సాక్షి, మహబూబాబాద్: పరీక్షల్లో ఫెయిల్ అయి కొందరు విద్యార్థుల.. పరీక్షలు ఫలితాలు వెలువడక ముందే మరొకొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో విద్యార్ధులు తీసుకునే నిర్ణయాలు వారి తల్లిదండ్రులకు తీరాని శోకాన్ని నింపుతున్నాయి. పరీక్ష ఫలితాలే జీవితాలను మార్చలేవని విద్యార్థులు తెలుసుకోవాలని పేరెంట్స్ చెబుతున్నా కొందరు మాత్రం మారడం లేదు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడక ముందే భయంతో ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఇంటర్ చదువుతున్నాడు. కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో తనకు మంచి మార్కులు రావనే ఆలోచనతో ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి .. నాకు ఎంబీబీఎస్‌లో సీటు రాదు. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే, మంగళవారం ఉదయం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కృష్ణ.. బైపీసీలో 892/1000 మార్కులు సాధించాడు. ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక, ఫలితాలు చూసిన అనంతరం.. కృష్ణ పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘కొడుకా.. లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి.. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
ఇదిలా ఉండగా.. కృష్ణ కల్వల ఆదర్శ పాఠశాలలో పదోతరగతి వరకు పూర్తి చేసి ఏటూరు నాగారంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేరాడు. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. కృష్ణ చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చేయాలనే కోరికతో కష్టపడి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నానని అతనిలో నిరాశ మొదలైంది. తనకు ఎంబీబీఎస్‌లో సీటు రాదని ఆవేదన చెందాడు. దీంతో, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: మహిళా ప్రయాణికులకు రూ.80 కే టీ–24 టికెట్
Comments
Please login to add a commentAdd a comment