Laksettipeta
-
హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన రోజే..
సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): అనారోగ్యంతో బాధపడుతూ లక్సెట్టిపేట ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహంలో ఉంటూ 9వ తరగతి చదువుతున్న పెండ్రెం శివశంకర్(16) మృతిచెందాడు. విద్యార్థి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం కార్సాలగుట్ట గ్రామానికి చెందిన పెండ్రెం చిత్రు– లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు శివశంకర్ లక్సెట్టిపేట ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. జూన్ 13న పాఠశాలకు వచ్చాడు. గత వారం రోజుల నుంచి అనార్యోగానికి గురికావడంతో ఈనెల 19న వసతిగృహ ఏఎన్ఎం మందాకిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మందులు ఇచ్చింది. అయినా తగ్గకపోవడంతో బాలుడి తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో ఈనెల 21న విద్యార్థి తండ్రి చిత్రు వసతిగృహానికి వచ్చి వార్డెన్‌కు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. గురువారం ఆసుపత్రికి తీసుకెళదామని అనుకుంటున్న తరుణంలోనే తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై శివశంకర్ మృతి చెందాడు. ఏకైక కుమారుడు ఇలా మృతిచెందడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటనపై వార్డెన్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా విద్యార్థికి జ్వరం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించామని తెలిపారు. తాను సమావేశానికి వెళ్లిన సమయంలో విద్యార్థి తండ్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడని వెల్లడించారు. విద్యార్థి సంఘాల ఆందోళన.. శివశంకర్ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు ఆందోళన చేపట్టారు. సంఘం జిల్లా ఇన్చార్జి అడె జంగు, అధ్యక్షుడు వెడ్మ కిషన్, మండల అధ్యక్షుడు పెంద్రం హన్మంతు మాట్లాడుతూ మూడు రోజులుగా జ్వరం వస్తున్నా వార్డెన్, హెచ్ఎం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే శివశంకర్ మృతిచెందాడని ఆరోపించారు. శివశంకర్ మృతి విషయంపై ఏటీడీవో, డీటీడీవో, వార్డెన్, హెచ్ఎంకు సమాచారం ఇచ్చినా వారు స్పందించకపోవడం దారుణమన్నారు. విద్యార్థి మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. ఆందోళన చేస్తున్న బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు -
ఆమె చావుకు నువ్వే కారణమంటూ వేధింపులు.. !
సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి మహేష్(25) అనే యువకుడు గ్రామానికి చెందిన పెరుగు తిరుపతి అనే వ్యక్తి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. రెండు నెలల కిందట బలరావుపేట గ్రామానికి చెందిన ఓ యువతి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతితో మహేష్‌కు పరిచయం ఉన్నదనీ, ఆమె ఆత్మహత్యకు నువ్వే కారణమంటూ తిరుపతి మహేష్ ఇంటికి వెళ్లి లక్ష రూపాయలు ఇవ్వాలనీ, లేకుంటే విషయాన్ని పోలీసులకు చెబుతాన ని బెదిరించాడన్నారు. మహేష్ తన వద్ద అంత డబ్బు లేదనీ, ఆటో నడుపుతూ బతుకుతున్నానని ఎంత బతిమిలాడినా వినకుండా.. నేను ఆల్ ఇం డియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శినని, నీపై అట్రాసిటీ కేసు పెడతానని, సదరు యువతి చావుకు నువ్వే కారణమని ధర్నా చేస్తానని తిరుపతి మహేష్‌ను వేధించాడు. దీంతో మృతుని కుటుంబీకులు కూడా డబ్బులు లేవని, తమను తప్పుడు కేసులో ఇరికించొద్దని తిరుపతి కాళ్లు మొక్కినా వినకుండా పోలీసులకు తెలిపాడు. దీం తో పోలీసులు మహేష్‌ను పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఈ క్రమంలోనే శనివారం జన్నారం మండలం గొడిసెరాలలో ఉన్న ఆలయానికి మహేష్ కుటుం బ సభ్యులతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికి మహేష్ భార్య శారద భర్త కనిపించకపోవడంతో ఫోన్ చేయగా, నన్ను పెరుగు తిరుపతి డబ్బుల కోసం వేధిస్తున్నాడనీ, అందుకే భయంతో పురుగుల మందు తాగానని చెప్పాడు. భార్య శారద వెంటనే ఆలయం దగ్గరికి రమ్మనగా అప్పటికే పురుగుల మందు తాగిన మహేష్ ఆలయానికి ఎలాగోలా వచ్చాడు. అతని పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జన్నారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యుల సూచన మేరకు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన కొద్దిసేపటికే మహేష్ ప్రాణాలు వదిలినట్లు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా రజక సంఘం అధ్యక్షుడు కటుకూరి రాజన్న, నాయకులు తిరుపతి, లక్ష్మణ్, శ్రీనివాస్ మృతుడి కుటుం బానికి నష్టపరిహారం చెల్లించి, మృతికి కారణమై న తిరుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సీఐ చట్ట పరమైన చర్యలు తీసుకొని మృతుని కుటుంబాని కి న్యాయం చేస్తామని తెలుపడంతో వారు శాం తించారు. మృతుడి తల్లి రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిసారు. కాగా, మృతుడికి నాలుగు నెలల పాప కూడా ఉంది. -
ముక్కు మూసుకుని మునగాల్సిందే!
తలాపునే గోదావరి... కానీ పారేది స్వచ్ఛమైన నీరు కాదు.. అచ్చమైన మురుగు నీరు. ఒక్కరోజులో ముగిసే పండుగకు ఏర్పాట్లెందుకులే.. అనుకున్నారో ఏమో? భక్తులు పోటెత్తే శివరాత్రికైనా కనీస సౌకర్యాలు కల్పించి, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాల్సింది పోయి తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. ఇక గోదావరి నదీ స్నానం ముక్కు మూసుకుని చేయాల్సిందే! సాక్షి,లక్సెట్టిపేట: మండలంలోని భక్తులు శివరాత్రికి పుణ్యస్నానాల కోసం గోదావరి నదికి వస్తుంటారు. కానీ గోదావరి పరిసరాలు చెత్తాచెదారం, ప్లాస్టిక్, మురుగునీటితో దర్శనమిస్తోంది. నీటిలో కనీసం రెండు రోజుల ముందు నుంచి బ్లీచింగ్ పౌడర్ కూడా వేయకుండా అధికారులు, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ అయినప్పటికీ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సుమారు పదివేల మందిపైనే భక్తులు వస్తుంటారని వారికి సౌకర్యాలు లేకపోతే భక్తులు ఇబ్బందులు పడతారని ముందస్తు జాగ్రత్తలు, సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నదిలోని మురికినీటిలో చిన్నపిల్లలు స్నానం చేయడంతో వ్యాధులు ప్రబలుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించి నీటిని శుద్ధి చేసి, బ్లీచింగ్ పౌడర్ వేయాలని కోరుతున్నారు. కానరాని సౌకర్యాలు.. స్థానిక గోదావరి నది వద్ద చెత్తాచెదారం పేరుకుపోయింది. భక్తుల కోసం పార్కింగ్, బాత్రూంల సౌకర్యం లేదు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు లేవు. పుష్కరాల సమయంలో నిర్మించిన రేకుల షెడ్డు చుట్టూ పరదా కట్టి నామమాత్రంగా కాలం వెల్లదీస్తున్నారు. అందులో మహిళలు దుస్తులు మార్చుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే శివరాత్రి కావడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఆనవాయితీ. కాబట్టి భక్తుల అధిక సంఖ్యలో గోదావరికి వస్తుంటారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో దుర్గంధం వస్తుందని పలువురు అంటున్నారు. స్నానాల ఘాట్ల వద్ద చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయాలని భక్తులు కోరుతున్నారు. సౌకర్యాలు కల్పిస్తున్నాం.. స్థానిక గోదావరి నది వద్ద శివరాత్రికి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గోదావరి స్నానానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాం. – నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ లక్సెట్టిపేట -
చెట్టును ఢీకొన్న కారు: వ్యక్తి మృతి
లక్సెట్టిపేట (ఆదిలాబాద్) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం శాంతాపూర్ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుడిపేట గ్రామానికి చెందిన అశోక్ కుమార్(28) మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.