ఇంత బాధ్యతారాహిత్యమా? | high court serious about central law ministry | Sakshi
Sakshi News home page

ఇంత బాధ్యతారాహిత్యమా?

Published Wed, Apr 8 2015 3:29 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

ఇంత బాధ్యతారాహిత్యమా? - Sakshi

ఇంత బాధ్యతారాహిత్యమా?

  • హైకోర్టు విభజనలో కేంద్రం తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం
  • సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపడింది. హైకోర్టు విభజన విషయంతో తమకేమీ సంబంధం లేదని, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తే నిర్ణ యం తీసుకోవాలన్నట్లున్న కేంద్ర న్యాయశాఖ తీరుపై నిప్పులు చెరిగింది. విభజన విషయంలో కేంద్ర న్యాయశాఖ ఇటీవల దాఖలు చేసిన కౌంటర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. దాన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం అందులోని ఒక్కో పేరాను ప్రస్తావిస్తూ, కౌంటర్ దాఖలులో ఇంత బాధ్యతారాహిత్య మా? అంటూ కేంద్రం తరఫు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) బి.నారాయణరెడ్డిని నిలదీసింది.
     
    ‘హైకోర్టు విభజనతో ముఖ్యమంత్రులకు, హైకోర్టు సీజేకి ఏం సంబంధం ఉం ది? హైకోర్టు విభజనపై ప్రకటన చేయాల్సింది రాష్ట్రపతి కదా..!? రాష్ట్ర విభజన చేసింది మీరు (కేంద్రం). కొత్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకుంటే ఎలా..? కొత్త రాష్ట్రం మీరు సృష్టించిన నవజాత శిశువు. దాని బాధ్యత మీదే. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94 (3) ప్రకారం కొత్త రాష్ట్ర రాజధానిలో రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు తదితరాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని మీరే చెప్పారు. మరి ఏపీలో హైకోర్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు ఎంత మేర నిధులు కేటాయించి, విడుదల చేశారు.? కొత్త హైకోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని విభజనతో ఏ మాత్రం సంబంధం లేదని తెలంగాణ రాష్ట్రం ముందుకొచ్చింది.
     
    అన్ని బాధ్యతలు తీసుకోవాల్సిన మీరు మాత్రం ఏమీ చెప్పరు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం మీరేం చేస్తున్నారో చెప్పి తీరాల్సిందే.’ అని ధర్మాసనం ఘాటుగా తన వైఖరిని తేల్చి చెప్పింది. రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం కేంద్రం రూ.1500 కోట్లు కేటాయించిందని ఏఎస్‌జీ నారాయణరెడ్డి చెప్పారు. అవన్నీ తమకు అవసరం లేదని, హైకోర్టు నిర్మాణానికి ఎంత నిధులు కేటాయించారు..? వాటి విడుదల సంగతి ఏమిటి..? ఈ విషయాలు చెప్పండి అని ఏఎస్‌జీకి ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని విషయాలను కేంద్రంతో చర్చించి చెబుతానని, విచారణను వాయిదా వేయాలని నారాయణరెడ్డి అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఆ మేర ఉత్తర్వులు జారీ చేసింది.
     
    రాష్ట్ర కోటానా అదెక్కడుంది...?
    హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతోపాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో గత వారం పిల్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కేంద్రం తరఫున ఏఎస్‌జీ నారాయణరెడ్డి వాదనలు వినిపిస్తూ విభజన విషయంలో కేంద్రాన్ని పిటిషనర్ ఏమీ కోరకున్నా కోర్టు తమకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలుకు ఆదేశాలిచ్చిందన్నారు. హైకోర్టు విభజన సాధ్యాసాధ్యాలతోపాటు ఇరు రాష్ట్రాలకూ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఖరారు చేయడంపై అభిప్రాయం చెప్పాలంటూ సీజేఐకి లేఖ రాశామన్నారు. దీనికి ధర్మాసనం తీవ్రస్థాయిలో స్పందిస్తూ ‘విభజనతో సుప్రీంకోర్టుకు ఏం సంబంధం? అధికరణ 143 ప్రకారం రాష్ట్రపతి మాత్రమే విభజనపై అభిప్రాయం కోరుతూ సుప్రీంకోర్టును సంప్రదించగలరు. మరి మీరెలా సీజేఐకి లేఖ రాస్తారు? ఆ లేఖ కాపీని కౌంటర్‌కు ఎందుకు జత చేయలేదు? కౌంటర్‌లో రాష్ట్ర కోటా గురించి ప్రస్తావించారు. రాష్ట్ర కోటా అంటే ఏమిటి? రాజ్యాంగంలో న్యాయమూర్తులకు రాష్ట్ర కోటా ఉంటుందని ఎక్కడుందో చూపండి. ఒకవేళ రాష్ట్ర కోటా ఉండి ఉంటే ఏ న్యాయమూర్తి కూడా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ కావాల్సిన అవసరమే లేదు. మీరు ఈ కౌంటర్‌ను బాధ్యతారాహిత్యంతో తయారు చేసినట్లు కనిపిస్తోంది.
     
    ఇంగ్లిష్ తెలిసిన మాత్రాన చట్టం తెలిసినట్లు కాదు. బుర్ర ఉపయోగించి రాయడమే అసలైన చట్టం. రాష్ట్ర కోటా వంటి పదాలు ప్రాంతీయతత్వాన్ని మరింత ప్రోత్సహిస్తాయి. ఇది జాతి సమగ్రతకు విరుద్ధం. పెపైచ్చు హైకోర్టు ఏర్పాటునకు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏం చర్యలు తీసుకోలేదని రాశారు. హైకోర్టు ఏర్పాటునకు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టే తగిన చర్యలు తీసుకోవాలని చట్టంలో ఎక్కడుందో చూపండి. ఈ విషయంలో మీరు (కేంద్రం) వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94 (3) ప్రకారం కొత్త రాష్ట్ర రాజధానిలో రాజ్‌భవన్, సచివాలయం, హైకోర్టు ఏర్పాటునకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రమే నిధులివ్వాలి. మరి వీటికి మీరెన్ని నిధులిచ్చారు. ఒకవేళ సెక్షన్ 94(3)ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేస్తే ఏమవుతుంది.?’ అని ప్రశ్నించింది.
     
    ఏపీ హైకోర్టు హైదరాబాద్‌లో ఉండొచ్చు
    కోర్టుకు తెలిపిన అమికస్ క్యూరీ
    అంతకు ముందు ఈ వ్యవహారంలో కోర్టు నియమించిన అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు) జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటుపై రాజ్యాంగంలో నిషేధం లేదన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 168 ప్రకారం ప్రతి రాష్ట్రంలో శాసన వ్యవస్థ ఉండాలని, పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఏపీ శాసనవ్యవస్థ హైదరాబాద్ నుంచి పని చేయవచ్చన్నారు. అలాగే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా హైకోర్టు కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు కావచ్చునని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement