పల్లెలను కాటేస్తున్న సా‘రక్కసి’
యాచారం, న్యూస్‌లైన్ : గ్రామాల్లో బెల్టు దుకాణాలు మూతపడినా నాటుసారా మాత్రం ఏరులై పారుతోంది. సారాకు బానిసలుగా మారుతున్న పేదలు అనారోగ్యాల పాలై మృత్యువును కొనితెచ్చుకుంటున్నారు. కరువు పనులకు వెళ్లి వచ్చిన ఆదాయంలో నిత్యం రూ.30 వరకు సారాకే ఖర్చు చేస్తున్నారు. మండలంలోని 20 గ్రామాల్లో సారా అమ్మకాలు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తోన్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. రెండేళ్ల కాలంలో మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, చింతపట్ల, మాల్, తక్కళ్లపల్లి, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి తదితర గ్రామాల్లో వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు.
మరెంతో మంది అనారోగ్యాల పాలయ్యారు. వీరిపై ఆధారపడి జీవిస్తున్న భార్యాపిల్లలు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో 20 నుంచి 30 మంది వరకు సారాకాటుకు బలికాగా, 25-50 మంది వరకు అనారోగ్యాలకు గురయ్యారు. మంతన్‌గౌరెల్లి గ్రామంలోని ఓ కాలనీలో వంద కుటుంబాల్లో సారా తాగే వారు ఉండడంతో ఆ కాలనీని ధూల్‌పేటగా పిలుస్తున్నారు. ఈ కాలనీలో రెండేళ్ల కాలంలో పది మంది వరకు మృత్యువాత పడ్డారు. ఎక్సైజ్ పోలీసులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వారి అండదండలతోనే నాటుసారా తయారీ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి.
తయారీ జోరు..
రెండు నెలలుగా మండలంలో అన్ని గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం పోలీసులు ఎంతో కృషి చేశారు. దాదాపు వందకు పైగా ఉన్న బెల్టు దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. అయితే, బెల్టు దుకాణాలు మూతపడిన నాటి నుంచి సారా అమ్మకాలు పెరిగాయి. నల్లవెల్లితండా, బానుతండా, మంతన్‌గౌరెల్లి, తక్కళ్లపల్లి తండా, బొల్లిగుట్ట తండా, నీలిపోచమ్మ తండాతో పాటు పలు గ్రామాల్లో సారా తయారీ జోరందుకుంది. తయారు చేసిన సారాను చుట్టు పక్కల గ్రామాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్టుషాపుల మూత విషయంలో చొరవ తీసుకున్న పోలీసులు సారా విక్రయాలను కూడా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.