సంఘటనా స్థలంలో చిన్నారికి సపర్యలు చేస్తున్న దృశ్యం
సాక్షి, శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని లంకాం – నందగిరిపేట ప్రాంతాల్లో ఆదివారం ఇన్నోవా కారు, ఐటెన్ కారు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎవ్వరికీ ప్రాణనష్టం లేనప్పటికీ ఏడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరంలో పెళ్లిదుస్తులు, ఇతర సామగ్రి కొనేందుకు ఆమదాలవలస నుంచి ఇన్నోవా కారులో బీ దేవిప్రసాద్ తన కుటుంబ సభ్యులతో వెళ్తున్నాడు. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి సిద్దిపేట మీదుగా పాలకొండలోని కొట్లీ గ్రామానికి మరో ఆరుగురు కుటుంబ సభ్యులు (గ్రేండ్ ఐటెన్) కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఐటెన్ కారు కుడివైపు మళ్లించడంతో ఆమదాలవలస నుంచి వస్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టారు.
ఒక్కసారిగా రెండు వాహనాల్లో ఉన్నవారంతా కలవరం చెంది హాహాకారాలు పెట్టారు. వెంటనే స్థానికులు సహాయక చర్యలు అందించి 108 వాహనంలో స్థానిక జెమ్స్ ఆసుపత్రికి కొందరినీ, రిమ్స్ ఆసుపత్రికి మరికొందరినీ తరలించారు. ఇన్నోవాలో కూర్చున్న బట్టలు వ్యాపారి లక్ష్మణరావు కుడికాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఐటెన్ కారులో ఉన్న ఎంవీ రమణకు పూర్తిగా తొడ ఎముక, కుడిచేయి విరిగింది. రెండు వాహనాల్లో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరూ మృతిచెందనప్పటికీ ఏడేళ్ల చిన్నారి తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయింది. వైద్యులు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కొంతమందిని తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment