నర్సింహా.. నీ భక్తులకు స్నానాలెలా | Hanuman Jayanti big, | Sakshi
Sakshi News home page

నర్సింహా.. నీ భక్తులకు స్నానాలెలా

Published Tue, May 31 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

నర్సింహా.. నీ భక్తులకు స్నానాలెలా

నర్సింహా.. నీ భక్తులకు స్నానాలెలా

అడుగంటిన గోదావరి  బోసిపోయిన స్నానఘట్టాలు  నేడు పెద్ద హనుమాన్ జయంతి
 
ధర్మపురి
: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ దేవాలయమైన శ్రీప్రసన్నాంజ నేయస్వామి ఆలయంలో మంగళవారం పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే వేలాది మంది భక్తులకు స్నానాలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. స్వామి దర్శనానికి వచ్చిన వారు మొదట గోదావరిలో స్నానాలు చేస్తారు. అయితే గోదావరిలో చుక్కనీరు లేకపోవడంతో స్నానాలు ఎలా చేయాలో అని అయోమయానికి గురవుతన్నారు. నెల రోజుల నుంచి దీక్షలు చేపట్టిన వారు ప్రతిరోజు ధర్మపురి పుణ్యక్షేత్రానికి వస్తూనే ఉన్నారు. వచ్చిన భక్తులకు గోదావరిలో కనీస వసతులు కరువయ్యాయి. గోదావరిలో ఉన్న మడుగుల్లో నీళ్లు నెత్తిన  చల్లుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.


 నీరులేక స్నానఘట్టాలు వెలవెల
పుష్కరాల సందర్భంగా రూ.లక్షలు వెచ్చించి  ఏర్పాటు చేసిన స్నానఘట్టాలు నీరులేక వెలవెలబోతున్నాయి. ఇటీవల బ్రహ్మగుండం, సత్యవతి గుండాల నుండి ప్రత్యేక పైపుల ద్వారా నీరందించడానికి రూ.లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం గోదావరిలో నీరు లేకపోవడంతో వృధాగా మారాయి.  


 సమస్యల పరిష్కారం ఎలా?
గోదావరిలో నీరు లేనందున గోదావరి ఒడ్డున ప్రత్యేక బోరింగులు ఏర్పాటు చేసి అక్కడే ఉన్న షవర్లకు అనుసంధానం చేస్తే స్నానాల సమస్య పరిష్కారం కానుంది. సంతోషిమాత ఆలయం వద్ద, మంగళిగడ్డ, స్మశాన వాటికల వద్ద బోరింగులు ఏర్పాటు చేస్తే ఈసమస్య పరిష్కారం కానుంది. తాత్కాలిక పనుల కోసం వె చ్చించిన డబ్బులు బోరింగులు ఏర్పాటు చేసేందుకు వెచ్చిస్తే ఫలితం ఉండేదని అంటున్నారు.

 వేలాదిగా భక్తుల రాక
 నేడు జరుగనున్న పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా రానున్నారు. ఒక్కరోజు ముందు నుంచే భక్తులంతా కాలినడకన, వాహనాల్లో ధర్మపురికి చేరుకొని జయంతి రోజున మొక్కులు చెల్లించుకుంటారు. పెద్ద జయంతి సందర్భంగా కొండగట్టు వేములవాడ పుణ్యక్షేత్రాల్లో మొక్కులు చెల్లించుకొని మరుసటి రోజు ధర్మపురికి చేరుకొంటారు. మూడు రోజుల పాటు ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోతాయి.


 దేవాలయాల్లో ఏర్పాట్లు పూర్తి
 పెద్ద హ నుమాన్ జయంతి వేడుకల సందర్భంగా దేవాలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేసారు.   దేవాలయం ముందు లోపల చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు, విద్యుత్  ఏర్పాట్లు చేశారు. దేవాలయంలో నీరు లేనందున భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ట్యాంకర్ల ద్వారా తెచ్చిన నీటిని సంపులో నింపి, పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని దేవస్థానం ఈవో సుప్రియ తెలిపారు.

Advertisement

పోల్

Advertisement