ఆయన దారి.. జాతీయ రహదారి | National Highways Authority CGM Muralidhara Rao Success Story | Sakshi
Sakshi News home page

శిఖరం వైపు పయనం

Published Sat, Nov 21 2020 10:54 AM | Last Updated on Sat, Nov 21 2020 11:34 AM

National Highways Authority CGM Muralidhara Rao Success Story - Sakshi

ఎక్కడి అరదలి.. ఎక్కడి ఢిల్లీ. ఎక్కడి కుగ్రామం.. ఎక్కడి రాజధాని నగరం!  కాలినడకకు ఆనాడు మామూలు బాట కూడా లేని వెనుకబడిన వాతావరణం నుంచి.. నిరాశాజనక నేపథ్యం నుంచి ఇంత దూరం ప్రయాణం అంటే.. నేడు అత్యున్నత స్థాయి పదవీ పురస్కారమంటే.. అదో అద్భుతం కాదూ.!  అదో అసాధారణం కాదూ! నీకూ నాకూ అది అసాధ్యమేమో. కానీ తనకు మాత్రం అది సాధ్యమని ఒక్కడు నిరూపించాడు. నడిచే సంకల్పమే ఉంటే ఎంతదూరమైనా.. ఎంత దుర్భరమైనా.. మంచినీళ్ల ప్రాయమని మన హైవే మీద నిలబడి మరీ ప్రపంచానికి చాటి చెప్పాడు. అతి సామాన్య పరిస్థితుల నుంచి వచ్చిన అతడు ఆత్మస్థైర్యంతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. తానే ఓ శిఖరమై నిలిచాడు. అతడే బుగత మురళీధరరావు. కుగ్రామం నుంచి వచ్చి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయిని అందుకున్న ఆ సంకల్ప ధీరుడి విజయాన్ని వర్ణించాలంటే నిజంగా మాటలు రావు.

పేరు బుగత మురళీధరరావు. కొలువు ఎన్‌హెచ్‌ఏఐలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌. స్వస్థలం పాలకొండ మండలం అరదలి గ్రామం... ఈ సాధారణ పరిచయం ఆయనకు సరిపోదు. మట్టి దారుల్లో నడుస్తూ అత్యున్నత శిఖరాలను పాదం కింద ఉంచుకోవచ్చని తెలిపే ఆయన ప్రయాణం అందరికీ తెలియాలి. జీరో నుంచి నడక మొదలుపెట్టి హీరోగా పరుగులు పెడుతున్న ప్రస్థానం అంతా తెలుసుకోవాలి. తండ్రికి ఉద్యోగం పోయి, అన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల నుంచి ఆయన ఎదిగిన వైనం స్ఫూర్తి రగిలించాలి. రోడ్డే లేని ఊరిలో చదివిన రోజుల నుంచి రహదారుల శాఖలో అత్యున్నత పదవి అధిరోహించే వరకు ఆయన సాగించిన విజయ విహారాన్ని ఓ బ్లాక్‌బస్టర్‌ సినిమాను తెరపై చూసినంత ఇష్టంగా ఆస్వాదించాలి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం 

కుగ్రామం నుంచి.. 
పాలకొండ మండలం అరదలి గ్రామం జిల్లా వాసులకే తెలీని ఓ చిన్న పల్లెటూరు. పాలకొండకు దాదాపు 5 కిలోమీటర్లలో ఉంటుంది. బొబ్బిలి ఇనాం గ్రామం. 1987 వరకు ఈ ఊరికి రోడ్డు కూడా లేదు. ఆ ఊరిలో పుట్టి అక్కడే చదువుకున్న మురళీధర్‌ ఇప్పుడు జాతీయ రహదారుల శాఖలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. ఉత్తర భారతీయుల ఆధిపత్యం ఉండే ఈ శాఖలో ఫైనాన్స్‌ విభాగానికి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఢిల్లీలో గురువారం బాధ్యతలు స్వీకరించడం గొప్ప విశేషం. ఈ విజయం వెనుక ఓ కథ దాగి ఉంది. ఆ కథ తెలియాలంటే ముందు మురళీ తండ్రి గురించి తెలియాలి.

