నీటితీరువా కోసం వీఆర్‌ఓలతో సమావేశమైన ఆర్డీవో రఘుబాబు (ఫైల్)
సాక్షి, పాలకొండ (శ్రీకాకుళం): కూలీల కొరత, పెరగిన పెట్టుబడులు, ప్రకృతి సహకరించక పోవడం, దిగుబడులు లేకపోవడం..అరకొరగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక లభించకపోవడం తదితర కారణాలతో రైతులు వ్యవసాయం చేయడం అంటేనే భయపడున్నారు. ఈ ఏడాది రైతులకు కష్టాలు మరింత రెంటిపు స్థాయిలో వెంటాడాయి. దీంతో పెట్టుబడులు కూడా తిరిగి రాక వలసలు పోతున్నారు. కాస్త పండిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సేకరించకపోవడంతో రైతులు దీన స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి నీటి తీరువా వసూలు కోసం రైతులపై వత్తిని నెలకొంది.
ఎన్నికల్లో లబ్ధి కోసం గత ఐదేళ్లుగా నీటితీరువాపై నామమాత్రంగా స్పందించిన ప్రభుత్వం ఎన్నికల అనంతరం నీటితీరువా వసూలుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రైతుల నుంచి పాత బకాయిలతో పాటు నీటితీరు వసూలుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకూ ఈ ఏడాది నీటితీరువా 447.12కోట్లు వరకూ ఉంది. ఈ మొత్తం రైతుల నుంచి వసూళ్లు చేసేందుకు అధికారులు తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. నీటి తీరువా బకాయిలు ఉన్న రైతులకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ నిలిపివేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎటువంటి పని ఉన్నా ముందుగా నీటితీరువా కట్టాలని నిబంధనలు పెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీరు అందించకుండా నీటితీరువా?
నిబంధనల ప్రకారం సంవత్సరంలో కాలువల ద్వారా 150 రోజులు రైతులకు నీరు అందిస్తేనే నీటి తీరువా వసూలు చేయాలి. 150 రోజుల నీరు అందిస్తే కేటగిరీ ఏ కింద ఎకరానికి రూ.200 చొప్పున చెల్లించాల్సి ఉంది. 100 రోజులు పైబడి నీరు అందిస్తే కేటగిరి 2 కింద ఎకరానికి రూ.100 చొప్పున చెల్లించాలి. కాని పాలకొండ డివిజన్‌లో ఇంతవరకూ మేజర్, మైనర్ ఇరిగేషన్‌ల ద్వారా 90 రోజుల కూడా నీరు అందించలేదని రైతులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం నీరు అందించకుండా నీటితీరువా మాత్రం బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
జీవో ఏం చెబుతుంది?
రైతుల నుంచి భూమి శిస్తు వసూలు విధానంపై 1996లో జీవో విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి భూమి శిస్తును రద్దు చేసి 11/88 జీవోను తీసుకువచ్చారు. ఈ జీవో ప్రకారం రైతులు వాడుకున్న నీటిని ఆధారంగా తీరువా వసూలు చేయాలని నిబంధన తీసుకువచ్చారు. దీని ప్రకారం 150 రోజులు నీరు అందించకపోతే తీరువా వసూలు చేయడానికి అవకాశం లేదు. ఈ నిబంధన ప్రకారం అయితే నీటితీరువా చెల్లించాల్సిన అవసరం లేదని రైతు సంఘాలు వాధిస్తున్నాయి.
నియోజకవర్గంలో మండలాల వారిగా నీటి తీరువా బకాయిలు
మండలం | బకాయిలు |
పాలకొండ | 148.86 కోట్లు |
వీరఘట్టం | 289.06 కోట్లు |
సీతంపేట | 001.16 లక్షలు |
భామిని | 008.04 లక్షలు |
మొత్తం | 447.12 కోట్లు |
రైతులపై వత్తిడి తగదు
నీటి తీరువా కోసం రైతులపై వత్తిడి తగదు. నీరు అందించక పోయినా తీరువా చెల్లిస్తున్నాం. అయినా అధికారులు పాత బకాయిలు కూడా చెల్లిం చాలని వత్తిడి తెస్తున్నారు. రైతులకు అçప్పులే మిగిలాయి. అధికారులు ఆచోలించాలి.
– లోలుగు విశ్వేశ్వరరావు, రైతు సంఘం నాయకుడు, అంపిలి
90 రోజులు కూడ నీరు అందించడంలేదు
అధికారులు తోటపల్లి కాలువల ద్వారా ప్రతి ఏటా కనీసం 90 రోజులు కూడా నీరు అందించడంలేదు. జనవరి నుంచి నవంబర్ నెల ఆఖరకు నీరు అందించిన రోజులు లెక్కించాల్సి ఉంది. అధికారులు మాత్రం రెండు సంవత్సరాలు అందించిన రోజులను లెక్కిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం.
– కండాపు ప్రసాదరావు, రైతు, రుద్రిపేట
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే
నీటి తీరువా వసూలు చేయడం వాస్తవం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీఆర్‌ఓలకు ఆదేశాలు జారి చేశాం. పాత బకాయిలతో పాటు నీటితీరు వసూలు చేయడంపై లక్ష్యాలు విధించాం. అదేశాల ప్రకారమనే అధికారులు పనిచేస్తున్నారు.
– ఎల్ రఘుబాబు, ఆర్డీవో, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment