..అయినా అద్వితీయం | district last place in Intermediate second year exam results | Sakshi
Sakshi News home page

..అయినా అద్వితీయం

Published Sun, May 4 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

district last place in Intermediate second year exam results

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు శనిరవారం వెలువడ్డాయి. ఫస్టియర్ లానే సెకండియర్‌లోనూ జిల్లా రాష్ర్టంలోనే చివరి స్థానంలో నిలిచింది. అయినా.. పలు ప్రభుత్వ కళాశాలలు, వివిధ ప్రైవేటు కళాశాలల్లో అ‘ద్వితీయ’ ఫలితాలు వచ్చాయి.
 
 దిలావర్‌పూర్,న్యూస్‌లైన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల్లో జిల్లాలోనే దిలావర్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉత్తీర్ణత శాతంలో టాప్‌గా నిలిచింది. మండల కేంద్రమైన దిలావర్‌పూర్‌లోని ప్రభుత్వ కళాశాలలో వొకేషనల్ కోర్సు విద్యార్థులు పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబర్చి మండలంలో టాప్ మార్కులను సాధించి ప్రభుత్వ కళాశాలల్లో సైతం మొరుగైన విద్యనందిస్తున్నారని రుజువు చేశారు.

1000 మార్కులకు గాను దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన కాలేవార్ రాజశేఖర్ 955, సిర్గాపూర్ విద్యార్థి షారూఖ్ హైమద్ 954, దిలావర్‌ఫూర్‌కు చెందిన చింతకింది ప్రవీణ్ 928, నంద సందీప్ 919, గోపు రాకే శ్ 913 మార్కులను సాధించి వొకేషనల్ కోర్సులో టాప్‌గా నిలిచారు. దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన ఎంపీసీ విద్యార్థిని ఎన్.సుకన్య 1000 మార్కులకు గాను 847, బైపీసీలో కె.పద్మ 885 మార్కులు, సీఈసీలో నర్సాపూర్ (జి) గ్రామానికి చెందిన పి.లలిత 831 మార్కులు సాధించి దిలావర్‌పూర్ ప్రభుత్వ కళాశాల టాప్‌గా నిలిచారు. విద్యార్థులు అత్యధిక మార్కులు, అత్యధిక ఉత్తీర్ణతశాతం సాధించి కళాశాలను జిల్లాలోనే టాప్‌గా నిలపడంపై కళాశాల ప్రిన్సిపాల్ క్రిస్టోఫర్ అలెగ్జాండర్, వొకేషనల్ అధ్యాపకులు శ్రీనివాసరావు, శోభన్‌బాబు, అధ్యాపక బృందం జైపాల్, సత్యపాల్‌రెడ్డి, సత్యనారాయణ,బాబురావు, క్రిష్ణ, నర్సయ్య,గణేశ్, ఆనందం, శ్రీవిద్య, అనసూయ, శ్రీలత హర్షం వ్యక్తం చేశారు.

 
 మిల్లు కార్మికుడి కుమార్తె బైపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్
 కరీంనగర్, న్యూస్‌లైన్ : కరీంనగర్‌లోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన నాగూరు దివ్య బైపీసీ విభాగంలో 989 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండల కేంద్రానికి చెందిన  సత్తయ్య-లక్ష్మి దంపతులది నిరుపేద కుటుంబం. సత్తయ్య మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో బ ట్టల మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లక్ష్మి తడకలు అల్లుతుంది. వీరికి రమాదేవి, దీపిక, దివ్య, రిథిత నలుగురు కుమార్తెలు, కుమారుడున్నారు.

ఆర్థిక ఇబ్బందులకు ఎదురీదుతూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. 8వరకు జన్నారంలో చదివిన దివ్య, 9,10 తరగతులు జగిత్యాలలోని ప్రైవేట్ స్కూల్లో చదువుకుంది. ఇంటర్ అల్ఫోర్స్‌లో చేరింది. ఫస్టియర్‌లో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు సాధించిన దివ్య, సెండియర్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ రావడం విశేషం. స్టేట్ ఫస్ట్ రావడం సంతోషంగా ఉందని, బాగా చదువుకుని డాక్టర్ అయి పేదలకు సేవలందించాలన్నది తన లక్ష్యమని దివ్య తెలిపింది. తల్లిదండ్రులు, లెక్చరర్ల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించానని పేర్కొంది. దివ్య పెద్దక్క రమాదేవి ఇంజినీరింగ్, రెండో అక్క దీపిక డిగ్రీ, చెల్లెలు రిథిత ఇంటర్ ఫస్టియర్, తమ్ముడు జన్నారంలో సెవెన్త్‌క్లాస్ చదువుతున్నారు.

Advertisement
Advertisement