మురళీధర్‌ తండ్రి జోగినాయుడు అరదలి గ్రామ కరణంగా పనిచేశారు. 1987లో గ్రామ ఉద్యోగుల వ్యవస్థను ఎన్టీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఉన్న కరణం ఉద్యోగం పోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. పెద్ద కొడుకు కృష్ణారావు విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవారు. కుటుంబమంతా ఆశలన్నీ పెద్ద కొడుకుపైనే పెట్టుకుంది. అప్పటికి మురళీ ఇంకా చిన్న పిల్లాడే. ఇలాంటి సమయంలో కృష్ణారావు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి జోగినాయుడుకు పరీక్ష కాలం మొదలైంది.

కష్టకాలం.. 
ఉద్యోగం పోయింది. పెద్ద కొడుకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మానసికంగా కుంగిపోతారు. కానీ జోగినాయుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగారు. అరదలిలోనే నాగవంశం వీధిలో కిరాణ దుకాణం ప్రారంభించారు. మిగిలిన దుకాణాలతో పోటీపడలేక నష్టపోయారు. చివరికి కన్న ఊరును, ఉన్న ఇంటిని విడిచిపెట్టి పాలకొండ వలసపోయారు. మంచి కరణంగా పేరున్న జోగినాయుడు తన కలాన్నే నమ్ముకున్నారు. ఆ కలంతోనే పిల్లలను ప్రభుత్వ బడుల్లోనైనా చదివించారు.  

నాన్న కష్టం గమనించి.. 
సొంత గ్రామంలో ఐదో తరగతి వరకు, పాలకొండలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లు చదివిన మురళీధర్‌ నాన్న కష్టాన్ని కళ్లారా చూశారు. చదువులో ఎప్పుడూ వెనకబడలేదు. బీటెక్‌లో సీటు రావడం ఆయన జీవితం మేలిమలుపు. అదే ఊపులో ఎంఈ కూడా చేశారు. సింగరేణిలో ఇంజినీర్‌ ఉద్యో గం వచ్చింది. దాదాపు 30 ఏళ్లు సింగరేణిలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. అక్కడితో ఆగిపోతే ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం ఎందుకవుతుంది. అన్నేళ్లు పనిచేశాక కూడా మురళీధర్‌ విద్యా దాహం తీరలేదు. మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలనే ధ్యేయం పెట్టుకున్నాడు.

జాతీయ స్థాయి అధికారికి కావాల్సిన అర్హత కోసం ఐసీడబ్ల్యూఏ పరీక్ష రాశారు. దేశంలో 48వ ర్యాంకు వచ్చింది. ఆయనకు గల అర్హతలను, సింగరేణికి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల శాఖకు తీసుకొచ్చింది. లక్షా 30వేల కోట్ల బడ్జెట్‌ గల విభాగం అది. ఫైనాన్స్‌ విభాగానికి జనరల్‌ మేనేజర్‌గా వెళ్లిన మురళీధర్‌ తన నిబద్ధతను, నిజాయితీ సేవలను నిరూపించుకున్నారు. కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ విభాగం ఆయనను చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ప్రమోట్‌ చేసి అదే ఫైనాన్స్‌ విభాగానికి అధిపతిని చేసింది. 

కృషి ఉంటే.. 
కృషి, నిబద్ధత, ధ్యేయం ఉంటే మనిషి ఏ స్థాయికైనా చేరగలడని ‘ఫోన్‌’లో సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ మురళీధర్‌ అన్నారు. డబ్బు కంటే చదువు గొప్పదనే సత్యం అందరికీ తెలియాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు దీన్ని గుర్తించాలన్నారు. ఢిల్లీలో తాను ఉన్నా తన పల్లె అరదలిని మరచిపోలేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు గతం కన్నా మేలు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి తన కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదే సమయంలో మురళీధర్‌ను గుర్తు చేసుకున్న బాల్య మిత్రుల్లో నల్లి ధర్మారావు ఒకరు. మురళీతో బాల్య స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ తనతో వీధుల్లో, పొలాల్లో తిరిగిన మిత్రుడు ఈ స్థాయికి చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర జర్నలిస్టు యూనియన్‌ నాయకుడు నల్లి ధర్మారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మురళీ ఈ స్థాయికి చేరడం చాలా ఆనందంగా ఉందని, ఊరి పేరును ఢిల్లీ స్థాయిలో నిలబెట్టడం గర్వకారణమని ధర్మారావు తండ్రి, గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన 94 ఏళ్ల కృష్ణంనాయుడు చెప్పారు. నాగవంశ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నల్లి శివప్రసాద్‌ మాట్లాడుతూ ఏ స్థాయికి చేరినా అహంలేని మనిషి, మూలాలు మరచిపోలేని నిరాడంబరుడని ఆనందం వ్యక్తం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement