నవీముంబై: ప్రతినిత్యం పెరుగుతున్న కబ్జాలను నియంత్రించేందుకు నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) ప్రత్యేకంగా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటిని సివిక్ పోలీసు స్టేషన్లుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు కార్పొరేషన్ చాలా ఏళ్ల క్రితమే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినా, ఇప్పటికీ దానిపై తుది నిర్ణయం వెలువడలేదు. ఠాణే, కల్యాణ్ కార్పొరేషన్లు కూడా సివిక్ పోలీసు స్టేషన్ల ఏర్పాటు కోరుతూ ప్రతిపాదనలు పంపించాయి. త్వరగా అనుమతులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఎన్‌ఎంఎంసీ అధికారులు చెబుతున్నారు.
కబ్జాలు, అనధికార నిర్మాణాలను అడ్డుకోవడానికి ప్రత్యేక స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ ఎన్‌ఎంఎంసీ సాధారణ సభ 2009, జూన్ 30న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వ ఆమోదం కోసం అదే ఏడాది జూలై తొమ్మిదిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించారు. సివిక్ పోలీసు స్టేషన్ల వ్యవస్థను సక్రమంగా నడిపేందుకు 78 ప్రత్యేక పోస్టులనూ మంజూరు చేయాలని ఎన్‌ఎంఎంసీ అభ్యర్థించింది.
ప్రభుత్వం మాత్రం ఈ విజ్ఞప్తిని పక్కన పడేసింది. అయినా పట్టువీడని ఎన్‌ఎంఎంసీ, 28 సివిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్ల పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ గత మార్చి 19న మరో ప్రతిపాదన పంపించింది. దీనికి కూడా హోంశాఖ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ‘రెండు ప్రతిపాదనలూ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవడానికే ఈ కొత్త పద్ధతిని ప్రతిపాదించాం’ అని నవీముంబై కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్ల నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదనలు వస్తే, అన్నింటికీ ఒకేసారి అనుమతి మంజూరు చేయాలని ప్రభుత్వం అనుకొని ఉండవచ్చని చెప్పారు. దీనివల్ల పనిభారం తగ్గుతుందని తెలిపారు.
సివిక్ పోలీసు స్టేషన్ల ఏర్పాటుపై చాలా కార్పొరేషన్లు ఇంత వరకు స్పందించలేదు. ఈ తరహా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ 2009లో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని (పిల్) బాంబే హైకోర్టు సమర్థించింది. దీంతో ఈ ప్రతిపాదన అమలుకు నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు మొదలుపెట్టిందని సంబంధిత అధికారి ఒకరు అన్నారు. నవీముంబై వ్యాప్తంగా అక్రమంగా వెలుస్తున్న కట్టడాలను తొలగించే అధికారం ఎన్‌ఎంఎంసీతోపాటు పరిశ్రమల అభివృద్ధి సంస్థకూ ఉంటుంది. ఈ రెండు విభాగాలు ఇది వరకే పనిభారంతో సతమతమవుతున్నాయి. అందుకే సివిక్ స్టేషన్ల ఏర్పాటును కోరుతూ తీర్మానం చేశాయి.
కబ్జాల నిరోధానికి ప్రత్యేక స్టేషన్లు
Published Fri, May 30 2014 11:20 PM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement