
గోదావరి మురికి నీరు
తలాపునే గోదావరి... కానీ పారేది స్వచ్ఛమైన నీరు కాదు.. అచ్చమైన మురుగు నీరు. ఒక్కరోజులో ముగిసే పండుగకు ఏర్పాట్లెందుకులే.. అనుకున్నారో ఏమో? భక్తులు పోటెత్తే శివరాత్రికైనా కనీస సౌకర్యాలు కల్పించి, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాల్సింది పోయి తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. ఇక గోదావరి నదీ స్నానం ముక్కు మూసుకుని చేయాల్సిందే!
సాక్షి,లక్సెట్టిపేట: మండలంలోని భక్తులు శివరాత్రికి పుణ్యస్నానాల కోసం గోదావరి నదికి వస్తుంటారు. కానీ గోదావరి పరిసరాలు చెత్తాచెదారం, ప్లాస్టిక్, మురుగునీటితో దర్శనమిస్తోంది. నీటిలో కనీసం రెండు రోజుల ముందు నుంచి బ్లీచింగ్ పౌడర్ కూడా వేయకుండా అధికారులు, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ అయినప్పటికీ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సుమారు పదివేల మందిపైనే భక్తులు వస్తుంటారని వారికి సౌకర్యాలు లేకపోతే భక్తులు ఇబ్బందులు పడతారని ముందస్తు జాగ్రత్తలు, సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నదిలోని మురికినీటిలో చిన్నపిల్లలు స్నానం చేయడంతో వ్యాధులు ప్రబలుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించి నీటిని శుద్ధి చేసి, బ్లీచింగ్ పౌడర్ వేయాలని కోరుతున్నారు.
కానరాని సౌకర్యాలు..
స్థానిక గోదావరి నది వద్ద చెత్తాచెదారం పేరుకుపోయింది. భక్తుల కోసం పార్కింగ్, బాత్‌రూంల సౌకర్యం లేదు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు లేవు. పుష్కరాల సమయంలో నిర్మించిన రేకుల షెడ్డు చుట్టూ పరదా కట్టి నామమాత్రంగా కాలం వెల్లదీస్తున్నారు. అందులో మహిళలు దుస్తులు మార్చుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రి కావడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఆనవాయితీ. కాబట్టి భక్తుల అధిక సంఖ్యలో గోదావరికి వస్తుంటారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో దుర్గంధం వస్తుందని పలువురు అంటున్నారు. స్నానాల ఘాట్‌ల వద్ద చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయాలని భక్తులు కోరుతున్నారు.
సౌకర్యాలు కల్పిస్తున్నాం..
స్థానిక గోదావరి నది వద్ద శివరాత్రికి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గోదావరి స్నానానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాం.
– నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ లక్సెట్టిపేట
Comments
Please login to add a commentAdd a comment