కేఆర్ ప్యానల్ విజయకేతనం
Published Sun, Sep 8 2013 3:56 AM | Last Updated on Tue, Oct 2 2018 3:00 PM
తమిళ సినిమా, న్యూస్‌లైన్: తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ముక్కోణపు పోరులో కేఆర్ ప్యానల్ విజయకేతనం ఎగురవేసింది. ఈ ప్యానల్ కొంతకాలంగా గతంలో బాధ్యతలు చేపట్టిన వర్గంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ విషయమై న్యాయం కోరుతూ పోలీసులు, న్యాయస్థానం వరకు వెళ్లింది. ఇప్పుడు గెలుపొందడంతో న్యాయం గెలిచిందనే సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమిళ నిర్మాతల మండలి ఎన్నికలు శనివారం ఉత్కంఠభరిత వాతావరణంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగాయి. మూడు ప్యానళ్లు పోటీపడిన ఈ ఎన్నికలను విశ్రాంతి న్యాయమూర్తులు ఎస్.జగదీశన్, కె.వెంకట్రామన్ సమక్షంలో నిర్వహించారు. గుర్తింపు కార్డులు ఉన్న సభ్యులనే ఓటింగ్‌కు అనుమతించారు.
ఈ ఎన్నికల్లో కేఆర్, కలైపులి ఎస్.థాను, శివశక్తి పాండియన్ ప్యానళ్లు పోటీ పడ్డాయి. స్థానిక నందనంలోని వైఎంసీఈ గ్రౌండ్‌లో జరిగిన ఎన్నికల కేంద్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉదయం 10.30 గంటలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కమలహాసన్, నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, రాధారవి, మన్సూర్ అలీఖా న్, శశికుమార్, ఎస్‌వీ.శేఖర్, నటి కుష్భు, దేవయాని, నిరోషా తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కేఆర్, కలై పులి ఎస్.థాను, ఉపాధ్యక్ష బరిలో ఉన్న టీజీ.త్యాగరాజన్, సుభాష్ చంద్రబోస్, పవిత్రన్, కదిరేశన్, పట్టియల్ శేఖర్, కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న శివశక్తి పాండియన్, టి.శివ, కేఈ.జ్ఞానవేల్‌రాజా,
సంగిలి మురుగన్, పీఎల్ తేనప్పన్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా ఎస్‌ఏ.చంద్రశేఖరన్, పుష్పా కందస్వామి, ఆర్‌కే.సెల్వమణి, ఏఎల్ అళగప్పన్, తంగర్‌బచ్చన్, మనోజ్‌కుమార్, కోవై తంబి, ఖాజామైద్దీన్, చిత్రా లక్ష్మి, హెచ్.మురళి, జాగువర్ తంగం, ఆర్‌వీ.ఉదయ్‌కుమార్, నాజర్, పీసీ అన్భళగన్, ఎ.శేఖర్, కరుణాస్, ఎడిటర్ మోహన్, జీఆర్ కరుణాకరరాజన్, అగస్థ్యన్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు ప్రచార దుస్తులు ధరించి రావడం సభ్యుల మధ్య గొడవకు దారి తీసింది. ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు) మొరాయించడంతో ఓటింగ్ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. చెదురుమొదురు ఘర్షణలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.
Advertisement
Advertisement