తల్లిదండ్రులతో స్వర్ణలత (ఫైల్)
సాక్షి, పాలకొండ: ఆ విద్యార్థిని చదువే లోకం అనుకుంది... కష్టజీవులైన తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని తపన పడింది... టెన్త్, ఇంటర్ ఫస్టియర్‌లో మంచి మార్కులు సాధించి, శుక్రవారం వెలువడిన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో పరీక్ష తప్పడంతో మనస్తాపం చెందింది... ఇంతటితో ఏం అయిపోలేదని, పడి లేచిన కెరటంలా విజయ తీరాన్ని చేరవచ్చని తెలుసుకోలేకపోయింది... బలవంతంగా ప్రాణాలు తీసుకుంది... కన్నవారికి కన్నీళ్లు మిగిల్చింది. పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె అయిన స్వర్ణలత (17) శనివారం తెల్లవారేసరికి విగత జీవిగా కనిపించింది.
ఏకైక కుమార్తె కావడంతో...
స్వర్ణలత తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డాక్టర్ కావాలన్న ఆశతో ఆమె ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ తీసుకుంది. తొలి ఏడాది మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. శుక్రవారంనాటి ఫలితాల్లో రెండు పరీక్షలు తప్పడాన్ని తట్టుకోలేకపోయింది. కన్నీరు పెట్టుకుంది. ఇంట్లో ముభావంగా ఉండిపోయింది. తల్లిదండ్రులు నచ్చచెప్పటంతో కొంతమేర ఆ కష్టం నుంచి ఉపశమనం పొందినట్లు కనిపించింది. కానీ రాత్రి అన్నం తిన కుండా పడుకుంది. ఉదయానికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చా లించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఏకైక కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.
చదవండి: వారిపై హింస, అకృత్యాలు భారత్‌లోనే కాదు..
ఇంటర్ ఫెయిల్ కావటంతో ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాలనీలో, కళాశాలలో అందరితో కలివిడిగా ఉండటంతో విషయం తెలుసుకున్న సన్నిహితులు, కాలనీవాసులు మృతురాలి ఇంటి వద్దకు చేరుకుని రోదించా రు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లక్ష్మణరావు ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు, సీపీఎం సభ్యుడు కావటంతో ఆటో డ్రైవర్లు ఆయనను పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకున్నా రు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి దావాల రమణారావు, కాదరాము తదితరులు ఆ కుటుంబాన్ని ఓదార్చారు.
ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
విద్యార్థిని స్వర్ణలత ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ విధంగా అనాలోచిత నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని హితవు పలికారు. మృతురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇంటర్ తప్పిన విద్యార్థి అదృశ్యం
రేగిడి: కొమెర గ్రామానికి చెందిన వావిలపల్లి సత్యనారాయణ (సాయిరాం) అదృశ్యమయ్యాడని ఎస్సై బి.రేవతి శనివా రం విలేకరులకు తెలిపారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం పరీక్ష తప్పడంతో సత్యనారాయణ మనస్థాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడని తండ్రి కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment