సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి అంచనా వ్యయం రూ.32,200 కోట్లుగా తేలింది. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఈ మేరకు అంచనా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మొదటి దశ పనుల వ్యయాన్ని రూ.15,950 కోట్లుగా అంచనా వేసిన సర్వే సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి తొలి నివేదించగా తాజాగా రెండు, మూడు దశల అంచనా వ్యయాలను లెక్కగట్టి ప్రభుత్వ పరిశీలనకు పంపింది. ఈ పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లా గండేడు వద్ద 45 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్, దీనికింద డిస్ట్రిబ్యూటరీలు, విద్యుత్ అవసరాలు, భూసేకరణ తదితరాలకు రూ.8,650 కోట్లు అవసరమవుతాయని తేల్చారు.
ఇక లక్ష్మీదేవునిపల్లిలో 10 టీఎంసీల మూడో రిజర్వాయర్, దానికింద నిర్ణీత ఆయకట్టుకు నీరందించే కాలువల తవ్వకానికి మరో రూ.7,600 కోట్లు అవసరం ఉంటుందని లెక్కగట్టారు. కాగా ఏప్రిల్ తొలివారంలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించినా, ఇంకా దీనిపై సందిగ్ధత వీడలేదు. ఏప్రిల్ 5న పథకాన్ని ఆరంభించాలని నిర్ణయించినా, ఇంతవరకు స్పష్టత లేదు. తొలి దశ పనులకు సంబంధించి ఇంకా పరిపాలనా అనుమతులు సైతం జారీ కాలేదు.