యువ శాస్త్రవేత్తల సందడి
చౌటుప్పల్ : దేశంలోని వివిధ కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన 22మంది యువ శాస్త్రవేత్తలు శుక్రవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామాన్ని సందర్శించారు. తాళ్లసింగారం జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ(నార్మ్) దత్తత గ్రామం. ఈ సంస్థలో శిక్షణ పొందేందుకు వచ్చిన పశ్చిమబెంగాల్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, కేరళ, జార్ఖండ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని కేవీకేలలో అభ్యసిస్తున్న యువ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఈ గ్రామాన్ని సందర్శించారు.
శాస్త్రవేత్తలు బృందాలుగా విడిపోయి ఇంటింటా తిరిగారు. ఒక్కో కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. ఎంత వరకు చదివారు.. ఏం పని చేస్తున్నారు.. ఎంత భూమి ఉంది.. ఏయే పంటలు పండి స్తున్నారు.. పంటల యాజమాన్య పద్ధతులు అవలంబిస్తున్నారా.. గ్రామ ప్రజల జీవన స్థితిగతులు ఏమిటి.. పండించిన పంటలకు మార్కెటింగ్ వసతులు ఎలా ఉన్నాయి.. మద్దతు ధర గిట్టుబాటు అవుతుందా.. అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కెట్‌యార్డును సందర్శించారు. మార్కెట్‌లో రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.సంధ్యాసెనాయ్, డాక్టర్ వీకేజే.రావు, రవీందర్, సర్పంచ్ సుర్వి నర్సింహ్మగౌడ్ తదితరులున్నారు.