
నాగల్‌గిద్ద మండలంలో గాడిదల పెంపకం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఆధునిక కాలంలోనూ గాడిదల పెంపకంతో ఉపాధి పొందుతున్న కుటుం బాలు నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నేటికీ కనిపిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న వీటిని మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాహనాలు వెళ్లలేని వ్యవసాయ క్షేత్రాల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. అయితే సీజన్‌లో మాత్రమే వీటి ద్వారా ఉపాధి లభిస్తుండగా, పోషణ భారంగా మారిందని పెంపకందారులు ఆవేదన చెందుతున్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో గాడిదల పెంపకంతో ఉపాధి పొందుతున్న తీరుపై ‘సాక్షి’ కథనం.
నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మనూరు, నాగల్‌గిద్ద, కంగ్టి తదితర మండలాల్లో గాడిదల పెంప కం ద్వారా కొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. గతంలో కుండలు చేయడం, బట్టలు ఉతకడం కుల వృత్తిగా ఉన్న వారు..ప్రస్తుతం తమ రూటు మార్చి గాడిదల పెంపకాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. కర్ణాటక సరిహద్దుగా ఉన్న మంజీర నదీ తీర ప్రాంత గ్రామాల్లో వీటి సేవలను వినియోగించుకోవడం ఎక్కువగా కనిపిస్తోంది.
తీర ప్రాంత వ్యవసాయ క్షేత్రాలు నల్లమట్టి నేలలు కావడంతో రైతులు అడుగు తీసి అడుగు వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు వ్యవసాయ క్షేత్రాలకు దారి లేకపోవడం, దారి ఉన్నా రేగడి నేలల మీదుగా విత్తనాలు, ఎరువులు మోసుకెళ్లడం అసాధ్యంగా మారింది. దీంతో ఎరువులు, విత్తనాలను వ్యవసాయ క్షేత్రాలకు చేరవేసేందుకు గాడిదలను వినియోగిస్తున్నారు. దీంతో పెంపకందారులు దూరం, బరువును బట్టి డబ్బులు వసూలు చేస్తారు.
వ్యవసాయ సీజన్‌లో రోజుకు కనీసం రూ.200 నుంచి రూ.500వరకు గిట్టుబాటు అవుతుందని పెంపకందారులు వెల్లడించారు. ధాన్యం దిగుబడి సమయంలోనూ గాడిదలను రవాణాకు ఉపయోగిస్తున్నారు. అయితే ధాన్యం రవాణాలో డబ్బులు కాకుండా, ధాన్యాన్నే అద్దె రూపంలో వసూలు చేస్తారు. ఒక్కో మడికి తవ్వెడు (సుమారు 60కిలోల ధాన్యానికి సుమారు కిలో చొప్పున) వసూలు చేస్తామని పెంపకందారులు తెలిపారు.
పెసలు, కందులు, మినుములు తదితరాల రవాణాతో అద్దె గిట్టుబాటవుతుందని చెప్తున్నారు. అయితే వ్యవసాయ పనులు లేని సందర్భంలో గాడిదల పెంపకం పెద్దగా లాభసాటిగా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మంజీర నుంచి ఇసుక అక్రమ రవాణాకు గాడిదలను ఉపయోగిస్తుండడం, అప్పుడప్పుడూ తమకు సమస్యలు తెచ్చి పెడుతోందని మోర్గి, కరస్‌గుత్తి గ్రామాలకు చెందిన పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కో గాడిద ధర రూ.15వేలు పైనే..
ఒక్కో గాడిద ధర రూ.15వేలకు పైనే పలుకుతుండగా, వీటి కొనుగోలుకు సంబంధించి స్థానికంగా మార్కెట్ లేదు. అయితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఘోడే మాలేగావ్ నుంచి కొనుగోలు చేస్తారు. మాలేగావ్‌లో ప్రతీ ఏటా డిసెంబర్, జనవరి మాసాల్లో సుమారు 30 రోజుల పాటు అతిపెద్ద సంత నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి గాడిదలు, గుర్రాలు, ఒంటెల కొనుగోలుకు వ్యాపారులు, పెంపకందారులు వస్తారని స్థానికులు తెలిపారు.
గతంలో మాలేగావ్‌లో కొనుగోలు చేసిన గాడిదలను కాలినడకనే తీసుకొచ్చేవారని, ఇటీవలి కాలంలో డీసీఎంల ద్వారా రవాణా చేస్తున్నట్లు పెంపకందారులు తెలిపారు. మేలు రకం గాడిదల ధర రూ.25వేల వరకు ఉంటుందని సమాచారం. గాడిదల పెంపకం ద్వారా ఉపాధి లభిస్తున్నా, తమ వృత్తిలోనూ పోటీ పెరిగి గిట్టుబాటు కావడం లేదని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు, మేకలు, పాడి పశువుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్న తరహాలో గాడిదల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్న తమకూ లబ్ధి చేకూరేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment