శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం ప్రమాదవశాత్తూ మందుగుండు పేలింది. ఈ ఘటనలో ఓ బైక్ దగ్దం కాగా, పీఎస్ గోడలు బీటలు వారాయి. స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిని సరిగా భద్రపరచ పోవటం వల్లే ఈ పేలుడు జరిగినట్లు సమాచారం.
కాగా పేలుడు పదార్థాల అక్రమ నిల్వలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. జి.సిగడాంలో మందుగుండు సామాగ్రి పేలుళ్లు జరిగి ఓ బాలుడు దుర్మరణం చెందిన నేపథ్యంలో పోలీసులు దాడులు చేశారు. ఇందులో భాగంగా పాలకొండ మండలం భానూరుకు చెందిన చెల్లారు దుర్గారావు నుంచి పోలీసులు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
దుర్గారావును అరెస్ట్ చేసి అతని నుంచి పదివేలు విలువైన ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ మందుగుండును పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే వాటిని భద్రపరచటంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.