పాలు పోయొద్దు .. ప్రాణాలు తీయొద్దు | Awareness on Nagulachavithi Festival Milk Feed to Snake | Sakshi
Sakshi News home page

పాలే విషం

Published Mon, Aug 5 2019 9:24 AM | Last Updated on Sat, Aug 10 2019 9:43 AM

Awareness on Nagulachavithi Festival Milk Feed to Snake - Sakshi

నాగుల చవితి పండుగ రోజు పాముకు పాలు పోయాలని అందరూ అనుకుంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కానీ ఆ పాలే పాములకు విషమవుతోంది. సర్పాల చావుకు కారణమవుతోంది. కారణం.. పాములు సరీస్పపాలు. అవి పాలు తాగవు.. గుడ్లు తినవు. ఇవేమీతెలియక ప్రజలు భక్తి భావంతో పాములకు పాలు, గుడ్లు ఆహారంగా ఇస్తుండడంతో... అవి సర్పాల జీర్ణవ్యవస్థకు భిన్నమైనవి కావడంతో మృత్యువాతపడుతున్నాయి. పండుగ నేపథ్యంలో స్నేక్‌ లవర్స్‌ ‘పాలు పోయొద్దు.. ప్రాణాలు తీయొద్దు’ నినాదంతో అవగాహన కల్పిస్తున్నారు.

సాక్షి సిటీబ్యూరో: ఇంటిల్లిపాదికి సంపూర్ణ ఆరోగ్యం, నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రసాదించాలని మహిళలు నాగదేవతకు పూజలు చేస్తారు. అందరూ  సుఖశాంతులతో  ఉండాలని అత్యంత భక్తి ప్రపత్తులతో వేడుకుంటారు. శుభప్రదమైన జీవితం కోసం పాములకు పాలు పోస్తారు. కానీ  ఆ పాలే  వాటి పాలిట విషంగా మారుతున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడే నాగచవితి  పాముల పాలిట శాపంగా పరిణమిస్తోందని, పాములకు పాలు పోస్తే  మంచి  జరుగుతుందనే  అపోహ కారణంగా నగరంలో ఏటా వందలాది పామలు మృత్యువాత పడుతున్నాయని  స్నేక్‌లవర్స్‌  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములు, పక్షులు, తదితర వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం కోసం కృషి చేస్తోన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ సొసైటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాలిటీ టూ ఎనిమిల్స్‌ (జీహెచ్‌ఎస్‌పీఎస్‌ఏ), పీపుల్స్‌ ఫర్‌ ఎనిమల్స్‌ (పీఎఫ్‌ఏ) తదితర సంస్థలు ‘ పాలు పోయొద్దు పాముల  ప్రాణాలు  తీయొద్దు’ అనే లక్ష్యంతో  ప్రజల్లో అవగాహన  కల్పిస్తున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నాయి.  

బుట్టతో ఉపాధి బాట...
ప్రకృతి పట్ల ఆరాధన, చుట్టూ ఉన్న జీవజాలం పట్ల  దయ కలిగి ఉండడాన్ని మించిన మానవత్వం మరోటి ఉండదు. అందుకే  ప్రకృతితో  పాట అనేక రకాల జంతువులు, పక్షులు  కూడా మనుషులకు పూజ్యనీయమయ్యాయి. ఇది నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు, కొన్ని రకాల పూజలు, ఇతర కార్యక్రమాలతో శుభం జరుగుతుందనే ప్రజల నమ్మకం  కొందరు వ్యక్తులకు ఉపాధిగా మారుతోంది. నాగచవితి రోజు పాముకు పాలు పోస్తే  ఇంట్లో అంతా మంచే జరుగుతుందనే ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకొనేందుకు పాములను పట్టేవారు రంగంలోకి దిగుతున్నారు. నాగచవితికి రెండు నెలల ముందు నుంచే  నగరం శివారు ప్రాంతాల నుంచి వివిధ రకాల పాములను సేకరిస్తున్నారు. వాటి సహజమైన జీవనవిధానానికి భిన్నంగా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. తాళ్లతో  పాముల తలను గట్టిగా బంధించి  కోరలు  కత్తిరిస్తారు. అనంతరం విషపు గ్రంధులను తొలగిస్తున్నారు. ఇలా ఏటా  200 నుంచి 300 లకు పైగా పాములను  హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు  స్వచ్చంద సంస్థల అంచనా.

అనంతరం వాటిని బుట్టల్లో బంధించి చీకటి గదిలో ఉంచుతారు. వీటికి నీళ్లు, ఆహారం లేకుండా రోజుల తరబడి  బుట్ట్టల్లో బంధిస్తున్నారని జీహెచ్‌ఎస్‌పీఎస్‌ఏ కో–ఆర్డినేటర్‌ సౌధర్మ భండారీ  ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా  బంధించిన పాములు నాగపంచమి నాటికి పూర్తిగా జీవచ్ఛవాలుగా మారిపోతాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూంటాయి. అలాంటి పాములను బుట్టల్లో వేసుకొని ఇల్లిల్లూ తిరుగుతారు. ఇంటికి వచ్చిన పాములకు మహిళలు పాలు ఇస్తారు. ఇందుకుగాను వారు రూ. 1000 నుంచి రూ.2500 వరకు  డిమాండ్‌ చేస్తున్నట్లు  అంచనా. కొందరు భక్తులు తమ శక్తి మేరకు రూ.500 సమర్పించినా తీసుకుంటారు. అయితే అప్పటి వరకు ఎలాంటి ఆహారం లేకుండా ఆకలితో  ఉన్న పాములు  ఈ పాలను తాగేందుకు ప్రయత్నిస్తాయి. కానీ పాలు వాటికి ఆహారం కాకపోవడంతో ఒకటి రెండు రోజుల్లోనే  అది మృత్యువాత పడుతున్నాయి. ‘‘ పాములకు పాలు పోస్తే శుభం కలుగుతుందనే ప్రజల నమ్మకం, పాములు పట్టేవాళ్లకు ఉపాధి మార్గంగా మారింది. ఈ క్రమంలో ఏటా కొన్ని వందల పాములు మృత్యువాత పడుతున్నాయి. ఇది జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తోంది.’’ అని సౌధర్మ ఆవేదన వ్యక్తం చేశారు.  

అపోహలు వద్దు...
పాములు సరీసృపాలు. అవి పాలు తాగవు.  గుడ్లు ఆరగించవు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు  భక్తులు  ఈ ఆహారాన్ని ఇస్తున్నారు. అయితే ఇవి  వాటి జీర్ణవ్యవస్థకు భిన్నమైనవి.
పాముల ప్రధానమైన ఆహారం ఎలకలు. పొలాల్లో. చేలల్లో, అడవుల్లో లభించే ఎలకలు, కప్పలు, ఇతర  ప్రాణులను ఆహారంగా తీసుకుంటాయి.  
పక్షులు  గూళ్లు పెట్టుకున్నట్లుగా  పాములు ప్రత్యేకంగా పుట్టల్లో ఉంటాయనేది కూడా అపోహేనంటున్నారు నిపుణులు.  
పాముల పడగలో మణి ఉంటుంది. దానిని ధరిస్తే సంపద, అదృష్టం కలిసి వస్తాయనేది పూర్తిగా అపోహ. పాములు పాట్టేవాళ్లే వాటికి జెమ్స్‌ను అతికించి విక్రయిస్తూ   రూ.వేలల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కానీ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇది నేరం.

సమాచారం ఇవ్వండి...
పాములు ఎలాంటి స్థితిలో కనిపించినా వాటికి ప్రాణహాని తలపెట్టవద్దు. పాములను  బయటికి తరలించేందుకు అటవీశాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004255364 నెంబర్‌కు సంప్రదించవచ్చు. అలాగే జీహెచ్‌ఎస్‌పీఎస్‌ఏ కో ఆర్డినేటర్‌ సౌధర్మకు ఫోన్‌ : 8886743881 నెంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement