సైకిల్ చక్రం కింద కమలం రేకలు!
పొత్తయితే పెట్టుకున్నాం కానీ ప్రచారం ఎలా చేయాలి..? ఎలా కలిసి పనిచేయాలి..? కేడర్ సహకరిస్తుందా..? ఇప్పుడు బిజెపి, టీడీపీల పరిస్థితి తమ పిల్లలకు ఇష్టం లేని పెళ్లి చేసిన తల్లిదండ్రుల్లాగానే ఉంది.
ఇష్టమున్నా లేకపోయినా ఒక్కసారి పొత్తు పెట్టుకున్న తర్వాత అందరినీ కలుపుకుపోవాల్సిందేనని బీజేపీ, టీడీపీల అధినాయకులు వాదిస్తున్నారు. కానీ ఇరు పార్టీల నేతలు మాత్రం ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఈ అసంతృప్తి నేపథ్యంలో ఏం చేయాలనే అంశంపై ఇరు పార్టీల నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఉదాహరణకు సికింద్రాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ రెండు పార్టీల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. పొత్తులపై పూర్తి అవగాహన రాకపోవడంతో ఇరు పార్టీల డివిజన్ స్థాయి నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కలసి కూర్చుని చర్చిస్తేనే కలిసి పనిచేయడం సాధ్యమవుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఇరు పార్టీల రాష్ట్ర శాఖ అధ్యక్షులు కలిసి ప్రకటన చేసినా బాగుంటుందని భావిస్తున్నారు.
కాగితం పై ఉన్న లెక్కల మేరకు బిజెపి, టీడీపీ పొత్తు నిజామాబాద్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్లలో బిజెపికి, మల్కాజిగిరి, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, జహీరాబాద్ లలో టీడీపీకి మేలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే కాగితం లెక్కలను వాస్తవంగా మార్చడానికి చాలా కాలం పడుతుందని ఇరు పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. ఇరు పార్టీల పెద్దలు 'తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి' అన్నట్టు వ్యవహరిస్తున్నారని కింది స్థాయి లీడర్లు, క్యాడర్లు విమర్శిస్తున్నారు.