► తాగునీటి పథకాల నిలిపివేత
► ఇబ్బందులు పడుతున్న ప్రజలు
► మున్సిపాలిటీ తీరుపై మండిపాటు
బద్వేలు అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాల గొంతెండుతోంది. పన్నులు చెల్లించడం లేదనే కారణంతో 26 వార్డుల్లోని 19 గ్రామాల్లో సుమారు 11 తాగునీటి పథకాలను నిలిపివేశారు. దీంతో మూడు రోజులుగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడాల్సి న పరిస్థితి నెలకొంది. కొందరు పన్నులు చెల్లించని కారణంగా అందరినీ ఇబ్బందులకు గురిచేస్తూ మున్సిపల్ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు.
తాగునీటి పథకాల నిలిపివేత: మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల్లో గూడెం, వల్లెలవారిపల్లె, రామాపురం, లక్ష్మీపాళెం , బుచ్చిరెడ్డిపాళెం, చెన్నంపల్లె, బోవిళ్లవారిపల్లె, భాకరాపేట గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయనే కారణంతో తాగునీటి పథకాలను నిలిపేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24వ వార్డు పరిధిలోని గూడెం గ్రామంలో సుమారు 600 జనాభా నివసిస్తుండగా ఒక్క తాగునీటి పథకమే ఉంది. పన్నులు చెల్లించలేదని దీనికి సంబంధించిన గదికి మున్సిపల్ సిబ్బంది తాళం వేశారని ప్రజలు చెబుతున్నారు. సమీప పొలాల్లోని మోటార్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని అంటున్నారు. అధికారులు స్పందించి తాగునీటి పథకాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నీరు సరఫరా చేయాలి: గూడెం గ్రామంలో ఉన్న తాగునీటి పథకాన్ని నిలిపేశారు. దీంతో మూడు రోజులుగా నీరు రావడంలేదు. కూలి పనిచేసుకుని జీవించే మాలాంటోళ్లను ఇబ్బందులకు గురిచేయడం తగదు. పన్ను వసూళ్లకు మరేదైనా మార్గం ఆలోచించాలి. నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. –కొండమ్మ, గూడెం గ్రామం
కష్టాలు పడుతున్నాం: పన్నులు చెల్లించని కొందరి కోసం అందరినీ ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. గ్రామంలో చాలామంది పన్నులు చెల్లించిన వారు కూడా ఉన్నారు. ఉన్నట్లుండి తాగునీటి పథకం నిలిపివేయడంతో కష్టాలు పడుతున్నాం. పండుగ సమయంలో ఇలా చేయడం సరికాదు. – శాంతమ్మ
కమిషనర్ ఏమన్నారంటే: తాగునీటి పథకాల నిలిపివేతపై మున్సిపల్ కమిషనర్ శివరామిరెడ్డిని వివరణకోరగా విలీన గ్రామాల్లో అక్రమకుళాయి కనెక్షన్లు ఉన్నాయని, ఏళ్ల తరబడి పన్నులు కూడా చెల్లించడం లేదు. నోటీసులు ఇచ్చినా ఫలితం లేదు. స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగానే ఇలా చేయాల్సి వచ్చింది. శివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తున్నాం.