ఐఐసీటీ శాస్త్రవేత్తకు భట్నాగర్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తార్నాకలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్)- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సైంటిస్టు డాక్టర్ ఎస్.వెంకటమోహన్ 2014 సంవత్సరానికిగాను శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డుకు ఎంపికైనట్లు ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బయో ఇంజనీరింగ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగంలో వెంకటమోహన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్. భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
20 సంవత్సరాలుగా బయో ఇంజనీరింగ్ ఎన్విరాన్‌మెంటల్ విభాగంలో ఆయన చేస్తున్న పరిశోధనలకు సీఎస్‌ఐఆర్ 2014 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రకటించింది. ప్రధానంగా వ్యర్థాలు, మొక్కల నుంచి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను కనుగొనడంపై విశేషమైన పరిశోధన కొనసాగిస్తున్నారు. వెంకటమోహన్‌ను ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతం, సహచర సైంటిస్టులు అభినందించారు.