సాక్షి, హైదరాబాద్ : పాములకు పాలు పోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. పాములు పాలు తాగుతాయన్నది మూఢ నమ్మకమని, పాములను పట్టుకుని హింసించవద్దని సూచించింది. ఎవరైనా పాములను పట్టుకుని ఆడిస్తే... వెంటనే అటవీశాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. వన్యప్రాణి చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా దీనిపై ప్రసార మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా నాగుల చవితి, పంచమి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోయడం ఆచారంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే పర్యావరణ సమతుల్యతలో పాములు కూడా భాగమే అని, పాములను పట్టి ఆడించడం కూడా వన్యప్రాణి చట్టప్రకారం నేరం అని అటవీశాఖ స్పష్టం చేసింది. వచ్చే నెల 5వ తేదీన పంచమి సందర్భంగా పాములకు పాలు పోయడంపై... సోమవారం అరణ్య భవనంలో జరిగిన అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో ఓ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాములకు పాలు పోయడం, పాములను ఆడించడం, బలవంతంగా పాములను హింసించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మరోవైపు ప్రజల మనోభావాలను దెబ్బతీయరాని, వారిపై బలవంతపు నిర్ణయాలు రుద్దడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment