పోలీస్ అకాడమీ  డైరెక్టర్ హాట్ కామెంట్స్..  | Telangana Police Academy Director Hot Comments | Sakshi
Sakshi News home page

పోలీస్ అకాడమీ  డైరెక్టర్ హాట్ కామెంట్స్.. 

Published Thu, Oct 3 2019 12:40 PM | Last Updated on Thu, Oct 3 2019 2:52 PM

Telangana Police Academy Director Hot Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ పోలీస్ అకాడమీ  డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ఎలాంటి లాభం లేదని, దీని కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న  డబ్బు వృథా అవుతోందని ఆయన గురువారం పేర్కొన్నారు. 

నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ప్రవర్తన సరిగ్గా లేదని ఆయన తప్పుబట్టారు. జైల్‌లో ఉన్నవారు 90 శాతంమంది పేదవారేనని, తినడానికి తిండి కూడా లేనివారే జైళ్లలో మగ్గుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరికొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలీసు అకాడమీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే

డంపింగ్ యార్డ్‌లుగా పోలీస్ అకాడమీలు
నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఐపీఎస్‌లు సైతం ప్రజల్లో పోలీసులుపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నారు. దేశంలోని  పోలీస్ అకాడమీలన్నీ డంపింగ్ యార్డ్‌లుగా మారాయి. ఈ అకాడమీలో పోలీసులు తీసుకుంటున్న శిక్షణ వల్ల సమజానికి ఎలాంటి ఉపయోగం లేదు.  జైలుకు వచ్చే నేరస్తులు తోటి ఖైదీలను చూసి నేరాల్లో చేయడంలో కొత్త టెక్నీక్ నేర్చుకొంటున్నారు. కానీ పోలీసులు మాత్రం వాస్తవానికి అనుగుణంగా ఉండలేకపోతున్నారు.  

బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే నేటికీ..
పోలీసులు సామాజిక కార్యకర్తలగా వ్యవహరించాలి. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళతోటే పోలీసులు స్నేహంగా ఉంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే ఇప్పటికీ కొనసాగుతోంది.  పోలీసులు ప్రభుత్వానికి జవాబుదారీ కాదు.. చట్టానికి, న్యాయానికి మాత్రమే జవాబుదారీ. అకాడమీలో ఇస్తున్న శిక్షణ గ్రౌండ్ లెవల్‌కు లింకై ఉండాలి. పోలీస్ శిక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. కానీ దానివల్ల ఎలాంటి లాభం లేదు.

పోలీస్ శిక్షణ కేంద్రాలు కాలేజ్‌లు, స్కూళ్లు కావు. ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తించాలనేది శిక్షణలో నేర్పించాలి. పోలీసులు చెప్పిన మాట ప్రజలు వింటున్నారు. అయినా, ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు. దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రజలకు విరుద్ధంగా ఉంది. దేశంలో ఎంతమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రజల నుంచి ప్రశంసలు లభించడం లేదు.  

అది నన్ను తీవ్రంగా బాధించింది
ఎస్పీ నుండి ఎస్‌హెచ్‌వో వరకు గ్రౌండ్ లెవల్‌లో వారి పనితీరు ఆధారంగా అబ్జర్వేషన్‌ రిపోర్ట్‌ను డీజీకి అందజేస్తున్నాం. ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలి. దీనిపై డీజీపీ కూడా హామీ ఇచ్చారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బాధ్యతలు తీసుకున్న తరువాత నూతన మార్పులు తీసుకొస్తున్నాను. వ్యక్తిత్వ వికాసం, కౌన్సెలింగ్ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. ఈ నెల 24న ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్‌కి నూతన పద్ధతులను అమలు చేస్తాం. పోలీస్ ఆఫీసర్ కావాలంటే.. దేహ దారుఢ్యం అవసరం లేదు. దివ్యాంగులు కూడా పోలీస్ ఆఫీసర్ కావొచ్చు. పోలీస్ ఆఫీసర్‌కి వ్యక్తిత్వం ఉండాలి, బాధితులు పట్ల సానుభూతి ఉండాలి. అవినీతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్న ఓ సర్వే నన్ను తీవ్రంగా బాధించింది. వ్యవస్థను మార్చలేను కానీ, శిక్షణలో మార్పులు తీసుకొస్తా.

గతంలోనూ సంచలన వ్యాఖ్యలు
ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న వీకే సింగ్‌ను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసి.. పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రిటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా ఉన్న సమయంలోనూ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని, తెలంగాణ కోసం ఓ మిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. తాను తీసుకొచ్చే మిషన్‌ పాలసీలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని తెలిపిన ఆయన.. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. జైళ్ల శాఖలో విధులు నిర్వర్తించిన సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్టు తెలిపారు. 

అయితే కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం తనను స్టేషనరీ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగంలో చేయడానికి పని లేదని.. దీనిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. ఈ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వానికి రూ. 50 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. ఇక్కడ పనిచేసే వాళ్లు ఉన్నా.. వారికి రోజుకు 2 గంటలు మాత్రమే పని ఉంటుందన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement