పాలకొండలో కారు బీభత్సం.. | Car Accident In Palakonda | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి.. జనాలపైకి దూసుకెళ్లి.. 

Dec 21 2019 10:15 AM | Updated on Dec 21 2019 10:15 AM

Car Accident In Palakonda - Sakshi

ప్రతిభ, చిన్నంనాయులను బలంగా ఢీకొంటున్న కారు

సమయం మధ్యాహ్నం ఒంటి గంట... అప్పుడే కళాశాలలు, పాఠశాలలకు భోజన విరామం ఇచ్చారు... ఇంతలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్నట్లుండి హాహాకారాలు... రోడ్డుపై పాదచారులు పరుగులు తీస్తున్నారు. ఈ హఠాత్పారిణామంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం... ఏమైందో తెలుసుకునేలోపే ఓ ఎరుపు రంగు ఇండికా కారు ప్రజలపైకి అమాంతం దూసుకు వచ్చేసింది. నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసింది. ఇద్దరిని గాయాల పాల్జేసింది. ఈ ఘటన శుక్రవారం శ్రీకాకుళం– పాలకొండ ప్రధాన రహదారిపై తీవ్ర కలకలం రేపింది.


 

పాలకొండ రూరల్‌: పట్టణంలోని గారమ్మ కాలనీకి చెందిన ఆర్మీ ఉద్యోగి సంతోష్‌ తన ఇండికా కారులో శ్రీకాకుళం రహదారి నుంచి పట్టణంలోకి వస్తున్నాడు. ఈ సమయంలో స్థానిక వడమ కూడలికి వచ్చేసరికి ఉన్నట్లుండి తన వాహనం అదుపు తప్పి మితిమీరిన వేగంతో జనాలపైకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో సమీప పాఠశాలలో పిల్లలకు భోజనం పెట్టి వస్తున్న వారణాశి ప్రతిభ, బూర్జ మండలం పాలవసకు చెందిన వృద్ధుడు పోమాటి చిన్నంనాయుడును వెనుక నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. వారు ఉన్నపళంగా గాలిలోకి ఎగిరి కారు ముందు భాగంపై పడ్డారు. కొంత దూరం కారుతో సహా ముందుకు వెళ్లి కింద పడ్డారు.

ఈ ఘటనలో రహదారికి ఇరువైపులా పార్కింగ్‌లో ఉన్న మరో నాలుగు ద్విచక్రవాహనాలు నుజ్జు నుజ్జయ్యాయి. ఈ క్రమంలో కారు రహదారి పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లి ఆగటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక పాదచారులు పరుగులు తీశారు. క్షతగాత్రురాలి కాలు, మోకాలికి, తలకు బలమైన గాయాలు కావటంతో స్థానిక వైద్యులు రాజాం కేర్‌కు రిఫర్‌ చేశారు. మరో క్షతగాత్రుడికి వైద్యసేవలు అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఎస్‌ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement