అంగట్లో అన్నీ కల్తీ.. | market in all adulterated | Sakshi
Sakshi News home page

అంగట్లో అన్నీ కల్తీ..

Published Thu, Jan 29 2015 5:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

అంగట్లో అన్నీ కల్తీ..

అంగట్లో అన్నీ కల్తీ..

సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండాపోయింది. తాగునీరు మొదలు రోగమొస్తే జబ్బును నయం చేసేఔషధాల్లోనూ కల్తీ. మార్కెట్లో దొరికే వస్తువు అస లా..? నకిలీనా..? అని వినియోగదారులకు అంతుచిక్కకుండా వ్యాపారులు కల్తీ చేస్తున్నారు. స్వచ్ఛత లేని.. కల్తీ ఆహార పదార్థాలు తిన డంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కల్తీ పదార్థాలు తిని ఆస్పత్రుల పాలవుతున్న కేసుల సంఖ్య ఉత్తర తెలంగాణ జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

ఇంత జరుగుతున్నా జిల్లాలో ఆహార కల్తీ నిరోధక(ఫుడ్ ఇన్‌స్పెక్టర్) శాఖ మాత్రం కళ్లు తెరవడం లేదు. జిల్లాలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతున్నా పట్టించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంది. పదేళ్ల కాలంలో 3,193 నమూనాలు సేకరించిన అధికారులు.. కేవలం 170 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కల్తీ వ్యాపారంలో ఆరితేరిన కొందరు వ్యాపారులు వినియోగదారులకు గుర్తించలేని విధంగా అన్నింట్లో కల్తీ చేస్తున్నారు. పంటలు పండక.. పంట చేతికందక.. ఆర్థికంగా దెబ్బతిన్న రైతుల దుస్థితిని అవకాశంగా మలుచుకున్న కొందరు వ్యాపారులు అసలు సరుకును కల్తీ చేసి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని భావించిన వినియోగదారులు ముందూ వెనకా ఆలోచించకుండానే ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. చాలా చోట్ల ‘కల్తీ’పై అవగాహన లేని ప్రజలు నాణ్యతలేని సరుకులు తిని ఆస్పత్రి పాలవుతున్నారు.
 
అడ్రస్ లేని అధికారులు..
కల్తీని అరికట్టాల్సిన అధికారులు ఎక్కడుంటారు..? కల్తీ పదార్థాల విక్రయం గురించి ఎవరికి..? ఏ నెంబర్‌పై..? ఎలా ఫిర్యాదు చేయాలో ఫిర్యాదుదారులకు అసలే తెలియదు. కల్తీపై ప్రజల్లో అవగాహన కల్పించలేని అధికారులు.. కనీసం కల్తీపై సమాచారం ఇవ్వాలని కూడా ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు. గ్రామాల పరిస్థితిని పక్కనబెడితే.. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌తోపాటు పట్టణ ప్రాంతాలైన నిర్మల్, మంచిర్యాల, భైంసా, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్‌లోనూ కల్తీ వ్యాపారం జోరుగా జరుగుతోంది. అయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
తనిఖీలేవీ..?
జిల్లా కో గెజిటెడ్ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఉట్నూరు, మంచిర్యాలలో ఆహార భద్రతా అధికారి పోస్టు మంజూరై ఉంది. ప్రస్తుతం గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బాపూతో పాటు మంచిర్యాలలో అధికారి ఉన్నారు. ఉట్నూరుకు చెందిన అధికారి నిజామాబాద్‌లో డెప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. ఉట్నూరు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ ఆ ప్రాంతంతో పాటు ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్రాంతాల్లోని షాపులను తనిఖీ చేయాలి. మంచిర్యాల ఇన్‌స్పెక్టర్ మంచిర్యాలతోపాటు కాగజ్‌నగర్, చెన్నూరు, మందమర్రి ప్రాంతాల్లోని షాపులను తనిఖీ చేయాలి.

గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్  జిల్లా పర్యవేక్షణతోపాటు భైంసా, బోథ్, నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని షాపుల్లో తనిఖీ చేయాలి. కానీ ఆయా ప్రాంతాల్లో తనిఖీలు మాత్రం జరగడం లేదు. ఎవరైన నేరుగా కలిసి ఫిర్యాదులిస్తేనే తప్ప నమూనాలు సేకరించరు. తర్వాత సేకరించిన నమూనాను హైదరాబాద్ నాచారంలోని రాష్ట్ర ఫుడ్ ల్యాబోరేటరీకి పంపుతారు. అక్కడ ఆ పదార్థంలో కల్తీ ఉందని తేలితే షాపు యజమానిపై కేసు నమోదు చేస్తారు. సిబ్బంది కొరత వ ల్ల లక్ష్యం మేరకు తనిఖీలు చేయడం లేదని జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బాపు వివరణ ఇచ్చారు. జిల్లాలో ఆహార, నిత్యావసర వస్తువుల్లో ‘కల్తీ’ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
 
కల్తీ ఇలా..  
- అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్‌లో కిలో ధర 150 ఉంది. కొందరు వ్యాపారులు అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అరటిగెల, ఆలుగడ్డ పేస్ట్ చేసి కిలో రూ.80కు విక్రయిస్తున్నారు.
- పెసరపప్పులో మోట్‌పప్పు కలిపి విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో పెసరపప్పు రిటైల్ ధర కిలో రూ.120 ఉంది. కానీ ఇందులో కిలో రూ.70లు ఉన్న మోడ్ పప్పు కలిపి అమ్ముతున్నారు.
- కందిపప్పు ధర మార్కెట్‌లో రూ.86 ఉంది. కందిపప్పును పోలి ఉండే రూ.35 కిలో ఉన్న బట్రిపప్పును కలిపి విక్రయిస్తున్నారు.
- మార్కెట్‌లో గసగసాలు కిలో ధర రూ.500 వరకు ఉంటుంది. గసగసాల మాదిరిగా ఉండే రూ.120కిలో ఉన్న రాజ్‌గిరాను కలుపుతారు.
- శనగపిండి ధర కిలో 70 ఉంది. అందులో బటానీ పప్పు కిలో రూ.36 కలుపుతారు.
- బిర్యానీ, బగార వంటలకు ఉపయోగించే జాయ్‌పత్రి మార్కెట్‌లో కి లో రూ.2,400, పువ్వు 800 ఉంది. అందులో రూ.వెయ్యి ఉండే రాంపత్రిని కలిపి విక్రయిస్తారు.
- పురుగులు పట్టిన గోధుమలను గిర్నీలో వేసి పిండి పట్టిస్తారు.
- పల్లినూనె కిలో ధర(ప్యాకెట్) రూ.96.. విడిగా రూ.75 ఉంది. దీంతో రూ.21లు తగ్గించాలనే ఉద్దేశంతో వినియోగదారులు చాలామంది విడిగా కొనుగోలు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు పల్లినూనెలో పామాయిల్.. కాటన్‌సీడ్ ఆయిల్.. సోయాబీన్ నూనెలు కలిపి విక్రయిస్తున్నారు.
- పసుపులో రంపపొడి కలుపుతారు.
- పెరుగు గట్టిగయ్యేందుకు అందులో వరి పిండి కలుపుతారు.
- జిలకర్ర కిలో రూ.180 ఉంది. అందులో రూ.85 ధర ఉన్న సోంపు కలుపుతారు.
- బీపీటీ బియ్యం ధర క్వింటాలుకు రూ.3,600 ఉంది. అందులో తక్కువ ధర కలిగిన రేషన్ బియ్యాన్ని రీ స్లైకింగ్ చేసి కలుపుతారు.
- పాలలోనూ పౌడర్ కలుపుతూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement