రాయదుర్గం: మితిమీరిన వేగంతో కారును నడిపిన బీబీఏ విద్యార్థి అసువులు బాశాడు. కారు వేగం నియంత్రణలోకి రాకపోవడంతో ఎడమవైపు టర్న్ కాకుండా ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌ను ఢీకొని అతడు అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం తెల్లవారుజామున రాయదుర్గం పరిధిలో చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ వెంకన్న చెప్పిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని రహమత్‌నగర్‌కు చెందిన గోవుల చరణ్ (19) తల్లి చనిపోవడంతో తాత, మేనమామతో కలిసి ఉంటున్నాడు. శంకర్‌పల్లిలోని ఐబీఎస్ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇప్పుడే వస్తానంటూ షిఫ్ట్ డిజైర్ కారులో ఇంటి నుంచి బయలుదేరాడు. బీఎన్‌ఆర్ హిల్స్ నుంచి టోలిచౌకీ వైపు వెళుతూ రాయదుర్గం కూడలిలోకి వచ్చాడు. అప్పుడు తెల్లవారుజాము 3.52 గంటలు అవుతోంది.
ఆ సమయంలో కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పింది. ఎడమ వైపు మళ్లకుండా ఎదురుగా ఉన్న రాయదుర్గం ఫ్లైఓవర్‌ను ఢీకొట్టింది. 70 శాతానిపైగా నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న చరణ్ తీవ్ర గాయాలతో కారులోనే మృతి చెందాడు. కారు ముందు భాగం ముద్దగా మారిన పరిస్థితి చూస్తే దాని వేగం ఎంతగా ఉందో అ«ర్థం చేసుకోవచ్చు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులోని చరణ్ మృతదేహన్ని బయటికి తీసి పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment