కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నకిలీ కరెన్సీ ముఠాతో డీఎస్పీ రారాజు ప్రసాద్, పోలీసులు
కొత్తూరు: మద్యం షాపులు, రద్దీగా ఉండే చిల్లర దుకాణాలే లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. గత కొద్ది రోజులుగా కొత్తూరు, భామినితోపాటు పలు గిరిజన ప్రాంతాల్లో జోరుగా సాగుతున్న ఈ తంతుపై గత నెల 22న ‘నకిలీ నోట్లు చలామణి’ అనే శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన పోలీసులు కొన్ని రోజుల నుంచి నిఘా పెట్టారు. ఈ క్రమంలో ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1,23,400 నకిలీ నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు కొత్తూరు పోలీసు స్టేషన్లో శుక్రవారం పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం... కేసు దర్యాప్తులో భాగంగా స్థానిక ఇన్‌చార్జి సీఐ రవిప్రసాద్, ఎస్‌ఐ బాలకృష్ణ, కానిస్టేబుల్ బాబూరావు రవికుమార్, ఎస్‌పీవో ప్రసాద్‌పాత్రో మండలంలోని నివగాం బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అయిదుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారిలో కొత్తూరు మండలం ఎన్‌ఎన్ కాలనీకి చెందిన మీసాల ప్రకాష్ అలియాస్ ప్రశాంతకుమార్, ఇదే మండలం మహసింగి గ్రామానికి చెందిన షేక్ నబీ, భామిని మండలానికి చెందిన పొట్నూరు రామారావు, ఒడిశా రాష్ట్రం సార గ్రామానికి చెందిన రామచంద్ర సుందరరరావు పాత్రో, అదే రాష్ట్రం కాశీనగర్‌కు చెందిన సాసుబిల్లి రాజేష్ ఉన్నారు.
వీరి నుంచి రూ. 2 వేలు, రూ.500, రూ. 200, రూ. 100 నకిలీ నోట్లు మొత్తం రూ. 1,23,400 స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో ఏ1 నిందితుడు ప్రకాష్‌పై 2017లో నకిలీ కరెన్సీ కేసు నమోదై ఉండటం గమనార్హం. ఈయన కొంతకాలంగా దీనికి దూరంగా ఉన్నాడు. మరలా నకిలీ కరెన్సీ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ముఠా సభ్యులకు ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ తయారైన నకిలీ నోట్లను తీసుకొచ్చి మన జిల్లాలో వస్తువులు కొనుగోలు చేసి చలామణి చేసేవారు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేస్తేగాని, నకిలీ నోట్ల బాగోతం బయటపడదని డీఎస్పీ తెలిపారు. ఇటువంటి ముఠాల ఊబిలో పడి అమాయక ప్రజలు మోసపోవద్దని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సీఐ రవిప్రసాద్, ఎస్‌ఐ బాల కృష్ణ, పీసీలు బాబూరావు, రవికుమార్, హెచ్‌సీ చంద్రినాయుడు, రాంబాబు పాల్గొన్నారు.
ఇన్నాళ్లు గోప్యంగా ఎందుకు ఉంచినట్టు...!
నకిలీ నోట్ల చలామణి వ్యవహారంపై సాక్షిలో కథనం రాగానే అప్రమత్తమైన పోలీసులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. అయితే నకిలీ నోట్ల ముఠాను మూడు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలు ఇంతవరకు గోప్యంగా ఉంచి, తాజాగా డీఎస్పీ సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠా వెనుక పెద్ద తలకాయల హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారిని తెరముందుకు తెస్తారో.. లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment