'ఏపీలో బీజేపీ శిశువులాంటిది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అప్పుడే పుట్టిన శిశువులాంటిదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుచేత ఆ పార్టీ భవిష్యత్తును అప్పుడే చెప్పడం కష్టమన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన కాంగ్రెస్ నేతలు వీహెచ్, గీతారెడ్డిలతో మాటామంతీ నిర్వహించారు. దీనిలో భాగంగానే మీడియాతో మాట్లాడిన జేసీ.. రుణమాఫీ విషయంలో బ్యాంకులు ఒత్తిడి చేయనంతవరకూ కష్టమేమీ ఉండదన్నారు. అయితే కొత్త అప్పులు ఇవ్వకపోతే మాత్రం ఏపీ రైతులు రోడ్డెక్కుతారని తెలిపారు. ఏపీలో బీజేపీ శిశువులాంటిదని.. ఆ పార్టీ భవిష్యత్తు అప్పుడే చెప్పలేమన్నారు. ఐదారేళ్ల వరక చంద్రబాబు సర్కారుకు ఇబ్బంది ఏమీ లేదన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిలబడిందన్నారు.
ఇక ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేవలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ అంటున్నారే తప్ప కాంగ్రెస్ అని ఎవరూ చెప్పడం లేదన్నారు. అనంతపురంలో తాగునీటి సమస్యలతో ప్రజలు, రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని జేసీ తెలిపారు. తెలంగాణకు కరెంటు, నీటి కష్టాలు తప్పవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భవిష్యత్తులో సమైక్యాంధ్ర కోసం తెలంగాణ నుంచే డిమాండ్ వస్తుందేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పట్లో నీటి కష్టాల కోసమే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశామని జేసీ పేర్కొన్నారు.