సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంపుతో బీజేపీకి ప్రయోజనాలేమిటనే దానిపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తర్జనభర్జన పడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాలను 2019 నాటికి 153కు పెంచాలని విభజన చట్టం పేర్కొంటోంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కల్పించుకుంటే తప్ప శాసనసభ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదు. ఈ నియోజకవర్గాల పెంపుతో రాష్ట్రంలో బీజేపీకి ప్రయోజనమా? కాదా? అనేదానిపై బీజేపీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు సంపాదించడంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతతో వచ్చే ఎన్నికల్లో ఉత్తరాదిన బీజేపీకి లోక్‌సభ సీట్లు తగ్గుతాయని... ఆ మేరకు దక్షిణాదిన పెంచుకోవాలనే వ్యూహంలో బీజేపీ జాతీయ పార్టీ ఉంది.
ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టి కేంద్రీకరించారు. దీనిపై పార్టీ రాష్ట్ర నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉంటున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, ఇతర పార్టీలకు చెందిన నాయకులు చాలామంది చేరుతూనే ఉన్నారని... వారికి పెరగనున్న స్థానాల్లో అవకాశం కల్పిస్తామంటూ టీఆర్‌ఎస్ ఆశ చూపుతోందనే అంచనాకు బీజేపీ నేతలు వచ్చారు. స్థానాలు పెరగకుం టే... ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి పెరిగి, ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వస్తారని భావిస్తున్నారు. స్థానాలు పెరిగితే... టీఆర్‌ఎస్‌లోకి వలస లు పెరుగుతాయని ఇది బీజేపీ విస్తరణకు అవరోధంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే అభిప్రాయంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు, కేంద్రానికి నివేదికలు కూడా ఇచ్చినట్టు పార్టీ నేతలు వెల్లడించారు.
నియోజకవర్గాల పెంపుతో మనకేం లాభం?
Published Sun, Jun 5 2016 3:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement