆలయాల బయట బారులు తీరారు. దీంతో మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా సోదరుల కళ్లు పాలతో కడిగేందుకు పెళ్లైన అక్కా, చెల్లెళ్లు పుట్టింటికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు పాలతో కళ్లు కడిగితే మంచిగా కనబడతాయని, దృష్టిలోపం ఉండదని ప్రగాఢ నమ్మకం. దీంతో తెలుగు ప్రజలు నివాసముంటున్న చాల్స్, భవనాలు ఇలా ఎక్కడ, ఏ ఇంట్లో చూసినా తోబుట్టువులు పుట్టింటికి వచ్చిన దృశ్యాలే దర్శనమిచ్చాయి. నగరంలో ముఖ్యంగా లోయర్‌పరేల్‌లోని ఏ టు జెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న నాగ దేవత మందిరానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా చిన్నారులు, ఆడపడుచులతోపాటు వృద్ద మహిళలు కూడా క్యూలో ఎంతో ఓపిగ్గా నిలబడి నాగదేవతను దర్శించుకున్నారు. తోపులాటలు జరగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రస్తుతం శ్రావణ మాస ఉపవాస రోజుల్లో నాగపంచమి పర్వదినం కలిసిరావడంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా కనిపించాయి. శిరాలలో నాగదేవతకు పూజలు.. సాంగ్లీ జిల్లా బత్తిస్(32) శిరాల గ్రామంలో నాగ పంచమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాంగ్లీ నుంచి సుమారు 60 కిలోమీటర్లు, కొల్హాపూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిరాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. 2002 అనంతరం ఇక్కడ సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ జీవం ఉన్న సర్పాలతో నాగుల పంచమి ఉత్సవాలు నిర్వహించారు. శిరాలలో సర్పాన్ని గ్రామదేవతగా కొలుస్తారు. ముఖ్యంగా నాగులపంచమికి ప్రతి ఇంట్లో నాగదేవతలకు పూజిస్తారు. ఉత్సవాలలో భాగంగా సర్పాలతో అనేక పోటీలు నిర్వహిస్తారు. తర్వాత ఊరేగిస్తారు. అయితే వన్యప్రాణి ప్రేమికుల నిరసనల నేపథ్యంలో దశాబ్దం కిందట సర్పాల పోటీలు, ఊరేగింపులపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని కోర్టు తాత్కాలికంగా ఎత్తివేయడంతో ఇక్కడ ఆదివారం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, ఈ ఉత్సవాల కోసం పట్టుకున్న పాములను పూజల అనంతరం తిరిగి సురక్షితంగా విడిచిపెట్టేయడం విశేషం -
ప్రాచీన ఆలయాలు కళావిహీనం
వెల్దుర్తి, న్యూస్‌లైన్: మంత్రశాస్త్రం బలహీనం కావడంతో వందల ఏళ్లనాటి ప్రాచీన దేవాలయాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయని హిందూ దేవాలయ ప్రతిష్ఠాపన పీఠాధిపతి పూజ్యశ్రీ కమలానంద భారతి స్వామిజీ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణమాసం, నాగులపంచమిని పురస్కరించుకొని వెల్దుర్తిలోని నాలు గు వందల ఏళ్లనాటి శ్రీరాజరాజేశ్వరీ దేవాలయంలో ఆదివారం నాగ ప్రతిష్ఠ, నందీశ్వరుడు, శివలింగాలను ప్రాణప్రతిష్ఠాపన గావించారు. 1300 ఏళ్లనాడు ప్రాచీన రాజుల కాలంలో నిర్మించిన అనంత పద్మనాభస్వామి దేవాలయం, పలు కళాఖండాలను ఆయన పరిశీలించారు. విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలోని జగన్మోహన-జగన్మోహిని విగ్రహాన్ని పరిశీలించారు. ఇలాంటి విగ్రహం తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలీ లో ఉందన్నారు. ప్రాచీన కాలంలో దైవభక్తితోపాటు ప్రకృతి చింతన సా మాజిక జీవనం కోసం ఈ కళాఖండాలను మంత్రశాస్త్రం ప్రకారం నిర్మిం చారని తెలిపారు. దేశంలో పాశ్చాత్య పోకడలు అధికమై కొన్ని సంపన్న వర్గాల ప్రజలు మత మార్పిడి వ ల్ల హిందూ ధర్మానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలు నిర్మించి దేవ తా మూర్తులను ప్రతిష్ఠించడంతోనే పనైపోయిందని అనుకోకుండా నిత్యం ధూప, దీప నైవేద్యాలు, పూజలు, అన్నదానం, భజనలు చేస్తేనే సార్థకత ఏర్పడుతుందన్నారు. అంతకుముందు ఆలయ నిర్మాణ కుటుంబీకులు స్వామిజీకి పూర్ణకుభంతో స్వాగతం పలికారు. ఆలయం లో ఏడోతరం వారు వేదబ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణాల మధ్య పూర్ణాహుతి, రుద్రహోమం, అభిషేకాలు నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వరీ దేవికి పట్టువస్త్రాలు, ఆభరణా లు, పసుపు, కుంకుమ, గంధంతో దివ్యసుందరిగా అలంకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
నాగుల పంచమి జరుపుకున్న మహిళలు
హైదరాబాద్: నాగుల పంచమిని రాష్ట్ర ప్రజలు ఈ రోజు భక్తిశ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ది చెందిన పండగల్లో నాగుల పంచమి ఒకటి. నాగులపంచమి పండగను మహిళల పండగగా పిలుస్తారు. పంచమికి ఒక రోజు ముందు మహిళలు ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే తలంటూ స్నానం చేసి కొత్త దుస్తువులు ధరించి పాలు, నైవేద్యం, పూజా సామాగ్రి తీసుకొని పుట్టల వద్దకు వెళ్లారు. అనావాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం నాగదేవతకు పూజలు నిర్వహించారు. పండగను పురస్కరించుకొని మహిళలు, పిల్లలు నాగదేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలకు పూజలు చేసి పాలు, నైవేద్య సమర్పించారు. మహిళలు, పిల్లలు కొత్త దుస్తువులు దరించి పండగను ఘనంగా జరుపుకున్నారు. కొన్ని ప్రాంతాలలో ఉదయం నుంచే దేవాలయాలు, పుట్టల వద్ద మహిళల సందడి కనిపించింది. పండగను పురస్కరించుకొని కొందరు ప్రత్యేక పండి వంటలతో నైవేద్యం తయారుచేసి నాగదేవతాలకు సమర్పించారు. -
ఘనంగా నాగులపంచమి వేడుకలు
-
బాసరకు పోటెత్తిన భక్తులు
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం ఆదివారం సెలవు కావడంతో బాసరకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి, అక్షరాభ్యాసానికి ఐదు గంటల సమయం వేచిచూడాల్సి వస్తోంది. మరోవైపు నాగుల పంచమి సందర్భంగా జిల్లాలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుట్టలో పాలు పోసి, పూజలు చేస్తున్నారు. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్‌లోని నాగోబా ఆలయంలో జాతర ప్రారంభయింది. చుట్టుపక్కలవారే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు.