నీది తెనాలే.. నాది తెనాలే!!
రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చేయడంలో కీలకపాత్ర పోషించిన రెండు పార్టీలూ ఇప్పుడు ఒకటవుతున్నాయి. ఇద్దరం ఒకే కోవకు చెందుతామంటూ చేతులు కలుపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తమకు అభ్యంతరం ఏమీ లేదంటూ చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం, ఆ తర్వాతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇక పార్లమెంటు ఉభయ సభలలోనూ బిల్లు సజావుగా ఆమోదం పొందడానికి ప్రధాన కారణం బీజేపీయే. ఆ పార్టీ మద్దతు లేకపోతే యూపీఏ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందగలిగేది కానే కాదు. ఇలా.. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన ఈ రెండు పార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోడానికి దాదాపుగా నిర్ణయించేశాయి. ఇక అధికారికంగా ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉంది.
రెండు ప్రాంతాల్లోనూ పొత్తు ఉండాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టడంతో బీజేపీ అగ్రనేతలు పొత్తును దాదాపుగా ఖరారు చేసేశారు. అందులో భాగంగానే అరుణ్ జైట్లీ దూతగా ప్రకాష్ జవదేకర్ రాష్ట్రానికి వచ్చి, ఇరు ప్రాంతాల నాయకుల అభిప్రాయం తెలుసుకుంటూ, వారికి నచ్చజెబుతున్నారు. జాతీయస్థాయిలో ఈసారి కచ్చితంగా ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడుతుందని, అయితే అందుకు కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా అవసరం అవుతుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ప్రధానంగా ఉత్తరభారతంలో కొంతవరకు ఆ పార్టీకి పట్టున్నా, దక్షిణాదిన మాత్రం అంతగా లేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే అధికారాన్ని చేపట్టగలిగినా, అది ఏమైందో కూడా అందరికీ తెలుసు. దాంతో దక్షిణాదిన తప్పనిసరిగా పొత్తులు పెట్టుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తును ఖరారు చేసేందుకు వచ్చిన జవదేకర్ వద్ద కొంతమంది రాష్ట్ర నేతలు తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేసినా, తర్వాత మాత్రం సరేనన్నట్లు తెలుస్తోంది.